Breaking News

ఆర్యవైశ్యుల ఆత్మ గౌరవం కాపాడిన వ్యక్తి సీఎం జగన్మోహన్ రెడ్డి : కొల్లూరు రామకృష్ణ

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఆర్యవైశ్య సంక్షేమంపై మాట్లాడే నైతిక అర్హత తెలుగుదేశం నాయకులకు లేదని.. వారి ఆత్మ గౌరవం కాపాడిన ఏకైక నాయకులు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నని ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ విజయవాడ నగర ప్రధాన కార్యదర్శి కొల్లూరు రామకృష్ణ అన్నారు. సోమవారం నాడు వైఎస్సార్ సీపీ నాయకులతో కలిసి ఆయన విలేకర్ల సమావేశం నిర్వహించారు. ఆర్యవైశ్యులచే నిర్వహించబడేటువంటి వాసవీ మాత గుడులు, అన్నదాన సత్రాలు, కళ్యాణ మండపాలు వీటన్నింటికీ ప్రభుత్వం నుంచి మినహాయింపు ప్రకటించిన ఘనత కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి దక్కుతుందని ఈ సందర్భంగా వెల్లడించారు. ఇందులో  సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు  మల్లాది విష్ణు కృషి మరువలేనిదని చెప్పుకొచ్చారు. హనుమాన్ పేటలోని ఆలపాటి రామారావు ఫంక్షన్ హాల్ ని ఆర్యవైశ్యులకు కేటాయించింది కూడా ఎమ్మెల్యే మల్లాది విష్ణు నని చెప్పడానికి ఎంతగానో సంతోషిస్తున్నామన్నారు. అలాగే విజయవాడ నగరంలో రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభకు కొనుగోలు చేసిన భవన నిర్మాణ స్థల విషయంలో రిజిస్ట్రేషన్ ఫీజును ఈ ప్రభుత్వం పూర్తిగా రూ. 48 లక్షలు మాఫీ చేయడం జరిగిందని తెలియజేశారు. మరోవైపు అమరజీవి పొట్టి శ్రీరాములు చేసిన త్యాగానికి గుర్తుగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో నవంబర్‌ ఒకటిన ఆంధ్ర రాష్ట్ర అవతరణ వేడుకలు నిర్వహించుకునే వాళ్లమన్నారు. అయితే, రాష్ట్ర విభజన అనంతరం చంద్రబాబు నిర్వాకంతో నవంబర్‌ ఒకటో తేదీ ప్రాధాన్యత తగ్గిపోయిందన్నారు. ఇలా చంద్రబాబు చేసిన పొరపాటును సీఎం జగన్మోహన్ రెడ్డి  సరిదిద్ది ఆర్యవైశ్యుల ఆత్మగౌరవం కాపాడారని తెలిపారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెనువెంటనే పొట్టి శ్రీరాములు ని స్మరించుకునే విధంగా నవంబర్ 1వ తేదీన ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవంగా నిర్వహిస్తుండటం హర్షణీయమన్నారు. అలాగే గత తెలుగుదేశం ప్రభుత్వం ఆర్యవైశ్యులను అణగదొక్కే విధానంతో వ్యవహరిస్తోందని ఆవేదన చెంది.. మీ హయాంలో ఐదేళ్లు మంత్రిగా పనిచేసిన శిద్ధా రాఘవరావు  బహిరంగంగా వ్యాఖ్యానించలేదా? ఆర్యవైశ్యుల అభ్యున్నతి జగన్మోహన్ రెడ్డి తోనేని నమ్మి ఆయన వైఎస్సార్ సీపీ కాంగ్రెస్ లో చేరినది మర్చిపోయారా? అగ్రవర్ణ పేదలందరికీ కేంద్ర ప్రభుత్వం కల్పించిన 10 శాతం రిజర్వేషన్ లలో.. ఆర్యవైశ్యులకు ఎంతోమందికి లబ్ధి చేకూరింది మీకు తెలియదా? ఇవాళ పెన్షన్ గానీ, అమ్మఒడి గానీ, ఆసరా ఇలా ఎన్నో రకాల పథకాలు ఆర్యవైశ్యులకు కూడా అందే విధంగా కృషి చేసింది ఒక్క జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమే అనడంలో ఎటువంటి సందేహం లేదు. 2014లో ఎమ్మెల్యేగా ఎన్నికైన బోండా ఉమా.. 2018 డిసెంబర్ 9 వరకు సత్యనారాయణపురంలో గుడికి కనీసం స్థలకేటాయింపు చేయలేదు. నాడు మీకు ఆర్యవైశ్యులు గుర్తుకురాలేదా? ఈ రోజు దానిని మీరు అభూతకల్పనగా చిత్రీకరిస్తున్నారు. నాడు రాష్ట్రంలో ప్రతిపక్ష హోదాలో ఉన్న జగన్మోహన్ రెడ్డి ఆర్యవైశ్య కార్పొరేషన్ ప్రకటిస్తే.. దానికి మీరు సార్వత్రిక ఎన్నికలకు ఒక్క నెల ముందుగా జీవో తీసుకొచ్చి ఓటు బ్యాంకు రాజకీయాలు చేశారని మండిపడ్డారు. కనుకనే చివరకు తీవ్ర ప్రజావ్యతిరేకతకు గురయ్యారని గుర్తుచేశారు. ఇకనైనా తెలుగుదేశం నాయకులు విమర్శలు మానుకోవాలని.. లేకుంటే ఆ ప్రతిపక్ష హోదా కూడా ఉండదనే విషయాన్ని గుర్తుంచుకోవాలని హితవు పలికారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ రాష్ట్ర వాణిజ్య విభాగం ప్రధాన కార్యదర్శి గొంట్ల రామ్మోహన్ రావు, 23వ డివిజన్ ఇంఛార్జి ఆత్మకూరు సుబ్బారావు, సత్యనారాయణపురం వర్తక సంఘం అధ్యక్షులు మైలవరపు రామకృష్ణ, బీసెంట్ రోడ్ వర్తక సంఘం కార్యదర్శి బొడ్డు శ్రీనివాసరావు(నాడార్స్ శ్రీను), ఆర్యవైశ్య యువజన సంఘం వైస్ ప్రెడిడెంట్ పసుమర్తి రాజేష్, నాళం సురేష్ తదితరులు పాల్గొన్నారు.

Check Also

మాకు న్యాయం చేయండి…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఉద్యోగుల గృహ నిర్మాణ సంఘం పేరుతో ఏపీ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ మ్యూచువల్లీ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *