Breaking News

సమగ్ర ప్రాజెక్టు నివేదికను వారంలోగా తయారుచేసి అందజేయాలి…

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
కూచిపూడి గ్రామాన్ని రాష్ట్ర వారసత్వ సంపద గల ప్రాంతంగా అభివృద్ధి చేయుటకు సమగ్ర ప్రాజెక్టు నివేదికను వారంలోగా తయారుచేసి అందజేయాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. శనివారం మధ్యాహ్నం జిల్లా కలెక్టర్ వారి చాంబర్లో కూచిపూడి ప్రాంత అభివృద్ధి పనులపై వివిధ ప్రభుత్వ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు కూచిపూడి నాట్యకళకు మూల కేంద్రమైన కూచిపూడి గ్రామాన్ని అన్ని విధాల అభివృద్ధిపరచి రాష్ట్ర వారసత్వ సంపద గల ప్రాంతంగా తీర్చిదిద్దవలసిన అవసరం ఉందన్నారు.

ఇందుకోసం ఒక సమగ్ర ప్రాజెక్టు నివేదిక(డి పి ఆర్ )ను వారంలోగా రూపొందించి ఇవ్వాలన్నారు. కూచిపూడి అభివృద్ధిలో సినిమా తారలు, వ్యాపార దిగ్గజాలను భాగస్వాములు చేసి వారి ద్వారా నిధులు సమకూర్చే ప్రయత్నం చేయాల్సి ఉందన్నారు. కూచిపూడి వెళ్లే రహదారి మార్గంలో రాకపోకలకు ఇబ్బంది లేకుండా గుంతలను పూడ్చివేయాలన్నారు.
కూచిపూడిని కనిపించని వారసత్వ సంపద (ఇన్టైంజిబుల్ హెరిటేజ్) గా ప్రకటించి మరిన్ని నిధులు సమకూర్చుకునేందుకు యునెస్కో వారికి ప్రతిపాదనలు పంపుటకు డాక్యుమెంటేషన్ సిద్ధం చేయాలన్నారు. ప్రతి సంవత్సరము డిసెంబర్ మాసంలో కూచిపూడి వార్షికోత్సవాలను యక్షగాన వసంతం పేరుతో వారం రోజులపాటు నిర్వహించుటకు ప్రణాళిక సిద్ధం చేయాలన్నారు. ఒక సొసైటీని ఏర్పాటు చేసి దాని ఆధ్వర్యంలో కూచిపూడి అభివృద్ధి పనులు, వార్షికోత్సవాల నిర్వహణ జరిగేలా చేయాల్సి ఉందన్నారు. ఈ వ్యవస్థ పటిష్టంగా పనిచేయుటకు, కార్పస్ నిధులు సమకూర్చుకొనుటకు, నిర్వహించుటకు సమగ్రంగా అధ్యయనం చేయాలన్నారు. మరలా వచ్చే సమావేశాన్ని మే 27వ తేదీన నిర్వహిస్తామన్నారు.

ఈ సమావేశంలో రాష్ట్ర పర్యాటక శాఖ ప్రాంతీయ సంచాలకులు ప్రసన్నలక్ష్మి, డిఆర్ఓ కె చంద్రశేఖర రావు, ఉయ్యూరు ఆర్డిఓ హేలా షారోన్, జెడ్పిసిఈఓ కే కన్నమ నాయుడు, డి ఆర్ డి ఎ పి డి హరినాథ్, డిపిఓ అరుణ, జిల్లా పర్యాటక అధికారి రామ్ లక్ష్మణ్, ఎంపీడీవో విమాకుమారి, డిటి రఘురాం, ఆర్ అండ్ బి ఏ ఈ సురేష్, కూచిపూడి కళాకారులు వెంకట చలపతిరావు, తదితర అధికారులు, అనధికారులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

36 ఏళ్ల స్టీల్ ప్లాంట్ చరిత్రలో ఇలాంటి ఘటన జరగలేదు

-బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం -మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల చొప్పున పరిహారం -కుటుంబంలో ఒకరికి ప్లాంట్ లో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *