రాష్ట్రస్థాయి స్వాతంత్య దినోత్సవం నిర్వహణా ఏర్పాట్లపై సమీక్ష…

-జిల్లా కలెక్టరు, పోలీస్ కమిషనర్, తదితరులతో కలిసి స్టేడియం పరిశీలించిన సియం కార్యక్రమాల
సమన్వయకర్త తలశిల రఘురామ్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రస్థాయి 75వ స్వాతంత్య దినోత్సవ నిర్వహణకు విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం ప్రాంగణాన్ని సన్నద్ధం చేయాలని సంబంధిత అధికారులను జిల్లా కలెక్టరు జె. నివాస్ ఆదేశించారు. స్థానిక ఇందిరాగాంధి మున్సిపల్ స్టేడియంలోని క్రీడాప్రాధికార సంస్థ హాలులో మంగళవారం సాయంత్రం వివిధ శాఖల అధికారులతో సమీక్షించి స్టేడియంలో చేపట్టవల్సిన ఏర్పాట్లను ముఖ్యమంత్రి కార్యక్రమాల సమన్వయకర్త తలశిల రఘురామ్, నగర పోలీస్ కమిషనరు బత్తిన శ్రీనివాసులు, వియంసి కమిషనరు వి.ప్రసన్న వెంకటేష్ తో కలిసి కలెక్టరు జె. నివాస్ పరిశీలించారు.
ఈసందర్భంగా కలెక్టరు జె.నివాస్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వులను అనుసరించి రాష్ట్ర స్థాయి స్వాతంత్య దినోత్సవ వేడుకలను ఆగష్టు 15న విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో నిర్వహించేందుకు పటిష్టమైన ఏర్పాట్లు చేయాలన్నారు. గౌ. రాష్ట్ర ముఖ్యమంత్రి జాతీయ జెండాను ఆవిష్కరించి గౌరవ వందనాన్ని స్వీకరిస్తారన్నారు. స్టేడియానికి అవసరమైన కొన్ని మరామ్మత్తులను చేపట్టి రంగులు వేసి సుందరంగా తీర్చిదిద్దాలని వియంసి కమిషనరుకు కలెక్టరు సూచించారు. స్టేడియం గ్రౌండు చుట్టూ త్రివర్ణ రంగులతో కూడిన క్లాత్ తో అలంకరించాలన్నారు. పోలీస్ కవాతులో పాల్గొనే సిబ్బంది అందరికీ కోవిడ్ టెస్టు నిర్వహించాలన్నారు. కవాతులో నిర్దేశించిన మేరకు బృందాలకు అదనంగా మరో బృందాన్ని సిద్ధం చేస్తున్నట్లు పోలీస్ అధికారి రామకృష్ణ కలెక్టరుకు తెలిపారు. పోలీస్ కవాతు రిహార్సలు ఆగష్టు 5వ తేదీ నుండి నిర్వహించడం జరుగుతుందన్నారు. అదేవిధంగా ఆగష్టు 13వ తేదీన డ్రస్ రిహార్సల్ ఉంటుందన్నారు. పోలీస్ కవాతులో పాల్గొనే కంటెంజెంట్లకు అవసరమైన వసతి సౌకర్య ఏర్పాట్లు చేయాలని సంబంధి తాధికారులను కలెక్టరు ఆదేశించారు. వర్షం పడినా ఇబ్బంది లేని రీతిలో స్టేడియంలో ఏర్పాట్లు చేయాలని అందుకు అవసరమైన వాటర్ ఫ్రూఫ్ షామియానాలు వేయాలన్నారు. మరీ ముఖ్యంగా పారిశుద్ధ్యానికి ప్రత్యేక ప్రాధాన్యతనిచ్చి స్టేడియంలోపల, వెలుపల పరిశుభ్రత ఉండేలా చూడాలన్నారు. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో హాజరయ్యే ఆహ్వానితులకు సిట్టింగ్ ను భౌతికదూరం పాటించేలా ఏర్పాటు చేయాలన్నారు. స్టేడియంలోని 3 ప్రవేశ ద్వారాల వద్ద ఎక్కువ స్థాయిలో థర్మల్ స్కానర్లు, శానిటేషన్ ఏర్పాట్లు చేయాలన్నారు. విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో సభాప్రాంగణంలో నిరాటంకంగా విద్యుత్ సరఫరా కల్పించాలని, జన రేటర్లను ఏర్పాటు చేయాలన్నారు. విజయవాడ నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో త్రాగునీరు సరఫరా, పారిశుద్ధ్య పనులు చేపట్టాలన్నారు. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా నగరంలోని రాజ్ భవన్, స్టేట్ గెస్ట్ హౌస్ ఇతర ప్రధాన కార్యాలయ భవనాలను విద్యుత్ దీపాలతో అలంకరణ చేయాలన్నారు. కార్యక్రమం వ్యాఖ్యాతల వేదిక స్టేడియం అంతా నలుదిశలా కవరేజీ చేసుకునే విధంగా ఏర్పాటు చేయాలన్నారు. నగర పోలీస్ కమిషనరు బత్తిన శ్రీనివాసులు మాట్లాడుతూ కోవిడ్ నేపథ్యంలో కేవలం పరిమిత సంఖ్యలో ఆహ్వానితులు మాత్రమే ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతుందన్నారు. ఆహ్వానితులు ఆగష్టు 15 ఉదయం 8.45 గంటల లోపులోనే ఐయంజి స్టేడియం ప్రాంగణానికి చేరుకోవాలని ఆయన సూచించారు. వర్షాలను దృష్టిలో ఉంచుకుని గ్రౌండులో విద్యుత్ వైరింగ్ లో షార్ట్ సర్క్యూట్ లకు తావులేకుండా పటిష్టమైన ఏర్పాట్లు చేయాలన్నారు. విఐపి పార్కింగ్ లో ఏర్పాట్ల పై కూడా ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. సమావేశంలో ప్రొటోకాల్ డైరెక్టరు బాలసుబ్రహ్మణ్య రెడ్డి, జాయింట్ కలెక్టర్లు కె. మాధవిలత, కె. మోహన్ కుమార్ , డిసిపి విష్ణువర్ధన్ రాజు, డిఆర్ ఓ యం. వెంకటేశ్వర్లు, సబ్ కలెక్టరు జి.యస్.యస్. ప్రవీణ్ చంద్, వివిధ శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

4వేల ఎక‌రాల ల్యాండ్ బ్యాంక్ ఉంది

-పామాయిల్ సాగును పెద్ద ఎత్తున ప్రోత్స‌హిస్తున్నాం -త‌ల‌స‌రి ఆదాయం రూ.4ల‌క్ష‌ల‌కుపైగా సాధాన ల‌క్ష్యం -ఏలూరు జిల్లా క‌లెక్ట‌ర్ వెట్రిసెల్వి అమ‌రావ‌తి, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *