గిరిజనుల అభివృద్ధి సంక్షేమానికి దేశమంతటా ఒకేపాలసీ అమలు కావాలి…

-ప్రపంచీకరణ నేపథ్యంలో గిరిజన సంస్కృతి వారసత్వం అభివృద్ధి, సంక్షేమంపై చర్చగాలి…
-దేశంలో 10.5 కోట్ల మంది, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 27.40 లక్షలమంది గిరిజన ప్రజలున్నారు…
-ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా గిరిజన సంక్షేమ శాఖ జాతీయస్థాయి సెమినార్ నిర్వహణ

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
దేశమంతటా కామన్ ట్రైబల్ పాలసీ అమలు కావాలని, గిరిజనుల అభివృద్ధి, పాలనకు సంబంధించి బెస్ట్ ప్రాక్టీసెస్ అమలు కావాలని, పంచాయతిరాజ్ ఎక్స్టెన్షన్ టూ షెడ్యూల్ ఏరియా (పిసాయాక్టు) అమలు, గ్లోబలైజేషన్ క్రమంలో టెక్నాలజీ మారుమూల గ్రామాలకు కూడా చేరాలని, ప్రతీ ప్రభుత్వ పధకం ప్రతీ గిరిజనుడికీ అందించేలా ప్రభుత్వాలు, వ్యవస్థలు పనిచేయాలని ” భారతదేశంలో గిరిజన విధానాలు మరియు కార్యక్రమాలు, ప్రపంచీకరణ నేపథ్యంలో ప్రాంతీయ ప్రతిబింబాలు ” అనే అంశంపై నిర్వహించిన జాతీయసదస్సులో పాల్గొన్న వక్తలు అభిప్రాయం వ్యక్తం చేశారు.
విజయవాడ పార్చూన్ మురళీ పార్క్ హోటల్ లో గిరిజన సాంస్కృతిక పరిశోధన మరియు శిక్షణా మిషన్, సెంటర్ ఫర్ రీజనల్ స్టడీస్ విశ్వవిద్యాలయం ఆఫ్ హైదరాబాద్ భారత ప్రభుత్వ గిరిజన వ్యవహారాల మంత్రిత్వశాఖ మరియు ఆంధ్ర ప్రదేశ్ గిరిజన సంక్షేమశాఖ ఆధ్వర్యంలో ” భారత దేశంలో గిరిజన విధానాలు మరియు కార్యక్రమాలు, ప్రపంచీ కరణ నేపథ్యంలో ప్రాంతీయ ప్రతిబింబాలు” అనే అంశంపై నిర్వహించిన జాతీయ సదస్సును ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉపముఖ్యమంత్రి మరియు గిరిజన సంక్షేమశాఖామంత్రి  పుష్ప శ్రీవాణి పాముల సోమవారం వర్చువల్ విధానంలో జాతీయ సెమినార్ లో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి కాంతీలాల్ దండే విశిష్ట అతిథిగా పాల్గొనగా కేంద్ర ప్రభుత్వ గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రటరీ డా. నావల్త్ కపూర్ వర్చువల్‌గా పాల్గొనగా, హైదరాబాద్ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ బి.జె. రావు వర్చువల్ విధానంలో పాల్గొనగా, అతిథిలుగా గిరిజన సంక్షేమ శాఖ డైరెక్టరు పి. రంజిత్ భాషా, టిసిఆర్ అండ్ టియం గిరిజన సంక్షేమ శాఖ మిషన్ డైరెక్టరు వి. రవీంద్రబాబు, డిప్యూటి డైరెక్టరు శ్రీమతి డి.లక్ష్మి ఈ సెమినార్ లో పాల్గొన్నారు.
ఈ సెమినార్ లో వర్చువల్ విధానంలో పాల్గొన్న ఉపముఖ్యమంత్రి మరియు రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖామంత్రి పుష్ప శ్రీవాణి పాముల మాట్లాడుతూ ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా గిరిజన ప్రజలందరికీ నాశుభాకాంక్షలు తెలియజేస్తున్నానని అన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతీ సంవత్సరం ఆగష్టు 9వ తేదీన ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని రాష్ట్ర జిల్లా స్థాయిలలో ఘనంగా నిర్వహించుకుంటున్నామని ఆమె అన్నారు. గిరిజనుల అభివృద్ధి, గిరిజనుల రక్షణకు రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తున్నదని, ప్రభుత్వం అమలు చేస్తున్న పలు అభివృద్ధి సంక్షేమ పధకాల ద్వారా గిరిజన సమాజంలో సామాజిక ఆర్థికాభివృద్దే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తున్నదని మంత్రి అన్నారు. ఆంధ్ర ప్రదేశ్ లో 27.40 లక్షలమంది గిరిజన ప్రజలు ఉన్నారని ఇందుకు సంబంధించి 5 జిల్లాల్లోని 38 మండలాల్లో 34 గిరిజన తెగలను 5వ షెడ్యూల్ ఏరియాగా గుర్తించామని అన్నారు. ప్రతీ తెగకూ ప్రత్యేక సంస్కృతి, సంప్రదాయం , జీవనోపాధిలు ఉన్నాయని, గిరిజన ప్రజలను సామాజికంగా, ఆర్థికంగా సమాజంలో అత్యంత వెనుకబడిన వారుగా పరిగణనలోనికి తీసుకుని అభివృద్ధి పరచడం, వారికి లబ్ది చేకూర్చడానికి వివిధ పథకాలను అమలు పరుస్తున్నామని అన్నారు.
