అకాడమి ద్వారా ఉర్దు భాషాభివృద్ధికి కృషి చేస్తాం…

-విద్యద్వారానే సామాజిక ఆర్థికాభివృద్ధి సాధ్యం…
-అంబేద్కర్, పూలే ఆశయాల బాటలోనే మైనారిటీల సంక్షేమానికి జగన్మోహన రెడ్డి ప్రభుత్వం కృషి…
-రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, మైనారిటీ సంక్షేమ శాఖా మంత్రి అంజాద్ భాషా

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర ఉర్దు అకాడమి ఛైర్మన్ పదవికి వన్నె తెచ్చేవిధంగా నదీం అహ్మద్ విధులు నిర్వహించాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, మైనారిటీ సంక్షేమ శాఖా మంత్రి అంజాద్ భాషా సూచించారు. బుధవారం హౌసింగ్ బోర్డు కాలనీ లో గల ఉర్దు అకాడమి కార్యాలయంలో రాష్ట్ర దేవాదాయ శాఖా మంత్రి వెలంపల్లి శ్రీనివాస్, మైనారిటీ సంక్షేమ శాఖా మంత్రి అంజాద్ భాషాల సమక్షంలో అకాడమీ చైర్మన్ గా జనాబ్ హెచ్. నదీం అహ్మద్ పదవీ బాధ్యతలను స్వీకరించారు. ఈసందర్భంగా ఉపముఖ్యమంత్రి, మైనారిటీ సంక్షేమ శాఖామంత్రి అంజాద్ భాషా మాట్లాడుతూ ప్రతీ పౌరుడు కనీస విద్యను అభ్యసించినప్పుడే అభివృద్ధి సాధ్యపడుతుందని విద్య ద్వారానే సామాజిక న్యాయం వస్తుందనే అబ్దుల్ కలాం ఆశయాలకు రాష్ట్ర ముఖ్యమంత్రి జవజీవాలను తీసుకొస్తున్నారన్నారు. అత్యంత ప్రాధాన్యత కలిగిన ఉర్దు అకాడమీకి ఛైర్మన్ ను ఏర్పాటు చేయడం ద్వారా ప్రతీ ముస్లింకు ఉర్దు భాషలో విద్యనందించి ఉర్దు భాషాభివృద్ధికి కృషి చేస్తున్నారన్నారు. సమాజంలో అన్నివర్గాలకు ప్రాధాన్యత కల్పించిన ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన రెడ్డి మాత్రమే అన్నారు. వివిధ కార్పోరేషన్లకు చెందిన 136 ఛైర్మన్ పదవుల్లో 12 మంది ముస్లింలకు ప్రాధాన్యత కల్పించి ముస్లింలకు పెద్ద పీట వేసారన్నారు. ఇది చారిత్రాత్మక నిర్ణయంగా నిలిచిపోతుందన్నారు.
పదవీ బాధ్యతలు చేపట్టిన ఛైర్మన్ నదీం అహ్మద్ మాట్లాడుతూ బాబాసాహెబ్ అంబేద్కర్ , జ్యోతిరావు పూలే ఆశయాలకు అనుగుణంగా యస్ సి, యటి, బిసి, మైనారిటీ, బలిజ సామాజిక వర్గాల వారికి ఆర్థిక ప్రయోజనం చేకూరేలా అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్న ఏకైక ముఖ్యమంత్రి వై.యస్. జగన్మోహన రెడ్డి మాత్రమే అన్నారు. సంక్షేమంలో అభివృద్ధి దాగి ఉందని, అది ప్రతిపక్షాలకు కానరావడం లేదన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన రెడ్డి ప్రజలకు సేవలు అందించే వివిధ పదవుల్లో ముస్లిం వర్గానికి 50 శాతం రిజర్వేషన్ కేటాయించారని దీనిలో భాగంగానే ఉర్దు అకాడమీకి ఛైర్మన్ గా పదవి కేటాయించినందులకు ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాన్నారు. మైనారిటీ సామాజిక వర్గానికి పెద్ద పీట వేయడంతో ముస్లిం వర్గాలలో ఎంతో బాధ్యత పెరిగిందని ఆయన అన్నారు. ఉర్దు భాషాభివృద్ధికి తన శక్తి వంచన లేకుండా పాటుపడడంతో పాటు మైనారిటీ వర్గాల సంక్షేమానికి కృషి చేస్తానన్నారు. జ్యోతీరావు బాపూలే ఆదర్శంగా సంక్షేమం, అభివృద్ధికి, యువతకు సహాయం చేయడంలో అకాడమీ సేవలు సద్వినియోగం చేసుకొనేలా అకాడమీ పనిచేస్తున్నదన్నారు. ముఖ్యమంత్రి సహకారంతో ఉర్దు భాష విషయంలో ఉన్న లోపాలు తొలగించి అకాడమీ ద్వారా వరల్డ్ క్లాస్ భాషగా ఉర్దు భాషకు మరింత గుర్తింపు తెచ్చి యువతలో ఉర్దుభాషపట్ల మక్కువ పెరిగేలా భాషాభివృద్ధికి కృషి చేస్తానని ఇందుకు అల్లా దీవెనలను కోరుకుంటున్నానన్నారు.
ఈ సందర్భంగా మంత్రులు వెలంపల్లి శ్రీనివాసరావు, అంజాద్ భాషాలు ఉర్దు అకాడమీ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన నదీం అహ్మద్ ను దుశ్శాలువాతో సత్కరించి అభినందించారు. తొలుత ముస్లిం మత పెద్దలు ప్రార్ధనలు జరిపి ఛైర్మన్ ను ఆశీర్వదించారు. ఈ ప్రమాణస్వీకారోత్సవ కార్యక్రమంలో కదిరి శాసనసభ్యులు సిద్ధారెడ్డి, అనంతపురం ఎమ్మెల్సి వెన్నపూస రాజగోపాల్ రెడ్డి, ఎమ్మెల్సీ కరీమున్నీసా, మైనారిటీ కార్పోరేషన్ ఛైర్మన్ యస్.కె. అసీఫ్, 41వ డివిజన్ కార్పోరేటర్ యండి. ఇర్ఫాన్, 42వ డివిజన్ కార్పో రేటర్ పగడపాటి చైతన్య రెడ్డి, 54వ డివిజన్ కార్పో రేటర్ అబ్దుల్ అఖీద్ హర్షద్, తదితరులు పాల్గొన్నారు.

Check Also

జాబ్ మేళా

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : తిరుపతి లోని గవర్నమెంట్ ఐటిఐ కళాశాల, పద్మావతి పురం నందు జాబ్ మేళా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *