అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
గుంటూరు జిల్లా మంగళగిరిలోని ఎయిమ్స్ ఆవరణలో గురువారం ‘జగనన్న పచ్చ తోరణం-వన మహోత్సవం’ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వేప, రావి మొక్కలు నాటి ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరూ చెట్లను పెంచాలని ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ చెట్లను పెంచడం చాలా అవసరమని, చెట్ల పెంపకంతో కాలుష్యం ఉండదని పేర్కొన్నారు. చెట్లు ఉన్న చోటే వర్షాలు ఎక్కువగా పడే అవకాశం ఉంటుందని తెలిపారు. రాష్ట్ర విస్తీర్ణంలో 33 శాతం పచ్చదనం ఉండేలా చర్యలు చేపడుతున్నామన్నారు. రాష్ట్రాన్ని పచ్చతోరణంగా తీర్చిదిద్దేందుకు కృషి చేయాలని సీఎం వైఎస్ జగన్ పిలుపునిచ్చారు. చెట్ల పెంపకానికి సంబంధించి రెండు, మూడు చిన్న చిన్న విషయాలు జ్ఞాపకం పెట్టుకుంటే… అవి ఎంత అవసరమో మనకు నిరంతరం తెలుస్తుంది. ఒకటి.. మనం పీల్చే గాలి ఆక్సిజన్. ప్రపంచంలో ఏ జీవి అయినా ఆక్సిజన్‌ను పీల్చుకుని కార్బన్ డై ఆక్సైడ్ వదిలేస్తుంది. ఒక్క చెట్టు మాత్రమే పగటిపూట కార్భన్ డై ఆక్సైడ్ తీసుకుని ఆక్సిజన్‌ను వదులుతుంది. అంటే ఒక చెట్టు ఉంటే ప్యూర్‌గా ఉన్న ఆక్సిజన్ లెవెల్స్ మెరుగ్గా ఉంటాయన్నది ఎప్పటికీ జ్ఞాపకం పెట్టుకోవాల్సిన అంశం. రెండో అంశం.. చెట్లు ఉన్న చోట మాత్రమే మంచి వర్షాలు కూడా కురిసే పరిస్ధితి ఉంటుంది. మనం పదో తరగితి చదువుల్లో, పరీక్షలు రాసేటప్పుడు తెలుసుకున్న విషయాలివి. ఆస్మోసిస్ అని, ట్రాన్సిపరేషన్, గటేషన్ అని రకరకాలు సిద్ధాంతాలు అన్నీ చదివాం. చెట్లు వలన వర్షం ఎలా ప్రభావితం అవుతుంది, ఎక్కువ వర్షాలు పడే అవకాశాలు ఎందుకుంటాయి అనే ఈ రెండు విషయాలును జ్ఞాపకం ఉంచుకోవాలి. చెట్లు వలన మనకు జరిగే మంచిని మనం జ్ఞాపకం పెట్టుకుంటే, చెట్లను పెంచాల్సిన అవసరం ఎప్పుడూ కనిపిస్తుంది. రాష్ట్రంలో చెట్ల పెంపకం ఒక యజ్ఞంలా జరగాలి. రాష్ట్రంలో ఈరోజు 23 శాతం మాత్రమే ఉన్న అటవీ విస్తీర్ణాన్ని 33 శాతం పెంచే దిశగా అందరం ప్రయత్నం చేయాలి. మనందరం కలిసి చెట్లను నాటి, వాటిని సంరక్షించేందుకు అందరం కలిసి ప్రతిజ్ఞ చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాను. ఇక్కడ మనం, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి అక్క, ప్రతి చెల్లెమ్మ, ప్రతి సోదరుడు, స్నేహితుడు, ప్రతి అవ్వా, తాత తమ మనసులో ఈ ప్రతిజ్ఞ చేయాలి. చెట్లకు తోడుగా అందరం కలిసికట్టుగా ఉండి అడుగులు వేస్తే.. .మన రాష్ట్రంలో చెట్లు ఎక్కువగా పెరిగే అవకాశం ఉంటుంది. ఇది జరగాలని కోరుకుంటున్నాను. ఈ రోజు దాదాపు 5 కోట్ల మొక్కలను నాటడానికి అటవీశాఖను పురమాయిస్తూ… ప్రతిజ్ఞతో ఈ పనికి పూనుకోవాలని అందరినీ కోరుతున్నాను. అందరినీ ప్రతిజ్ఞ చేయడానికి ముందుకు రావాలని కోరుతున్నాను. ఆకుపచ్చని ఆశయాలతో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి తోడ్పడతానని, పచ్చని చెట్టే ప్రగతికి సోపాన మార్గమని గుర్తెరిగి, ప్రకృతిలోని సమతుల్య స్ధితి అవసరాన్ని గుర్తిస్తూ… ప్రతి నీటి బొట్టునూ సద్వినియోగపరుస్తానని, చెట్ల ఆవశ్యకత పట్ల అవగాహన పెంచుతూ వనాలను నరకనని, నరకనివ్వనని, విరివిగా మొక్కలు నాటుతానని మన ఊరూరా, వాడవాడా, ఇంటా బయటా, అన్ని చోట్ల మొక్కలు నాటడంతో పాటు వాటి సంరక్షణ బాధ్యతను కూడా స్వీకరించి ఆంధ్రప్రదేశ్‌ను పచ్చని తోరణంగా తీర్చిదిద్దేందుకు ప్రతిజ్ఞ చేస్తున్నాను. మనసా, వాచా, కర్మణా అందరం దీనికి కట్టుబడి ఉండి ఈ చెట్లకు మానవజాతి తోడుగా ఉండాలని కోరుకుంటూ, మరొక్కసారి విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను అని సీఎం వైఎస్.జగన్ తన ప్రసంగం ముగించారు. ఈ కార్యక్రమంలో అటవీ, పర్యావరణశాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, గృహనిర్మాణశాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాధరాజు, హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత, మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి, ముఖ్యమంత్రి కార్యక్రమాల సమన్వయకర్త తలశిల రఘురాం, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఇతర ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.
Tags amaravathi
Check Also
4.06 లక్షల బాదితులకు వరద నష్టపరిహారంగా రూ.601 కోట్లు చెల్లింపు
-రాష్ట్ర రెవెన్యూ, రిజిస్ట్రేషన్ మరియు స్టాంప్స్ శాఖామాత్యులు అనగాని సత్యప్రసాద్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో ఈ …