మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
మంగినపూడి బీచ్ ఉత్సవాలను ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తామని రాష్ట్ర గనులు భూగర్భవనరులు ఎక్సైజ్ శాఖ మంత్రివర్యులు కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. శనివారం మధ్యాహ్నం మంత్రి నగరంలోని రహదారులు భవనాల అతిధి గృహంలో జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ, సంయుక్త కలెక్టర్ గీతాంజలి శర్మ, సహాయ కలెక్టరు ఫరీన్ జైద్ తో కలిసి మంగినపూడి బీచ్ ఉత్సవాల నిర్వహణ ఏర్పాట్లపై సమావేశమై వారికి దిశా నిర్దేశం చేశారు. రేఖా చిత్రపటాన్ని పరిశీలించి ప్రదర్శనశాలలు ఫుడ్ కోర్టులు పార్కింగ్ జల క్రీడలు వైద్య శిబిరాలు పిల్లల వినోద క్రీడలు నిర్వహించే స్థలాల కేటాయింపు పై చర్చించారు.
అనంతరం మంత్రివర్యులు మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ ఈనెల 15 వ తేదీ నుండి 18వ తేదీ వరకు తాత్కాలికంగా మంగినపూడి బీచ్ ఉత్సవాలను రాష్ట్ర ఉత్సవాలుగా నిర్వహించాలని నిర్ణయించామన్నారు. రాష్ట్రంలోనే చాలా విశాలమైన బీచ్ ఫ్రంట్ గలిగిన ప్రాంతం మంగినపూడి బీచ్ అన్నారు. ఇదివరకు తాము 2018 సంవత్సరంలో మంగినపూడి బీచ్ ఉత్సవాలను గొప్పగా నిర్వహించామనీ, ఆనాడు లక్షలాదిమంది ప్రజలు ఉత్సవాలలో పాల్గొన్నారన్నారు. భారత ప్రభుత్వం కూడా జాతీయ క్రీడలైన కయా కింగ్, బీచ్ కబడ్డీ పోటీలు నిర్వహించుటకు సమ్మతం తెలిపిందన్నారు. రాష్ట్ర సంస్కృతి, సంప్రదాయాలు ఆహారపు అలవాట్లతో బీచ్ ఉత్సవాలను ఎంతో మధురమైన అనుభూతుల నిలిచిపోయే విధంగా నిర్వహిస్తామన్నారు. జల క్రీడలు, సాహస క్రీడలు అద్భుతంగా నిర్వహించేందుకు కూడా ప్రణాళికలు రూపొందిస్తున్నామన్నారు. ఉత్సవాలలో పాల్గొనేందుకు వచ్చే క్రీడాకారులకు గాని పర్యాటకులకు గాని కావలసిన వసతి సదుపాయాలను అతిథి గృహాలను సజావుగా కల్పించేందుకు యజమానులతో మాట్లాడడం జరిగిందన్నారు. లక్షలాదిమంది ప్రజలు ఉత్సవాల్లో పాల్గొనేందుకు వస్తున్న దృష్ట్యా రాకపోకలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చేయాలని అధికారులకు సూచించామన్నారు. మరో రెండు లేదా మూడు రోజుల్లో బీచ్ ఉత్సవాలు ఖరారై ప్రచార పత్రాలు ఆవిష్కరిస్తామన్నారు
ఈ ఉత్సవాలను రాష్ట్రస్థాయి ఉత్సవాలుగా నిర్వహిస్తామని జాతీయస్థాయి క్రీడాకారులు పాల్గొంటారని, అందరి దృష్టి ఆకర్షించే విధంగా ఉత్సవాలను నిర్వహిస్తామన్నారు. ఈ ఉత్సవాలలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని మంత్రివర్యులు పిలుపునిచ్చారు.
Prajavartha Online Telugu News