విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
కేంద్రీయ విద్యాలయ నిర్మాణం పూర్తయ్యే వరకు మహిళ పాలిటెక్నిక్ కళాశాలలో నిర్వహించే తాత్కాలిక తరగతుల నిర్వహణకు వసతి ఏర్పాట్లను బుధవారం నందిగామ శాసనసభ్యులు డా. మొండితోక జగన్మోహన్ తో కలసి జిల్లా కలెక్టర్ జె.నివాస్ పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఆరు తరగతిగదుల నిర్మాణానికి సంబంధించి పనులపై అధికారులతో సమీక్షించారు. పాలిటిక్నిక్ కళాశాలలో అవసరమైన మరమత్తులను కూడా పూర్తి చేయాలన్నారు. అనంతరం కేంద్రీయ విద్యాలయంకు కేటాయించిన 5.34 ఎకరాల భూమిని కూడా కలెక్టర్ జె.నివాస్ శాసనసభ్యులు డా. మొండితోక జగన్మోహన్ రావు పరిశీలించారు. అనంతరం జగనన్న లేఅవుట్ లో ఇళ్ల స్థలాలు పరిశీలించి లబ్ధిదారులు త్వరితగతిన ఇళ్ల నిర్మాణాలు మొదలు పెట్టే విధంగా తగు బాధ్యత తీసుకోవాలని హౌసింగ్ అధికారులను ఆదేశించారు. లేఅవుట్ బాగుందని ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. టిడ్కో ఇళ్లను కూడా అర్హులైన లబ్ధిదారులకు అందజేస్తామని చెప్పారు. వీరి వెంట తహాశీల్దార్ బి. చంద్రశేఖర్, మున్సిపల్ కమీషనర్ డా.జయరాం, యంపిడివో లక్ష్మిలీలా తదితరులు పాల్గొన్నారు.
