లబ్దిదారులందరూ ఐక్యంగా ఉంటే పలు ప్రయోజనాలు : మంత్రి పేర్ని నాని

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
నవరత్నాలు పేదలందరికీ ఇళ్ళు అర్బన్ రురల్ హౌసింగ్ స్కీమ్లో లబ్ధిదారుల ఇష్ట ప్రకారమే ఇంటి నిర్మాణాలు జరుగుతాయని, గృహ నిర్మాణంలో లబ్దిదారులందరూ ఐక్యంగా ఒక బృందంగా ఏర్పడితే వ్యయం తగ్గడమే కాక ఎన్నో ప్రయోజనాలు చేకూరుతాయని రాష్ట్ర రవాణా, సమాచార పౌర సంబంధాల శాఖల మంత్రి పేర్ని వెంకట్రామయ్య ( నాని ) అన్నారు. కృష్ణాజిల్లా మచిలీపట్నం జిల్లా పరిషత్ సమావేశపు మందిరంలో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ, కృష్ణా జిల్లా జాయింట్ కలెక్టర్ శ్రీనివాస్ నుపూరు అజయ్ కుమార్ ఆధ్వర్యంలో శనివారం మధ్యాహ్నం మచిలీపట్నం డివిజన్ స్థాయి సమీక్ష సమావేశం నిర్వహిం చారు. ఈ సమావేశంలో మంత్రి పేర్ని నాని మాట్లాడుతూ, పేదల సొంతింటి కళను నిజం చేయాలని ప్రభుత్వం భావించిందని ఇందులో భాగంగా జగనన్న ఇళ్ల పథకాన్ని ప్రవేశ పెట్టి రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 30 లక్షలమంది పేదలకు ఇంటి పట్టాలను అందజేశారన్నారు. ఈ స్థలాల్లో గ్రౌండింగ్ పనులను కూడా దాదాపు పూర్తి చేశారని వివరించారు. మచిలీపట్నం డివిజన్ లో 353 లేవుట్లో 45 వేల ఇళ్ల నిర్మాణం దిశగా ఏర్పాట్లు చురుగ్గా జరుగుతున్నాయ న్నారు. ఏ కేటగిరీల వారీగా ఇల్లు నిర్మించి ఇవ్వాలి, వారికి అవసరమైన సిమెంటు, ఐరన్, ఇసుక అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ముఖ్యమంత్రి సంకల్పం మేరకు రాష్ట్రంలో నిరుపేదలకు ఈ ఏడాది లక్ష్యంగా 15 లక్షల గృహాలను నిర్మించేందుకు లబ్ధిదారులను గుర్తించామన్నారు. 500 గృహాలు దాటిన ప్రాంతాల్లో మెటీరియల్ నిల్వ ఉంచేందుకు గోడౌన్ను ఏర్పాటు చేసుకోవాలని తెలిపారు. అధికారులు, కాంట్రాక్టర్లకు ఏమైనా సమస్యలుంటే తన దృష్టికి నేరుగా తీసుకురావాలన్నారు. జగనన్న లేఅవుట్లలో గృహ నిర్మాణాలు ప్రారంభించే దిశగా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. పేదలందరికీ ఇళ్లు పథకంలో భాగంగా గ్రౌండింగ్ పూర్తయిన గృహ నిర్మాణంలో పురోగతి సాధించాలని మంత్రి పేర్కొన్నారు. లబ్దిదారులకు కావలసిన మౌలిక వసతులను సత్వరం సమకూర్చాలని, గృహ నిర్మాణ సమయాల్లో వారు ఇబ్బందులు పడకూడదని అన్నారు. కొన్ని మండలాల్లో పురోగతి తక్కువగా ఉందని, క్షేత్ర స్థాయిలో అధికారులు ఆయా ప్రాంతాలకు వెళ్లి పరిశీలించాలని మంత్రి ఆదేశించారు. అనేక స్థలాల్లో పునాది స్థాయి నిర్మాణాల లక్ష్యాల్ని నిర్ణీత గడువు లోపు పూర్తిచేయాలని ఆయన అన్నారు.
ఈ సమీక్షా సమావేశంలో కృష్ణా జిల్లా జాయింట్ కలెక్టర్ మాధవి లత, పెడన పామర్రు శాసనసభ్యులు జోగి రమేష్, కైలే అనిల్ కుమార్ మచిలీపట్నం ఆర్డీవో ఖాజావలి, హోసింగ్ పి డి రామచంద్రం, డ్వామా పీడీ సూర్యనారాయణ, డివిజన్ స్థాయి ఎంపీడీవోలు, తహసీల్దార్లు, ఏ పి ఓలు అధికారులు పాల్గొన్నారు.

Check Also

అక్టోబర్ 1 నుండి ధాన్యం కొనుగోళ్లు ప్రారంభం

-10 జిల్లాల జాయింట్ కలెక్టర్లు, అధికారులతో సమీక్ష -కొనుగోలు చేసిన 48 గంటల్లో రైతుల ఖాతాల్లో ధాన్యం డబ్బులు జమ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *