Breaking News

నూతన రైల్వే ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణానికి అత్యున్నతమైన డిజైన్లు రూపొందించటం జరిగింది…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
గుంటూరు నగరాభివృద్దిని దృష్టిలో ఉంచుకొని , భవన యజమానులకు, వ్యాపారులకు వీలైనంతగా ఇబ్బందులు తగ్గించేలా శంకర్ విలాస్ వద్ద నూతన రైల్వే ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణానికి అత్యున్నతమైన డిజైన్లు రూపొందించటం జరిగిందని జిల్లా కలెక్టర్ ఎస్ నాగలక్ష్మీ తెలిపారు.
మంగళవారం కలెక్టరేట్ లోని డీఆర్సీ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ ఎస్ నాగలక్ష్మీ జిల్లా ఎస్పీ సతీష్ కుమార్, నగరపాలక సంస్థ కమిషనరు పులి శ్రీనివాసులు, ఆర్ అండ్ బీ ఎస్ఈ శ్రీనవాస మూర్తి తో కలసి శంకర్ విలాస్ వద్ద నూతన రైల్వే ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణంపై విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఎస్ నాగలక్ష్మీ మాట్లాడుతూ శంకర్ విలాస్ వద్ద ప్రస్తుతం ఉన్న రెండు వరుసల ఆర్వోబీ స్థానంలో నూతనంగా నాలుగు లైన్లతో ఆర్వోబీ నిర్మించటానికి కేంద్ర ప్రభుత్వం మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ మరియు హైవే శాఖ రూ.98 కోట్లు కేటాయించిందన్నారు. నూతన ఆర్వోబీ హిందూ కళాశాల వైపు మహిళ కళాశాల జంక్షన్ నుంచి లాడ్జి సెంటరు వైపు అరండపేట 9వ లైను వరకు 930 మీటర్లు పొడవు ఉంటుందని, బ్రిడ్జి క్రింద అరండల్ పేట 4వ లైను వద్ద 18 మీటర్లు వెడల్పుతోను, అరండల్ పేట 5వ లైను వద్ద, గుంటూరు ప్రభుత్వ సమగ్ర ఆసుప్రతి వద్ద 14 మీటర్లు వెడల్పుతో అండర్ పాస్ లను ఏర్పాటు చేయటం జరుగుతుందన్నారు. బ్రిడ్జ్ విస్తరణకు సమీపంలోని 134 భవనాలలో కొంత స్థలం సేకరించటం జరుగుతుందన్నారు. బ్రిడ్జి నిర్మాణానికి అవసరమైన నిధులు మంజూరుకు కేంద్ర గ్రామీణాభివృద్ధి మరియు కమ్యూనికేషన్ శాఖ సహాయ మంత్రి డా. పెమ్మసాని చంద్రశేఖర్ గారి చొరవ వలన ఎంఓఆర్టీ అండ్ హెచ్ 16-10-2024 న పరిపాలన అనుమతులు మంజూరు చేసిందన్నారు. బ్రిడ్జి నిర్మాణానికి సంబంధించి కేంద్ర మంత్రి సంబంధిత శాఖల జిల్లా అధికారులతోను, ఇతర భాగస్వాములతోను సమావేశాలు నిర్వహించి అవసరమైన అనుమతులు మంజూరు చేయించారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం 24-02-2025 బ్రిడ్జ్ నిర్మాణానికి పరిపాలన అనుమతులు జారీ చేసిందని, 28-02-2025 ఎన్హెచ్ మరియు సీఆర్ఎఫ్ ఇంజనీర్ ఇన్ చీఫ్ టెక్నికల్ శాంక్షన్ చేయటంతో 10-03-2025 న టెండర్లు పిలవటం జరిగిందన్నారు. టెండర్ల టెక్నికల్ బిడ్ 28-03-2025 ఓపెన్ చేయగా ఇద్దరు బిల్డర్లు టెండర్లలో పాల్గొన్నారని, ఈ ఇద్దరు బిల్డర్లలో తక్కువగా కోట్ చేసిన బిల్డర్ కు త్వరలో పనులు ప్రారంభానికి అవార్డు పాస్ చేయటం జరుగుతుందన్నారు.
శంకర్ విలాస్ వద్ద ఆర్వోబీ నిర్మాణానికి సంబంధించి కొంత మంది అనేక సందేహాలు తెలుపుతున్నారని, వాటికి సంబందించి జిల్లా కలెక్టర్ ఎస్ నాగలక్ష్మీ మాట్లాడుతూ రైల్వే లెవల్ క్రాసింగ్ వద్ద ఉన్న వాహనాల రద్దీకి అనుగుణంగానే రైల్వే అధికారులు ఆర్వోబీ, ఆర్ యూ బీ నిర్మాణానికి అనుమతులు జారీ చేస్తారన్నారు. ప్రస్తుతం శంకర్ విలాస్ వద్ద ఉన్న వాహనాల రద్దీకి అనుగుణంగా ఆరు లైన్ల ఆర్వోబీ నిర్మించాల్సి ఉందని, కాని భూసేకరణ వలన భవన యజమానులకు నష్టం జరుగుతుందన్న ఉద్దేశ్యంతో, నాలుగు లైన్లు మాత్రమే నిర్మించటం జరుగుతుందన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ భూములు ఉన్న ప్రాంతాల్లో ఉన్న ట్రాఫిక్ కు అనుగుణంగా ఆర్ యూ బీ లు నిర్మిస్తారని, పట్టణ ప్రాంతాల్లో ముఖ్యంగా వాహనాలు రద్దీ ఉన్న ప్రాంతాల్లో రైల్వే శాఖ ఆర్వోబీల నిర్మాణానికే అనుమతులు మంజూరు చేస్తుందన్నారు. కొన్ని ప్రాంతాల్లో కంకరగుంట రైల్వే లెవల్ క్రాసింగ్ తరహాలో ఆర్వోబీ, ఆర్ యూబీ నిర్మాణం చేయటం జరుగుతుందన్నారు. అయితే ముందుగా ఆర్వోబీ నిర్మించిన తరువాత మాత్రమే ఆర్ యూ బీ నిర్మాణానికి సాంకేతికంగా అవకాశం ఉంటుందన్నారు. భవిష్యత్తులో అవసరమైతే శంకర్ విలాస్ ఆర్వోబీ వద్ద ఆర్ యూ బీ నిర్మించేందుకునే విధంగా నూతన బ్రిడ్జ్ డిజైన్లు రూపొందించటం జరిగిందన్నారు. అదే విధంగా నగరపాలక సంస్థ మాస్టర్ ప్లాన్ ప్రకారం 120 విస్తీర్ణం ప్రతిపాదిత రైట్ ఆఫ్ వే ఆధారంగా బ్రిడ్జ్ కి ఇరువైపుల సర్వీస్ రోడ్లు 23 అడుగుల వెడల్పుతో నిర్మించటం జరుగుతుందన్నారు. హిందూ కళాశాల సర్కిల్ వరకు బ్రిడ్జ్ నిర్మించటం వలన అక్కడ 100 మీటర్ల వ్యాసార్థంతో ఒక రోటరీని నిర్మించాల్సి ఉంటుందని, దీనికి చాలా భూ సేకరణ అవసరమవుతుందని, లేకపోతే హిందూ కళాశాల జంక్షన్ వద్ద తీవ్రమైన ట్రాఫిక్ రద్దీ ఏర్పడే అవకాశం ఉందన్నారు. రైళ్ళ రాకపోకలు, రైల్వే విద్యుత్ తీగల భద్రత, రైల్వే శాఖ ప్రమాణాల దృష్ట్య రైల్వే ఓవర్ బ్రిడ్జ్ ఎత్తు 9 మీటర్లు డిజైన్ చేయటం జరిగిందన్నారు. బ్రిడ్జ్ వాలు (స్లోప్) సైతం జాతీయ రహదారి నిబంధనల ప్రకారమే వాహనాల ప్రయాణానికి అనుకూలంగా డిజైన్ చేయటం జరిగిందన్నారు. ఆర్వోబీ నిర్మాణానికి సేకరించి భూములకు పరిహారం భూసేకరణ చట్టం ద్వారా కాకుండా టీడీఆర్ బాండ్లు వలనే భవన యజమానులకు ప్రయోజనం జరిగే అవకాశం ఉందన్నారు. పట్టణాలలో భూసేకరణ చట్టం ద్వారా కేవలం ప్రస్తుత భూమి విలువకు అదనంగా 100 శాతం మాత్రమే పరిహారం ఇవ్వటానికి నిబంధనలు వర్తిస్తాయని, ఇతర ప్రాంతాల్లో భూసేకరణకు చెల్లించినట్లు రెండు, మూడు రెట్లు అదనంగా ఇవ్వటం కుదరదన్నారు. టీడీఆర్ బాండ్లు ఇవ్వటం ద్వారా భవన యజమానులు వారి భవనాలను అభివృద్ది చేసుకోవటానికి, టీడీఆర్ బాండ్లు ఇతరులకు అమ్ముకోవటం ద్వారా ఎక్కువ ప్రయోజనం పొందే అవకాశం ఉందన్నారు. ఈ విషయంపై నగరపాలక సంస్థ కమిషనర్ ఇటీవల భవన యజమానులతో సమావేశం నిర్వహించి వివరించటం వలన కోర్టుకు వెళ్లిన ఆరుగురు తిరిగి వచ్చి అంగీకార పత్రం ఇవ్వటం జరిగిందని, మరో ఆరుగురు అంగీకార పత్రం ఇవ్వటానికి సంసిధ్ధత వ్యక్తం చేశారన్నారు. శంకర్ విలాస్ బ్రిడ్జ్ నిర్మాణానికి కాంట్రక్టర్ కు 24 నెలలు గడువు విధించటం జరిగిందని, పనులు ప్రారంభించిన ఐదు నుంచి ఆరు నెలలు వరకు బ్రిడ్జ్ పై రాకపోకలకు ఇబ్బంది ఉండదని, తరువాత మాత్రమే వాహనాల రాకపోకలను నిలిపివేయటం జరుగుతుందన్నారు. బ్రిడ్జ్ నిర్మాణం వలన వాహనాల రాకపోకలకు ఇబ్బంది లేకుండా నగరపాలక సంస్థ, పోలీస్ శాఖ ప్రత్యామ్నాయ మార్గాలను ఏర్పాటు చేయటం జరిగిందన్నారు. ప్రత్యమ్నాయ మార్గాలుగా గుర్తించిన రహదారులను పూర్తి స్థాయిలో విస్తరించి, ఆక్రమణలు తొలగించి వాహన దారులకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు. నగరంలో మౌలిక సౌకర్యాల అభివృద్ది పనులు జరుగుతున్నప్పుడు కొంత ఇబ్బందులు ఉంటాయని, సాధ్యమైనంత వరకు ప్రజలకు, ఆ ప్రాంతంలోని భవన యజమానులకు ఇబ్బందులు లేకుండా శంకర్ విలాస్ బ్రిడ్జ్ ను నిర్మించేలా జిల్లా అధికారులు, ప్రజా ప్రతినిధులు కృషి చేస్తున్నారని ప్రజలు సహకారం అందించాలన్నారు.
జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ మాట్లాడుతూ శంకర్ విలాస్ ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణం సమయంలో తూర్పు నియోజకవర్గం నుంచి పశ్చిమ నియోజకవర్గంకు వాహనాల రాకపోకలకు ప్రత్యేకంగా ప్రత్యమ్నాయ మార్గాలతో రూట్ ప్లాన్ సిద్దం చేయటం జరిగిందన్నారు. కొత్తపేట శివాలయం వైపు వాహనాలు మూడువంతెల నుంచి, నల్లచెరువు, ఎత్తురోడ్డు సెంటరు వైపు వాహనాలు, లాలాపేట, పాత గుంటూరు వైపు వాహనాలు హిందూ కళాశాల సెంటరు నుంచి కంకర గుంట ఆర్వోబీ, ఆర్ యూ బీ నుంచి పశ్చిమ నియోజకవర్గం వచ్చేలా రూట్ ప్లాన్ సిద్దం చేయటం జరిగిందన్నారు. అమరావతి నుంచి వచ్చే భారీ వాహనాలు , బస్సులు చిల్లీస్ సెంటరు నుంచి ఇన్నర్ రింగ్ రోడ్డు మీదుగా బస్టాండ్ వైపుకు మరలించటం జరుగుతుందన్నారు. లక్ష్మీపురం, కొరిటెపాడు, గుజ్జన గుండ్ల, ఎస్వీఎన్ కాలనీ వైపు నుంచి వాహనాలు కంకర గుంట ఆర్వోబీ, ఆర్ యూ బీ నుంచి తూర్పు నియోజకవర్గం వైపు వెళ్ళేలా ప్లాన్ సిద్దం చేయటం జరుగుతుందన్నారు. బ్రిడ్జ్ నిర్మాణం ప్రారంభమై 24 నెలల్లో పూర్తి అవుతుందని, పనులు ప్రారంభించిన ఐదు నెలలు వరకు ట్రాఫిక్ మళ్లింపు అవసరం ఉండదని తెలిపారు. దీనికి అనుగుణంగా ప్రత్యమ్నాయ రహదారులను అభివృద్ది చేయటంతో పాటు ట్రాఫిక్ రద్దీ నియంత్రణకు పోలీసులను నియమించటం జరుగుతుందన్నారు. ట్రాఫిక్ మళ్లింపు ప్లాన్ కు సంబంధించి ప్రజలకు అవగాహన కలిగేలా పూర్తి స్థాయిలో రూట్ మ్యాప్ పై విస్తృత స్థాయిలో ప్రచారం నిర్వహిస్తామన్నారు.
ఆర్ అండ్ బీ ఎస్ఈ శ్రీనివాస మూర్తి మాట్లాడుతూ శంకర్ విలాస్ వద్ద ఆర్వోబీ సాయిల్ టెస్ట్ ఫలితాలు, బ్రిడ్జ్ మీద ప్రయాణించే వాహనాల బరువుకు అనుగుణంగా పిల్లర్లు డిజైన్ చేయటం జరిగిందన్నారు. బ్రిడ్జ్ నాలుగు లైన్ల రహదారి డివైడర్, ఫుట్ పాత్ లతో కలపి 21.550 మీటర్ల వెడల్పుతో 930 మీటర్ల పొడవుతో నిర్మించటం జరుగుతుందన్నారు. పోర్టల్ టైపు పిల్లర్స్ (అమరావతి రోడ్డు వైపు 6 , హిందూ కళాశాల సెంటరు వైపు 7 ) ఆఫ్ స్పాన్ ఒక్కటీ 23 మీటర్లు మొత్తం 299 మీటర్లు, రైల్వే లైను పరిధిలో బో – స్ట్రింగ్ గిడ్డర్ బ్రిడ్జ్ 64 మీటర్లు, అమరావతి రోడ్డు వైపు నాలుగు సింగిల్ పిల్లర్లు 92 మీటర్లు, హిందూ కళాశాల సెంటరు వైపు నాలుగు సింగిల్ పిల్లర్లు 92 మీటర్లు, అమరావతి రోడ్డు వైపు ఆర్ ఈ వాల్ 215 మీటర్లు, హిందూ కళాశాల వైపు ఆర్ ఈ వాల్ 168 మీటర్లు నిర్మిస్తారన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మైనారిటీ యువతకు విద్య, ఉద్యోగాల్లో స్వర్ణావకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం

-వడ్డేశ్వరంలో సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్‌మెంట్ ఆఫ్ మైనారిటీస్ (CEDM) నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి ఎన్.ఎమ్.డి. ఫరూక్ అమరావతి, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *