-విభిన్న ప్రతిభావంతుల సంక్షేమానికి రెండేళ్లలో 37కోట్లు మంజూరు
-16.5 కోట్లతో 1750 మందికి మూడు చక్రాల మోటరైజ్డ్ స్కూటర్ల పంపిణీ
-నూతన ఛైర్‌పర్సన్ ముంతాజ్ పఠాన్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విభిన్న ప్రతిభావంతుల సంక్షేమానికి గత రెండేళ్ళల్లో ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి 37 కోట్ల రూపాయలు మంజూరు చేయటం జరిగిందని ఉపకరణాలతో పాటు ఈ ఏడాది 16. 5 కోట్ల రూపాయల ఖర్చుతో 1750 మంది మూడు చక్రాల మోటరైజ్డ్ స్కూటర్‌ను పంపిణీ చేయనున్నట్లు విభిన్న ప్రతిభావంతులు, వయోవృద్ధుల సహాయ సంస్థ ఛైర్‌పర్సన్‌గా పదవీ బాధ్యతలు చేపట్టిన ముంతాజ్ పఠాన్ తెలిపారు. ఆంధ్రప్రదేవ్ విభిన్న ప్రతిభావంతులు, వయోవృద్ధుల సహాయ సంస్థ చైర్మన్‌గా నియమితులైన ముంతాజ్ పఠాన్ సోమవారం విజయవాడ అశోక నగర్లో గల సంస్థ ప్రధాన కార్యాలయంలో ప్రమాణ స్వీకారం చేసి బాధ్యతలను స్వీకరించారు.
ఈ సందర్భంగా ముంతాజ్ పఠాన్ మాట్లాడుతూ విభిన్న ప్రతిభావంతులు ఆత్మసైర్యాన్ని పెంపొందించి వారికి ఆర్థికంగా చేయూత నందించేందుకు కృషి చేస్తానన్నారు. ముఖ్యమంత్రి వై.యస్. జగన్మోహన్ రెడ్డి విభిన్న ప్రతిభావంతులుపై వున్న మమకారంతో వారిని అన్ని విధాలుగా ఆదుకోవాలనే ఉద్దేశ్యంతో ఎన్ని ఆర్థిక ఇబ్బందులు వున్నప్పటికి 37 కోట్ల రూపాయలు వాటి సంక్షేమానికి నిధులు కేటాయించినట్లు ఆమె తెలిపారు. 1750 మందికి శారీరక విభిన్న ప్రతిభావంతులకు మూడు చక్రాల మోటరైజ్డ్ స్కూటర్లను 16. 5 కోట్ల రూపాయల ఖర్చుతో త్వరలో పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ప్రభుత్వం కల్పించే సంక్షేమ పథకాలతో ఉపకరణాలను సకాలంలో విభిన్న ప్రతిభావంతులకు అందించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ముఖ్యమంత్రి తనపై నమ్మకం వుంచి ఛైర్మన్ పదవికి ఎంపిక చేసినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నామని ఆయన ఆశయాలకు అనుగుణంగా పనిచేసి విభిన్న ప్రతిభావంతులకు సేవ చేస్తానని అని ఆమె తెలిపారు.
సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ఎంఎ కుమార్ రాజా మాట్లాడుతూ విభిన్న ప్రతిభావంతులు, వయోవృద్ధుల సహాయ సంస్థ ద్వారా అనేక కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని అన్నారు. విభిన్న ప్రతిభావంతుల సంక్షేమానికి గతఏడాది 12 కోట్ల రూపాయలు ప్రభుత్వం మంజూరు చేయటం జరిగిందని 2020-21 సంవత్సరానికి బడ్జెట్ లో 25 కోట్ల రూపాయలు మంజూరుచేసినట్లు ఆయన తెలిపారు. సహకార సంస్థ ద్వారా విభిన్న ప్రతిభా వంతులకు మూడు చక్రాల సైకిళ్ళు, వీల్ ఛైర్, కృత్రిమ అవయావాలు పంపిణీ చేయటం జరిగిందన్నారు. బదిరులకు వినికిడి యంత్రాలు, స్మార్ట్ ఫోన్లు, అంధులకు, ల్యాప్
టాప్లు, డైసిప్లేయర్లు, ఎంపి 3 ప్లేయర్లు , బ్రెయిలీ ఉపకరణాలు, పాఠ్యపుస్తకాలు, వాకింగ్ స్టిక్స్, స్మార్ట్ కేన్స్ తదితర ఉపకరణాలను పంపిణీ చేస్తున్నామన్నారు. వయోవృద్ధులకు ఎంసిఆర్ పాదరక్షకులు, కళ్ళజోళ్ళు, చేతికర్రలు, వీల్ ఛైర్స్, వినికిడి యంత్రాలను అందిస్తున్నామన్నారు. విభిన్న ప్రతిభావంతులకు పెయింటింగ్, వెల్డింగ్, షీట్ మెటల్, కార్పెంటరీ వంటి వృత్తివిద్యా కోర్సులలో శిక్షణ అందిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ ఏడాది మూడు చక్రాల మోటరైజ్డ్ స్కూటర్లను పంపిణీ చేసేందుకు సిద్ధం చేస్తున్నామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం బ్రెయిల్ ప్రెస్ ఏర్పాటు చేసేందుకు నూతన భవనం నిర్మించేందుకు 35 లక్షలరూపాయలు మంజూరు చేయటం జరిగిందని గుంటూరులో ప్రారంభించిన నూతన భవనంలో బ్రెయిలీ ప్రెస్ ను ఏర్పాటు చేసి 1వ తరగతి నుండి 10వ తరగతి వరకు పాఠ్యపుస్తకాలను ముద్రించి విద్యార్థిని, విద్యార్థులకు సరఫరా చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో శాసన మండలి సభ్యులు లేళ్ళ అప్పిరెడ్డి, విజయవాడ తూర్పు నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ బొప్పన భవకుమార్, విభిన్న ప్రతిభా వంతులు మరియు వయోవృద్ధుల సహాయ సంస్థ జనరల్ మేనేజర్ కె. వెంకటరత్నం, సంస్థ సిబ్బంది, స్థానిక ప్రజా ప్రతినిధులు, విభిన్న ప్రతిభావంతులు తదితరులు పాల్గొన్నారు.