మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
డి ఆర్ డి ఓ కేంద్రం జిల్లాలోని గుల్లలమోదలో ఏర్పాటు కావడం జిల్లాకే కాకుండా రాష్ట్రానికే గర్వకారణమని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ పేర్కొన్నారు. మంగళవారం ఉదయం నాగాయలంక మండలంలోని గుల్లల మోద డి ఆర్ డి ఓ క్షిపణి పరీక్ష కేంద్రంలో జిల్లా కలెక్టర్ జిల్లా ఎస్పీ ఆర్ గంగాధర్ రావుతో కలిసి ఏర్పాట్లు పరిశీలించారు. ప్రధానమంత్రిచే ప్రారంభోత్సవ కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారం వీక్షణకు అవసరమైన ఏర్పాట్లు పాటించవలసిన భద్రత ప్రమాణాలు గురించి వారు అధికారులతో చర్చించి పలు సూచనలు చేశారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ వచ్చే మే నెల 2 వ తేదీన భారత ప్రధానమంత్రి అమరావతి రాజధాని నిర్మాణ పనులు పునః ప్రారంభించేందుకు వస్తున్నారన్నారు. అందులో భాగంగా గుల్లల మోద లోని డిఆర్డిఓ కేంద్రాన్ని వర్చువల్ గా ప్రధానమంత్రి ప్రారంభించే అవకాశం ఉందన్నారు. ఇందుకోసం ముందస్తుగా ఏర్పాటు చేస్తున్నామని ఆ కార్యక్రమం స్థానిక ప్రజలు చూసే విధంగా ముందస్తుగా ఏర్పాటు చేస్తున్నామన్నారు. అధికారికంగా
సమాచారం అందాల్సి ఉందనీ అది అందాక ఏర్పాట్లు పూర్తిగా చేస్తామన్నారు.
జిల్లా ఎస్పీ మాట్లాడుతూ ప్రధానమంత్రి ఎంతో ప్రతిష్టాత్మకమైన డి ఆర్ డి ఓ కేంద్రాన్ని వర్చువల్ గా ప్రారంభించడం రాబోవు రోజుల్లో జిల్లాకు ఒక గొప్ప వరమన్నారు. ఇక్కడ జరిగే కార్యక్రమానికి వచ్చే ప్రజల రాకపోకలకు ఎలాంటి అంతరాయం కలగకుండా, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గట్టి పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామన్నారు. వాహనాల పార్కింగ్, భద్రత ఏర్పాట్లు పర్యవేక్షిస్తామన్నారు.
ఈ పర్యటనలో కలెక్టర్ ఎస్పీ వెంట డి ఆర్ డి ఓ కల్నల్ సమీర్, మచిలీపట్నం ఆర్డిఓ స్వాతి, అవనిగడ్డ డిఎస్పి టి.విద్య శ్రీ , తహసిల్దారు హరినాథ్, ఏ డి ఐ ఓ లు ఫణి కుమార్,సెల్వినా తదితర అధికారులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News