Breaking News

మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం పెద్దపీట : ఎమ్మెల్యే మల్లాది విష్ణు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రజలకు మౌలిక సదుపాయాల కల్పనకు రాష్ట్ర ప్రభుత్వం పెద్ద పీట వేస్తోందని విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు మల్లాది విష్ణు  అన్నారు. గుడ్ మార్నింగ్ విజయవాడ సెంట్రల్ కార్యక్రమంలో భాగంగా 1 వ డివిజన్ లోని షిరిడీసాయి నగర్, ప్రశాంత్ నగర్ లలో కార్పొరేటర్  ఉద్ధంటి సునీత సురేష్ తో కలిసి ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా డివిజన్ లో జరుగుతున్న ప్రగతి పనులను పరిశీలించారు. షిరిడీ సాయి నగర్ లో ఇటీవల నిర్మించిన రోడ్లను పరిశీలించిన ఆయన.. మిగిలిన లింక్ రోడ్లను కూడా త్వరలోనే పూర్తిచేయవలసిందిగా అధికారులకు సూచించారు. అనంతరం గడప గడపకు వెళ్లి స్థానిక సమస్యలపై ఆరా తీశారు. తక్కువ ఎత్తులో ఉన్న విద్యుత్ స్తంభాలను మార్చాలని.. పలుచోట్ల కొత్త వీధి దీపాలను అమర్చాలని సిబ్బందిని ఆదేశించారు. భవిష్యత్తు అవసరాల దృష్ట్యాలో డివిజన్ లోని చివరి కాలనీ వరకు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సదుపాయం కల్పించే విధంగా ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు. త్రాగునీరు ప్రతి ఒక్క ఇంటికి అందే విధంగా పైపులైన్లను, మురుగు పారుదలకి సైడ్ కాల్వలను నిర్మించాలన్నారు. బుడమేరు కాలవలో పూడికతీతకు ఒక పడవను ప్రత్యేకంగా కేటాయించి ఎప్పటికప్పుడు చెత్తను తొలగించాలన్నారు.

అనంతరం మల్లాది విష్ణు  మీడియాతో మాట్లాడారు. గడిచిన రెండేళ్లలో రాష్ట్ర ప్రభుత్వం చేసిన సంక్షేమం, అభివృద్ధి కళ్ల ముందు కనిపిస్తుండటంతో.. ప్రజలందరూ సంతోషం వ్యక్తం చేస్తున్నారన్నారు. డివిజన్ లో గ్రామ సచివాలయ వ్యవస్థ సమర్థవంతంగా పనిచేస్తోందని వెల్లడించారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా మన రాష్ట్రంలో ప్రభుత్వ పథకాలను.. డోర్ డెలివరీ చేయడం జరుగుతోందన్నారు. ఆగష్టు నెల క్యాలెండర్ లోని సంక్షేమ పథకాలను ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. మరోవైపు ఈ ప్రాంతంలో ట్రాఫిక్ సమస్యను పరిష్కరించేందుకు గాను ఆర్వోబీ తొలిదశ పనులకు రూ. 22 కోట్లు కేటాయించడం జరిగిందన్నారు, అక్టోబర్ నాటికి స్టేజ్ – 2 పనులకు సంబంధించి టెండర్లను ఆహ్వానిస్తామన్నారు. దీనికితోడు సంగం రోడ్డు – ఔటర్ రింగ్ రోడ్డు కలుపుతూ బీటీ రహదారి నిర్మాణ పనులను చేపట్టనున్నట్లు వెల్లడించారు. బుడమేరుపై రెండు వంతెనలు మంజూరు అయ్యాయని.. త్వరలోనే పనులకు శంకుస్థాపనలు చేస్తామన్నారు. సంక్షేమం, అభివృద్ధితో పాటుగా మహిళల భద్రతకూ రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని ఈ సందర్భంగా మల్లాది విష్ణు గారు తెలియజేశారు. ఇందులో భాగంగా దిశ చట్టాన్ని తీసుకురావడం జరిగిందన్నారు. ప్రతి ఒక్క మహిళ దిశ యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవాలని.. యాప్ వినియోగంలో నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలపాలన్నారు. అన్ని శాఖల సమన్వయంతో డివిజన్ ను త్వరలోనే ఒక మోడల్ డివిజన్ గా తీర్చిదిద్దుతామని మల్లాది విష్ణు గారు ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు మహేశ్వర్ రెడ్డి, ప్రసాద్ రెడ్డి, LIC శివ, రమణి, సత్యవతి, అబ్దుల్లా, వీఎంసీ అధికారులు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.

Check Also

వరద బాధితులకు విరాళాల వెల్లువ

-సీఎం చంద్రబాబును కలిసి చెక్కులు అందించిన దాతలు అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : అనూహ్య వరదలతో నిర్వాసితులైన బాధితులకు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *