మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
వచ్చే మే నెల 11 వ తేదీన పి ఎం సూర్య ఘర్ పథకం మంజూరు కోసం ఎంపిక చేసిన 9 ఆదర్శ గ్రామాల్లో ప్రత్యేక శిబిరాలు నిర్వహించేందుకు సంసిద్ధం కావాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. శనివారం ఉదయం నగరంలోని కలెక్టరేట్ మీకోసం సమావేశం మందిరంలో జిల్లా కలెక్టర్ సిపి డి సి ఎల్ ఆధ్వర్యంలో పీఎం సూర్య ఘర్ — ముఫ్త్ బిజిలి యోజన పథకంపై జిల్లా అధికారులు ఎంపీడీవోలు మున్సిపల్ కమిషనర్లు బ్యాంకర్లు మండల ప్రత్యేక అధికారులకు కార్యశాల నిర్వహించారు.
తొలుత నోడల్ అధికారి రామకృష్ణ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా పీఎం సూర్య ఘర్ పథకాన్ని వివరించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ వచ్చే మే నెల 11 వ తేదీన పిఎం సూర్య ఘర్ పథకం నూటికి నూరు శాతం అమలు చేయుటకు 9 ఆదర్శ గ్రామాలను ఎంపిక చేయడం జరిగిందన్నారు. అందులో మచిలీపట్నం మండలంలో చిన్నాపురం, గూడూరు మండలంలో ఆర్వి పల్లి, పెడన మండలంలో నందమూరు, ఉంగుటూరు మండలంలో ఆతుకూరు, బాపులపాడు మండలంలో వేలేరు, పెదపారుపూడి మండలం లో వెంట్రా ప్రగడ, కంకిపాడు మండలంలో కే ఎస్ ఎన్ పాలెం, కందాలంపాడు, చల్లపల్లి మండలంలో యార్లగడ్డ గ్రామాలను ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దుటకు ఎంపిక చేశామన్నారు.
ఆ గ్రామాల్లో వచ్చే మే నెల 11వ తేదీన సూర్య ఘర్ పథకం మంజూరు చేయాల్సి ఉంటుందన్నారు. ఇందులో భాగంగా ఈనెల 30వ తేదీ లోగా వెండార్లను గుర్తించి ఎంపిక పూర్తి చేయాలన్నారు. మే నెల 1 వ తేదీ నుంచి 5 తేదీలోగా లబ్ధిదారుల డాక్యుమెంట్లను సిద్ధం చేయాలన్నారు. డాక్యుమెంటేషన్ పూర్తి అయిన వారి వివరాలను బ్యాంకులకు ఆన్లైన్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుందన్నారు.. అంతేకాకుండా వినియోగదారులకు వెండార్లను అనుసంధానం చేయాల్సి ఉంటుందన్నారు. వచ్చే మే నెల 11 వ తేదీన ప్రత్యేక శిబిరం సందర్భంగా అదే రోజున బ్యాంకర్లు వెండార్లకు లబ్ధిదారులు కోరుకున్న విధంగా రుణాలు మంజూరు చేయాలన్నారు. ఈ పరిస్థితులను గమనించి దీంతో కొంతమంది గ్రామ ప్రజలు కూడా స్వచ్ఛందంగా ముందుకు వచ్చే అవకాశం ఉందని, వారందరి పేర్లు కూడా కొత్తగా నమోదు చేయాలని సూచించారు. ఒక కిలో వాట్ యూనిట్ సౌరఫలకాలకు 30 వేల రూపాయలు, రెండు కిలోవాట్ సౌరఫలకాలకు 60 వేల రూపాయలు, మూడు కిలో వాట్ ఆపైన సౌర ఫలకాలు ఏర్పాటుకు 78 వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం సబ్సిడీగా ఇస్తుందన్నారు.
ఒక్కో ఆదర్శ గ్రామానికి కేంద్ర ప్రభుత్వం ఒక కోటి రూపాయలు ప్రోత్సాహకంగా అందజేయనుందన్నారు. ఈ సమాచారాన్ని గ్రామాల్లో విస్తృతంగా ప్రజలకు, ప్రజాప్రతినిధులకు తెలియజేయాలన్నారు. ఈ అవకాశాన్ని గ్రామంలోని ప్రజలందరూ సద్వినియోగం చేసుకునేలా చైతన్య పరచాలన్నారు.. అందరూ సమన్వయంతో పనిచేసే నిర్ణీత లక్ష్యాలను సాధించాలన్నారు.
ఈ కార్యశాలలో డిఆర్ఓ కే చంద్రశేఖర రావు, సి పి డి సి ఎల్ ఎస్ ఇ సత్యానందం, డిఆర్డిఏ, డ్వామా పి డి లు హరిహరనాథ్, శివప్రసాద్, కె ఆర్ ఆర్ సి ఎస్ డి సి శ్రీదేవి, మచిలీపట్నం ఉయ్యూరు ఆర్డీవోలు స్వాతి, హేలా షారోన్
జడ్పీసీఈఓ కన్నమ నాయుడు, డిప్యూటీ సీఈవో ఆనందకుమార్, డిపిఓ అరుణ, మున్సిపల్ కమిషనర్ బాపిరాజు, ఐ సి డి ఎస్ పి డి ఎంఎన్ వాణి, పలువురు ఎంపీడీవోలు మండల ప్రత్యేక అధికారులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News