-అమరావతె రాష్ట్ర రాజధాని-రైతులను మోసం చేసిన గత ప్రభుత్వం-
-బేతపూడి రచ్చబండలో మంత్రి నాదెండ్ల మనోహర్
మంగళగిరి, నేటి పత్రిక ప్రజావార్త :
గుంటూరు జిల్లా మంగళగిరి మండలం బేతపూడి గ్రామంలో రామాలయం సెంటర్ వద్ద రవి చెట్టు కింద జనసేన పార్టీ ఆధ్వర్యంలో రచ్చబండ కార్యక్రమం నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి జనసేన పార్టీ పీఏసీ చైర్మన్ మరియు మంత్రి నాదెండ్ల మనోహర్ అధ్యక్షత వహించారు. రచ్చబండలో మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ, “జనసేన పార్టీ ఇప్పుడు ప్రశ్నించే పార్టీగా మాత్రమే కాకుండా సమస్యలను పరిష్కరించే స్థాయికి ఎదిగింది” అని పేర్కొన్నారు. అమరావతిని రాజధానిగా అభివృద్ధి చేసేందుకు రైతులు చేసిన త్యాగాలే కూటమి ప్రభుత్వ ఏర్పాటుకు నాంది పలికిందని గుర్తు చేశారు.
గత ప్రభుత్వం అమరావతిని నిర్లక్ష్యం చేసి, మూడు రాజధానుల పేరుతో రైతులను మోసం చేసిందని, దాంతో రాష్ట్రం వెనుకబాటుకు నెట్టబడ్డదని మంత్రి ఆరోపించారు. అమరావతి రాజధాని పునర్నిర్మాణం ప్రణాళికబద్ధంగా చేపడుతున్నామని, CRDA పరిధిలోని 29 గ్రామాల్లో రోడ్లు, భవనాలు వంటి మౌలిక వసతుల అభివృద్ధికి చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రణాళిక బద్దంగా జరుగుతున్న అమరావతి నిర్మాణానికి గత ప్రభుత్వం తూట్లు పొడిచింది. వైయస్ జగన్మోహన్ రెడ్డి చేసిన పనులకు రాష్ట్ర వెనుకడుగు వేసింది.. రైతులను మోసం చేసిన గత ప్రభుత్వం…..అమరావతి రాజధాని లేకపోతే ప్రజలకు అడ్రస్ లేదు అని మంత్రి నాదెండ్ల పేర్కొన్నారు..
గ్రామాల్లోని ప్రతి సమస్యను తెలుసుకొని పరిష్కారానికి కృషి చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. అమరావతి నిర్మాణానికి భూములు ఇచ్చిన రైతులను అభివృద్ధి కార్యక్రమాల్లో భాగస్వాములుగా చేసుకుంటామని స్పష్టం చేశారు. మే 2న అమరావతిలో జరుగబోయే ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ సభను పండుగ వాతావరణంలో విజయవంతం చేయాలని నాదెండ్ల మనోహర్ పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఎర్రబాలెం, బేతపూడి, అయినవోలు గ్రామాల ప్రజలు, కూటమి నాయకులు, జనసేన పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News