-ముఖ్యమంత్రిని కలిసిన వర్సిటీ వీసీ, అధికారులు
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
విజయనగరం జిల్లా మెంటాడ మండలం కుంటినవలసలో నిర్మాణమవుతోన్న కేంద్ర గిరిజన విశ్వవిద్యాలయం సత్వర పూర్తికి రాష్ట్ర ప్రభుత్వం తరుపున అన్ని విధాలుగా సహకరిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. కేంద్ర గిరిజన విశ్వవిద్యాలయ వీసి ప్రొఫెసర్ టీ.వీ. కట్టిమణి, డీన్ ప్రొఫెసర్ ఎం.శరత్ సీఎం చంద్రబాబును మంగళవారం సచివాలయంలో కలిశారు. ఈ సందర్భంగా వర్సిటీ నిర్మాణ పనులు, అక్కడి స్థితిగతులపై వారితో సీఎం చంద్రబాబు మాట్లాడారు. గిరిజన వర్సిటీ నిర్మాణానికి కేంద్రం రూ.800 కోట్లు కేటాయించగా, వాటిలో రూ.340 కోట్లు ఇప్పటికే విడుదల అయ్యాయి. మొత్తం 561 ఎకరాల వర్సిటీ ప్రాంగణంలో అడ్మిన్ బిల్డింగ్‌తో పాటు వసతి భవనాలు, అకడమిక్ బ్లాక్స్ నిర్మిస్తున్నారు. ఈ పనులు వేగవంతం చేయాలని వీసికి సీఎం సూచించారు. ఏడాదిలోగా అన్ని నిర్మాణాలు పూర్తి చేసి….భవనాలను అందుబాటులోకి తేవాలని అన్నారు. నిర్మాణాల పూర్తికి రాష్ట్ర ప్రభుత్వ పరంగా పూర్తిగా సహకరిస్తామని సీఎం చెప్పారు. వర్సీటీకి అవసరమైన తాగునీటి సరఫరా, విద్యుత్ సౌకర్యం, అప్రోచ్ రోడ్ వంటి పనులను త్వరితగతిన పూర్తిచేస్తామని సీఎం హామీ ఇచ్చారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వ అధికారులు సత్వరం కార్యాచరణ చేపట్టాలని సమావేశంలోనే సంబంధిత అధికారులకు సీఎం ఆదేశాలు ఇచ్చారు. వర్సిటీకి రెండు కి.మీ మేర అప్రోచ్ రోడ్ పనులు పూర్తి చేస్తే తమకు సౌకర్యవంతంగా ఉంటుందని వీసి చెప్పగా…ఆ పనులు వెంటనే ప్రారంభిస్తామని సీఎం అన్నారు. 100 మంది టీచింగ్ స్టాఫ్ అవసరం ఉండగా…ప్రస్తుతం కేవలం 18 మంది మాత్రమే ఉన్నారని వర్సీటి అధికారులు తెలిపారు. సిబ్బందిని మరింత పెంచాల్సిందిగా కోరుతూ ప్రధానికి లేఖ రాస్తానని సీఎం తెలిపారు. మే నెలలో నిర్వహించే యూనివర్సిటీ స్నాతకోత్సవానికి రావాల్సిందిగా రాష్ట్రం నుంచి కూడా కోరుతూ ప్రధానికి లేఖ రాస్తామని వర్సిటీ అధికారులతో సీఎం చంద్రబాబు అన్నారు.
2018లో నాటి తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు కాగా అప్పటి నుంచి అద్దె భవనాల్లో క్లాసులు నిర్వహిస్తున్నారు. గత ప్రభుత్వం వర్సిటీని పూర్తిగా నిర్లక్ష్యం చేయడం వల్ల పనులు జరగలేదు. అయితే కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత వర్సిటీ నిర్మాణంపై ప్రత్యేక దృష్టిపెట్టింది. ప్రస్తుతం ఈ యూనివర్సిటీలో 600 మంది విద్యార్థులు వివిధ కోర్సులను అభ్యసిస్తున్నారు. సొంత భవనాలు పూర్తి అయితే విద్యార్థుల సంఖ్య మరింత పెరుగుతుందని….నిర్మాణ పనులు వేగవంతం చేయాలని సీఎం అధికారులకు సూచించారు. కొలువులు సాధన, నైపుణ్యం పెంచేలా బోధన ఉండేలా చూడాలని సీఎం వర్సిటీ అధికారులను కోరారు. ప్రస్తుత పరిశ్రమ, సమాజ అవసరాలకు అనుగుణంగా కోర్సులను అందించాలని సీఎం చంద్రబాబు సూచించారు.
Prajavartha Online Telugu News