-చిరకాల స్వప్నం నెరవేర్చిన క్రీడాకారులకు శుభాకాంక్షలు
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
నాలుగు దశాబ్దాల తరవాత మన హాకీ క్రీడాకారుల బృందం ఒలింపిక్స్ లో దేశ కీర్తి పతాకాన్ని రెపరెపలాడించడం ఎంతో సంతోషాన్ని కలిగించింది. మన జాతీయ క్రీడ హాకీలో ఒలింపిక్స్ పతకం గెలుచుకోవాలని క్రీడాభిమానులు దశాబ్దాలుగా ఎదురుచూస్తున్నారు. 1980 మాస్కో ఒలింపిక్స్ తర్వాత ఇప్పుడు టోక్యో ఒలింపిక్స్ లో మన హాకీ జట్టు కాంస్యం గెలుచుకొని క్రీడాభిమానుల కలను నెరవేర్చింది. మన్ ప్రీత్ సింగ్ నాయకత్వంలోని హాకీ బృందానికి నా తరఫున, జనసేన పక్షాన హృదయపూర్వక అభినందనలు తెలియచేస్తున్నానని జనసేన అధ్యక్షులు పవన్ కల్యాణ్ జనసేన కార్యాలయం నుండి గురువారం ఓ ప్రకటన విడుదల చేసారు. కాంస్యం కోసం జరిగిన పోటీలో బలమైన ప్రత్యర్థి ఉన్నా ఆత్మస్థైర్యంతో పోరాడి గెలిచారు. ఈ స్ఫూర్తి ప్రశంసనీయమైనది. ఇదే స్ఫూర్తిని కొనసాగిస్తూ రానున్న రోజుల్లో మరిన్ని విజయాలు సాధిస్తుందని ఆశిస్తున్నాను. ఒలింపిక్స్ పతకంతో హాకీ క్రీడకు మన దేశంలో పునర్వైభవం వస్తుంది. టోక్యో ఒలింపిక్స్ లో మన క్రీడాకారుల పోరాటపటిమ యువతలో ఉత్సాహాన్ని కలిగించడమే కాకుండా క్రీడలపై ఆసక్తి పెంచేలా చేస్తుంది. వారు సాధిస్తున్న పతకాలు ఆశాజనకంగా ఉన్నాయి. వెయిట్ లిఫ్టర్ మీరాబాయి చాను, షట్లర్ పి.వి.సింధు, బాక్సర్ లవ్లీనా బొర్గోహెయిన్… ఇప్పుడు హాకీ బృందం పతకాలు సాధించడం మన దేశ క్రీడా రంగానికి శుభపరిణామం. రెజ్లర్ రవిదహియా ఫైనల్స్ కు చేరుకొని మరో పతకాన్ని ఖాయం చేశారు… ఆయన స్వర్ణం సాధిస్తారని ఆశిస్తున్నాను. మహిళల హాకీ జట్టు సైతం విజయాన్ని సాధించాలని ఆకాంక్షిస్తున్నాను. ఒలింపిక్స్ లో పాల్గొన్న మన క్రీడా బృందాన్ని కేంద్ర ప్రభుత్వం ఆగస్టు 15 వేడుకలకు అతిథులుగా ఆహ్వానించడం సంతోషకరం. ఈ ఆహ్వానం క్రీడాకారులకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది.