Breaking News

ఒలింపిక్ విజేత పి.వి. సింధును స్పూర్తిగా తీసుకుని యువత క్రీడల్లో రాణించాలి…

-యువ క్రీడాకారులను ప్రోత్సహించి క్రీడల అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నాం…
-విద్య, ఉపాధితోపాటు శారీరక ధారుఢ్యానికి యువత ప్రాధాన్యతనివ్వాలి…
-ప్రతీఏటా ప్రతిభ కనబరిచిన క్రీడాకారులకు వైయస్ఆర్ క్రీడాపురస్కారాలు అందిస్తున్నాం …
-క్రీడలు, టూరిజం శాఖా మంత్రి ముత్తం శెట్టి శ్రీనివాసరావు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలో యువ క్రీడాకారులను ప్రోత్సహించి క్రీడల అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నామని ఆంధ్రప్రదేశ్ స్పోర్ట్స్ అధారిటి ద్వారా రాష్ట్రంలోని క్రీడాకారులను జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించేలా శిక్షణ అందిస్తున్నామని రాష్ట్ర క్రీడలు టూరిజం శాఖామంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు (అవంతి శ్రీనివాస్) అన్నారు. రాష్ట్ర స్పోర్ట్స్ అధారిటి సంస్థ ఛైర్మన్‌గా నియమితులైన బైరెడ్డి సిద్ధార్ద రెడ్డి ప్రమాణస్వీకార కార్యక్రమం శుక్రవారం విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహించారు. మంత్రులు ముత్తంశెట్టి శ్రీనివాసరావు, పి.అనీల్ కుమార్, శాప్ యండి ప్రభాకర రెడ్డి లు శాప్ చైర్మన్ గా బైరెడ్డి సిద్ధార్ద రెడ్డితో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు మాట్లాడుతూ మట్టిలో మాణిక్యాలను వెలికితీయాలనే సంకల్పంతో గ్రామీణ స్థాయినుండి యువ క్రీడాకారులను ప్రోత్సహించి వారికి రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకువచ్చేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ప్రతీ జిల్లాలోనూ స్పోర్ట్స్ కాంప్లెక్స్ లు నిర్మిస్తున్నామని తద్వారా యువ క్రీడాకారులను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం అనేక చర్యలు తీసుకోవడంతోపాటు ప్రోత్సాహకాలను ప్రకటించడం జరిగిందన్నారు. జాతీయస్థాయిలో బంగారుపతకం సాధించిన వారికి రూ. 10 లక్షలు, రజతపతకం సాధించినవారికి రూ. 3 లక్షలు, కాంస్యపతకాన్ని సాధించిన వారికి రూ. 2 లక్షల రూపాయలను పారితోషికంగా ఇవ్వాలని రాష్ట్ర ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నారు. రాష్ట్రానికి చెందిన క్రీడాకారిణి కుమారి పివి. సింధు ఒలింపిక్ క్రీడల్లో కాంస్యపతకం సాధించడం రాష్ట్రానికే గర్వకారణం అన్నారు. ఆమెను స్పూర్తిగా తీసుకుని యువత క్రీడల్లో రాణించాలన్నారు. విద్య, ఉపాధికి యువత ఎంత ప్రాధాన్యత ఇస్తున్నదో, శారీరక ధారుఢ్యానికి కూడా అంతే ప్రాధాన్యతను ఇవ్వాలన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వై.యస్. జగన్మోహన రెడ్డి విద్యనభ్యసించే రోజుల్లో హైదరాబాద్ లో క్రికెట్ జట్టుకు కెప్టెన్ గా వ్యవహరించారని, దివంగత నేత వైయస్. రాజశేఖర రెడ్డి వ్యాయామానికి అధిక ప్రాధాన్యతను ఇచ్చేవారని అలాగే మన ముఖ్యమంత్రి అదే పంథాను అనుసరించి ఇప్పటికీ ప్రతీరోజూ వ్యాయామానికి సమయం కేటాయిస్తారని ఆయన యువతకు స్పూర్తి దాయకం అన్నారు.

జలవనరుల శాఖామంత్రి పి.అనీల్ కుమార్ మాట్లాడుతూ క్రీడారంగానికి ముఖ్యమంత్రి అధిక ప్రాధాన్యతను ఇస్తున్నారనే దానికి నిదర్శనం సేవానిరతి కలిగిన యువనాయకుడు బైరెడ్డి సిద్ధార్ద రెడ్డిని ఛైర్మన్ గా ఎంపిక చేయడమే నిదర్శనం అన్నారు. శాప్ ద్వారా ప్రభుత్వం క్రీడాకారులకు కల్పిస్తున్న అవకాశాలను వారికి చేరువ చేసి యువ క్రీడాకారులను తయారు చేయడంలో సిద్ధార్థ రెడ్డి కృతకృత్యులు అవుతారనే నమ్మకం ఉందన్నారు. ఛైర్మన్ పదవికి ఆయనను ఎంపిక చేసినందుకు యువత పక్షాన ముఖ్యమంత్రికి ప్రత్యేక ధన్యవాదాలను తెలియజేసుకుంటున్నానని అనీల్ కుమార్ అన్నారు.

ఛైర్మన్ గా పదవీ బాధ్యతలు చేపట్టిన బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వై.యస్. జగన్మోహన రెడ్డి మాటతప్పని, మడమ తిప్పని మనిషిగా నిలుస్తారనేదానికి ప్రజలకిచ్చిన వాగ్దానం నెరవేర్చడమే నిదర్శనం అన్నారు. రాష్ట్రం ఆర్థికంగా ఎన్ని ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ ప్రకటించిన ప్రతీ సంక్షేమ పథకాల ఫలాలను సకాలంలో లబ్దిదారులకు అందించి ప్రజల మన్ననలను అందుకుంటున్నారన్నారు. ముఖ్యమంత్రి తన పై నమ్మకం ఉంచి ఛైర్మన్ బాధ్యతలను అప్పగించారని సాయశక్తులా కృషి చేసి రాష్ట్రంలో క్రీడాకారులను తీర్చిదిద్దుటలో, క్రీడల అభివృద్ధిలో తనవంతు కృషి చేస్తానని సిద్ధార్థ రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో శాసనసభ్యులు హఫీజ్ ఖాన్, శిల్పా రవికుమార్ రెడ్డి, గంగుల జితేంద్ర రెడ్డి, కిలారి రోశయ్య, సుధాకర్ , శాప్ మేనేజింగ్ డైరెక్టరు యన్. ప్రభాకర రెడ్డి, పరిపాలనాధికారి పి.రామకృష్ణ, సహాయ సంచాలకులు యస్వీ. రమణ, తదితరులు పాల్గొన్నారు.

Check Also

జ్యుడీషియల్ ఆఫీసర్ల పదవీ విరమణ వయసు పెంపు

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలోని న్యాయశాఖ జ్యూడిషియల్ ఆఫీసర్ల( న్యాయాధికారులు ) పదవీ విరమణ వయసును పెంపు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *