– ఒక కుటుంబం – ఒక పారిశ్రామికవేత్త లక్ష్య సాధనకు కృషిచేయాలి
– ఎంఎస్ఎంఈలను పెద్దఎత్తున ప్రోత్సహించాలి
– సమాజ అవసరాలకు అనుగుణంగా విధుల నిర్వహణ ఉండాలి
– జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
స్వర్ణాంధ్ర @ 2047 లక్ష్యాల సాధనకు, సమాజ అవసరాలకు అనుగుణంగా విధులు నిర్వహించాలని.. సంపద సృష్టి, వృద్ధిరేటుపై ప్రతి శాఖ అధికారులు కృషిచేయాలని జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ ఆదేశించారు.
సోమవారం పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెసల్ సిస్టమ్ (పీజీఆర్ఎస్) కార్యక్రమం సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఒక కుటుంబం-ఒక పారిశ్రామికవేత్త నినాదాన్ని ముందుకుతీసుకెళ్తూ ఔత్సాహికులను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు కృషిచేయాలన్నారు. ఎంఎస్ఎంఈలను పెద్దఎత్తున ప్రోత్సహించాలని, పారిశ్రామిక యూనిట్ల ఏర్పాటుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న ప్రోత్సాహకాలను, పథకాలను సద్వినియోగం చేసుకునేలా గ్రామ, వార్డు సచివాలయ స్థాయిలో అవగాహన కార్యక్రమాలు చేపట్టాలన్నారు. అధికారులు సమాజ అవసరాలకు అనుగుణంగా విధులను చిత్తశుద్ధి, నిబద్ధతతో నిర్వహించాలని స్పష్టం చేశారు. ఈ నెల 10న తుమ్మలపల్లి కళాక్షేత్రంలో స్వర్ణాంధ్ర విజన్ @ 2047, వృద్ది ఇంజన్లపై జిల్లా, డివిజన్, మండలస్థాయి అధికారులకు వర్క్‌షాప్ నిర్వహించనున్నట్లు కలెక్టర్ లక్ష్మీశ తెలిపారు.
జిల్లాస్థాయి పీజీఆర్ఎస్‌కు 152 అర్జీలు:
సోమవారం జిల్లా కలెక్టరేట్ శ్రీ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో జరిగిన పీజీఆర్ఎస్ కార్యక్రమంలో కలెక్టర్ లక్ష్మీశ.. డీఆర్‌వో ఎం.లక్ష్మీనరసింహం, గ్రామ, వార్డు సచివాలయాల ప్రత్యేక అధికారి జ్యోతి తదితరులతో కలిసి ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. మొత్తం కార్యక్రమానికి 152 అర్జీలు వచ్చాయి. రెవెన్యూ శాఖకు సంబంధించి 76, పోలీస్ శాఖకు 16, మునిసిపల్, పట్టణాభివృద్ధి శాఖకు 10 అర్జీలు, పంచాయతీరాజ్‌కు సంబంధించి 6 అర్జీలు వచ్చాయి. గృహ నిర్మాణానికి 5 అర్జీలు రాగా డీఆర్‌డీఏ, రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్, విద్యా శాఖలకు నాలుగు చొప్పున అర్జీలు వచ్చాయి. ఉపాధి కల్పన, మార్కెటింగ్, ఏపీసీపీడీసీఎల్, వ్యవసాయం, సహకార సొసైటీ, కార్మిక, సర్వే శాఖలకు రెండు చొప్పున, ఎండోమెంట్, వైద్యఆరోగ్యం, నైపుణ్యాభివృద్ధి, విభిన్న ప్రతిభావంతుల సంక్షేమం, ఏజీ జెన్‌కో, ఫుడ్ కంట్రోల్, సాంఘిక సంక్షేమ గురుకులాలు, గ్రామీణ నీటి సరఫరా, కాలుష్య నియంత్రణ, ఎస్‌సీ కార్పొరేషన్, బీసీ కార్పొరేషన్, బ్యాంకింగ్ సేవలు, సీఆర్‌డీఏ విభాగాలకు ఒక్కో అర్జీ వచ్చాయి. అర్జీలను నిర్దేశ గడువులోగా నాణ్యతతో పరిష్కరించాలని.. ప్రతి అర్జీపైనా ప్రత్యేకంగా దృష్టిసారించి అర్జీదారులు సంతృప్తి చెందేలా పరిష్కరించాలని కలెక్టర్ లక్ష్మీశ స్పష్టం చేశారు. కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News