కళ్యాణం.. కమనీయం.. వైభవంగా శ్రీ సీతారాముల కళ్యాణోత్సవం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
శ్రీరామనవమిని పురస్కరించుకుని సెంట్రల్ నియోజకవర్గంలోని పలు రామాలయాలు, ఆంజనేయస్వామి ఆలయాలతోపాటు వైష్ణవాలయాలు శ్రీరామ నామంతో మార్మోగాయి. 64 వ డివిజన్ పాతపాడు కండ్రిక రామాలయంలో శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవాలు ఆదివారం అంగరంగ వైభవంగా జరిగాయి. సర్వాంగ సుందరంగా అలంకరించిన మండపంలో స్వామి, అమ్మవారిని ఆశీనులను చేసి అర్చకులు శాస్త్రోక్తంగా కళ్యాణ ఘట్టాన్ని నిర్వహించారు. దేవదేవుడి కల్యాణ వైభోగాన్ని కనులారా వీక్షించి భక్తజనం పులకించారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేడుకలలో వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు పాల్గొన్నారు. రాములోరి కళ్యాణ విశిష్టతతో పాటు, ఆలయ చరిత్ర, వైభవాన్ని ఈ సందర్భంగా భక్తులకు వివరించారు. ఏటా అత్యంత వైభవోపేతంగా కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహిస్తోన్న అభివృద్ధి కమిటీ సభ్యులను ప్రత్యేకంగా అభినందించారు. అనంతరం జానకి సమేత శ్రీరామచంద్రుని సుగుణాలను కీర్తించారు. ప్రజాసంక్షేమమే ధ్యేయంగా, జనరంజక పాలన అందించిన ధర్మ పరిపాలకుడని కొనియాడారు. సత్యం, ధర్మం, న్యాయమే మార్గాలుగా సర్వమానవ సంక్షేమ పాలన సాగించిన పరమ పావనమూర్తి అని పేర్కొన్నారు. రాముల‌వారి క‌ళ్యాణాన్ని లోక‌క‌ళ్యాణం కోసం నిర్వహిస్తార‌ని తెలిపారు. తల్లిదండ్రులను గౌరవించే ఉత్తమ సంప్రదాయాలను రామాయణం బోధిస్తుందని మల్లాది విష్ణు అన్నారు. పితృభక్తికి యుగయుగాలకు శ్రీరామచంద్రుడు ఆదర్శమని పేర్కొన్నారు. భక్తులకు పానకం, వడపప్పులను తీర్థప్రసాదాలుగా అందించారు. అనంతరం అన్న సమారాధన నిర్వహించారు. కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ యరగొర్ల తిరుపతమ్మ శ్రీరాములు, నాయకులు, భక్తులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *