మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
క్రీడలు శారీరక దృఢత్వానికి, మానసిక ఉల్లాసానికి, సామాజిక అనుబంధాలకు ఎంతగానో తోడ్పడతాయని ఉద్యోగుల సంఘం క్రీడల నిర్వహణకు కృషి చేయడం అభినందనీయమని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ పేర్కొన్నారు. పంచాయతీ రాజ్ దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లాలో తొలిసారిగా ఈనెల 22వ తేదీ నుండి 24వ తేదీ వరకు గుడివాడ ఎన్టీఆర్ స్టేడియంలో పంచాయతీరాజ్ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో ఉద్యోగులకు వివిధ క్రీడల్లో పోటీలు జరిగాయి.
శనివారం సాయంత్రం నగరంలోని జిల్లా పరిషత్ కన్వెన్షన్ హాలులో క్రీడలు సాంస్కృతిక పోటీల్లో విజేతలైన ఉద్యోగులకు బహుమతుల ప్రధానోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ముఖ్యఅతిథిగా విచ్చేసి జ్యోతి ప్రజ్వలన గావించి కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా జిల్లా ఉద్యోగులను ఉద్దేశించి మాట్లాడుతూ క్రీడలు ఒకవైపు శారీరక దృఢత్వాన్ని పెంపొందిస్తూ మరోవైపు మానసిక ఉల్లాసాన్ని సామాజిక అనుబంధాలను ఏర్పరుస్తాయన్నారు. క్రీడల్లో గెలుపు ఓటములు సహజమని ఓడిపోయినంత మాత్రాన కృంగిపోరాదని పోరాట పటిమ తో మరల పోటీలో పాల్గొనేందుకు కృషి చేయాలన్నారు. ఎప్పుడూ మాట్లాడుకోని వారు కూడా ఈ క్రీడల సందర్భంగా మాట్లాడుకుంటారన్నారు. దాంతో అందరిలోనూ స్నేహభావం పెంపొందుతుందన్నారు. అంతే కాకుండా వృత్తిపరంగా కూడా వారికి ఎంతో మేలు జరుగుతుందన్నారు.
స్పోర్ట్స్ మీట్ అంటే రెండు రకాల కేటగిరీలు ఉంటాయని, కొందరు ఆటల కోసం ఎదురుచూస్తున్న వారు గెంతులు వేసి పాల్గొంటారని, ఇంకొందరు తాము పోటీలకు సంబంధం లేదని పాల్గొనకుండా ఉంటారన్నారు. రాబోయే స్పోర్ట్ మీట్ లో కొంతమందికే కాకుండా ఉద్యోగులు అందరూ పాల్గొనే విధంగా కార్యక్రమాలను రూపొందించాలన్నారు. క్రికెట్ పోటీలో అన్ని వయసుల వారిని కూడా చేర్చుకొని ఆడాలన్నారు. క్రీడలు నిర్వహించేందుకు పంచాయతీరాజ్ ఉద్యోగుల సంఘం ముందుకు రావడం ఎంతో అభినందనీయం అంటూ ఎవరైనా ఉద్యోగులు మంచి పనులు చేస్తుంటే వాటిని నలుగురికి తెలిసే విధంగా చేయాలన్నారు.
అలాగే ఉద్యోగుల పిల్లలు పదవ తరగతి, ఇంటర్ పరీక్షల్లో మంచి ఫలితాలు సాధించి ఉంటే వారిని సంఘం తరపున అభినందించాలన్నారు. సంఘం తరపున ఆరోగ్య శిబిరం ఏర్పాటు చేసి ఉద్యోగస్తులు అందరికీ ఆరోగ్య పరీక్షలు జరిపేలా చొరవ చూపాలని వారికి ఎన్టీఆర్ వైద్య సేవల విభాగం నుండి కావలసిన సహకారాన్ని అందేలా తాను చూస్తానన్నారు.
ఉద్యోగులందరికీ ఉద్యోగుల ఆరోగ్య పథకం కింద గుర్తింపు కార్డులు వచ్చేలాగా సంఘం ముందడుగు వేయాలన్నారు.
సాంకేతిక పరంగా ఏమైనా సమస్యలు తలెత్తితే పరిష్కరించేందుకు ఎన్టీఆర్ వైద్య సేవల విభాగం వారు సహకారం అందిస్తారన్నారు. క్రీడల్లో రాణించాలంటే ప్రతి రోజు కొంత ప్రాక్టీస్ చేయాలని అందుకోసం తెల్లవారి నిద్ర లేవాల్సి ఉంటుందని తదుపరి గ్రామాల్లో పారిశుధ్య పనులు కూడా సులభంగా పర్యవేక్షించేందుకు వీలు కలుగుతుందన్నారు.
అనంతరం జిల్లా కలెక్టర్ క్రికెట్ లో విజేతగా నిలిచిన గుడ్లవల్లేరు మండల బృందానికి, రెండవ స్థానంలో నిలిచిన నాగాయలంక మండల బృందానికి ట్రోఫీలను అందజేశారు. అలాగే బ్యాడ్మింటన్ లో పురుషుల విభాగంలో విజేతలైన వి ప్రభు మోహన్ కుమార్ కు, స్త్రీల విభాగంలో గెలుపొందిన పి శైలజ అనూష లకు, టెన్నికాయిట్లో పురుషుల విభాగంలో విజేతలైన బి శ్రీనివాసరావు అమీర్ భాషాలకు, స్త్రీల విభాగంలో గెలిచిన శైలజ, అనుషలకు క్యారమ్స్ లో పురుషుల విభాగంలో విజేతలైన సతీషు శ్రీనివాసరావుకు, స్త్రీల విభాగంలో గెలిచిన శైలజలకు, టగ్ ఆఫ్ వార్ లో పురుషుల విభాగంలో గెలిచిన శ్రీనివాసరావు గుడివాడ మండలం వారికి, స్త్రీల విభాగంలో విజేతలైన వెంకటేశ్వరమ్మ బృందానికి, చెస్ పోటీలలో పురుషుల విభాగంలో గెలిచిన చందూరాములకు, స్త్రీల విభాగంలో విజేతలైన కిరణ్మయికి, చెస్ పోటీలలో డబుల్స్ పోటీలలో గెలిచిన కాత్యాయినికి బహుమతులను అందజేశారు. తదనంతరం నిర్వహించిన ఉద్యోగుల సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి.
ఈ కార్యక్రమంలో డిపిఓ అరుణ క్రీడలు సాంస్కృతిక విభాగాల చైర్మన్ బొమ్మ శ్రీనివాసరావు, రాంబాబులు పలువురు పంచాయతీరాజ్ ఉద్యోగులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News