గిరిజన సంక్షేమం, అభివృద్ధికి రాష్ట్ర ముఖ్యమంత్రి వై.యస్. జగన్మోహన రెడ్డి బెస్ట్ ప్రాక్టీ సెను అమలు చేస్తూ గిరిజనాభివృద్ధికి కృషి చేస్తున్నారని దీనిలో భాగంగా నవరత్నాలు ఫ్లాగ్ షిప్ ప్రోగ్రాం క్రింద రాష్ట్రంలో గిరిజన సంక్షేమంకోసం వివిధ అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తున్నామని మంత్రి అన్నారు. 2020-21లో రూ. 1572.3 కోట్లు, 2021-22లో రూ. 1202.76 కోట్లు గిరిజన సంక్షేమానికి ప్రభుత్వం నిధులు విడుదల చేసిందని మంత్రి అన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల ద్వారా లబ్దిదారుని బ్యాంకు అకౌంటకు నేరుగా సొమ్ము జమచేసే విధానాన్ని అమలు చేస్తున్నామని మంత్రి అన్నారు. నవరత్నాల్లో భాగంగా కురుప్పంలో 153.85 కోట్లతో గిరిజన విద్యార్ధులకు ప్రత్యేకంగా ఇంజినీరింగ్ కాలేజీని ఏర్పాటు చేస్తున్నామని, రూ. 500 కోట్లతో పాడేరులో మెడికల్ కాలేజీ, రూ. 246.30 కోట్లతో పాడేరు హెడ్ క్వార్టరులో మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి గిరిజనుల కొరకు నిర్మిస్తున్నామని మంత్రి అన్నారు. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా రెండు ప్రాజెక్టులను అమలు చేస్తున్నాయని వాటిలో చింతపల్లి మండలం లంబశింగిలో రూ. 35 కోట్లతో ట్రైబల్ ఫ్రీడమ్ ఫైటర్స్ మ్యూజియంను ఏర్పాటు చేస్తున్నామని మార్చి 2003 నాటికి ఈమ్యూజియం నిర్మాణ పనులు పూర్తవుతాయని, విశాఖపట్నంలో 17.50 కోట్లతో టిసిఆర్ అండ్ టియం (ట్రైబల్ కల్చరల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ మిషన్) మిషన్ ఏర్పాటు చేస్తున్నామని భవన నిర్మాణ పనులు పూర్తి కావస్తున్నవని మంత్రి అన్నారు. ప్రపంచీకరణ నేపథ్యంలో గిరిజన ప్రాంతాలకు అవకాశాలు అవరోధాలు, జీవనోపాధి అవకాశాలు, విద్య, ఆరోగ్యం మరియు జెండర్ కు సంబంధించినవి, గిరిజన సంస్కృతి వారసత్వం అనే అంశంపై ఈ రెండు రోజుల సెమినార్ నిర్వహిస్తున్నామని మంత్రి అన్నారు. ఈజాతీయ సదస్సుకు ఎంపిక కాబడిన 67 పరిశోధనాపత్రాలను అంతర్జాతీయ ఖ్యాతికలిగిన రావత్ పబ్లికేషన్స్, జైపూర్ వారి ద్వారా పుస్తకరూపంలో ప్రచురించామని మంత్రి అన్నారు. ఈ ప్రచురణలలో గిరిజనుల జీవనోపాధి, మరియు పరిపాలన, ప్రాంతీయ ప్రాముఖ్యతలు, గిరిజన అభివృద్ధి, సవాళ్లు, భారతదేశంలో ట్రైబల్ ఇంటిగ్రేషన్, ఈశాన్యం మరియు ఇంతర ప్రాంతాల గురించి అవగాహనపరిచే విధంగా ఈపుస్తకాలను ప్రచురించామని మంత్రి పుష్ప శ్రీవాణి అన్నారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సంక్షేమ శాఖ కార్యదర్శి శ్రీ కాంతీలాల్‌ దండే మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గిరిజన సంక్షేమ అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యతనిస్తూ ముఖ్యమంత్రి జగన్మోహన రెడ్డి పలు పధకాలను అమలు చేస్తున్నారని ఆయన అన్నారు
దీనిలో భాగంగా నవరత్నాలు కార్యక్రమం ద్వారా గిరిజనుల అభివృద్ధి సంక్షేమంపై ప్రత్యేక దృష్టి సారించామని ఆయన అన్నారు. ట్రైబల్ సబ్ ప్లాన్ క్రింద గిరిజనుల సంక్షేమానికి అనేక కార్యక్రమాలు అమలుచేస్తున్నామని ఆయన అన్నారు. రాష్ట్రంలో అటవీ హక్కులచట్టం క్రింద గిరిజన కుటుంబాలకు జీవనోపాధి కల్పిస్తున్నామని, ఇంతవరకూ 3 లక్షల ఎకరాలు అటవీ హక్కుల చట్టం క్రింద గిరిజనులకు అందించామన్నారు. ముఖ్యమంత్రి వై.యస్. జగన్మోహన రెడ్డి ఆదేశాలమేరకు గిరిజనులకు అందించిన భూమిని వ్యవసాయయోగ్యమైన భూమిగా అభివృద్ధి పరుచుటకు యస్ఆర్ ఇజియస్, గిరిజన సంక్షేమశాఖ తగు పధకాలను అమలు చేస్తున్నదని కాంతీలాల్ దండే అన్నారు. ఈనేషనల్
సెమినార్ లో మిజోరం, ఒరిస్సా, న్యూఢిల్లీ మొదలగు రాష్ట్రాల నుండి వర్చువల్ విధానంలో ఈ సెమినార్ లో పాల్గొంటున్నారని మొత్తం 150 మంది ఈ రెండు రోజులు జరిగే సెమినార్ లో పాల్గొంటున్నారని కాంతీలాల్ దండే అన్నారు. రానున్నరోజుల్లో గిరిజన సంక్షేమానికి దేశమంతటా ఒకేపాలసీ అమలు కావాలని తద్వారా గిరిజనుల అభివృద్ధి, సంక్షేమం సాధ్యమని సెమినార్ లో పాల్గొన్న వక్తలు అభిప్రాయం తెలియజేశారన్నారు.
న్యూఢిల్లీ ఇనిస్ట్యిట్యూట్ ఆఫ్ హ్యూమన్ డెవలప్మెంట్ విజిటింగ్ ప్రొఫెసర్ విర్జీనియస్ కాక వర్చువల్ విధానంలో సెమినార్ లో మాట్లాడుతూ గిరిజన ప్రజలు సామాజికంగా ఆర్ధికంగా సమాజంలో అత్యంత వెనుకబడిన విభాగమని వీరిని పరిగణనలోనికి తీసుకుని వారి అభివృద్ధికి సంక్షేమానికి ప్రధాన మార్గాలను అనుసంధానించడం ప్రభుత్వానికి గొప్ప సవాల్ అని అన్నారు. దేశమంతటా ఒకే ట్రైబల్ పాలసీ ఉండాలని అనేక ప్రాంతాలలో అనేక గిరిజన భాషలు మాట్లాడే తెగలవారు ఉన్నారని ఆభాషలను గుర్తించి ఆయా తెగల అభివృద్ధికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కట్టుదిట్టంగా పధకాలను అమలు చేయవలసి ఉందని ఆయన అన్నారు. జవహర్ లాల్ నెహ్రూ ఆశించిన పంచశీల సూత్రాలను అమలు చేయవలసిన అవసరం ఉన్నదని, గిరిజన భూములను పరిరక్షించి వారికి రక్షణగా ప్రభుత్వాలు నిలవాలని ఈవిధంగా దేశమంతటా ఒకే ట్రైబల్ పాలసీ అమలు కావాలని విర్జీనియస్ కాకా అన్నారు.
యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ వైస్ ఛాన్ల ప్రొఫెసర్ బిజె.రావు వర్చువల్ విధానంలో మాట్లాడుతూ ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా గిరిజన సమాజానికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నానని అన్నారు. గిరిజనుల్లో సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక అభివృద్ధి పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని, ప్రపంచీకరణ నేపథ్యంలో టెక్నాలజీ మారుమూల గిరిజన గ్రామాలకు అందని కారణంగా అనేకమంది గిరిజన ప్రజలు ప్రభుత్వ పథకాలను అందుకోలేకపోతున్నారని ఆయన అన్నారు. ప్రభుత్వాలు, సంస్థలు గిరిజనుల సమస్యలు పరిష్కరించే దిశగా పనిచేయాలని ఆయన అన్నారు. ప్రపంచీకరణ వలన గిరిజన ప్రాంతాలు ఎలా ప్రభావితం అవుతున్నాయి, గిరిజన సంస్కృతి వారసత్వం పై ప్రపంచీకరణ ఏవిధంగా ప్రభావితం చూపుతుంది అనే విషయాలను ఈ సెమినార్ లో పాల్గొన్న ప్రతినిధులు చర్చించి ప్రభుత్వాలకు తగు సూచనలను అందించాలని ఆయన అన్నారు.
కేంద్ర ప్రభుత్వ గిరిజన సంక్షేమ మంత్రిత్వశాఖ జాయింట్ సెక్రటరీ డా. నావల్త్ కపూర్ ఈ సెమినార్ లో వర్చువల్ విధానంలో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం గిరిజన అభివృద్ధి, సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యతనిస్తూ అనేక పధకాలను అమలు చేస్తున్నదని అన్నారు. ఆంధ్రప్రదేశ్ లో ట్రైబల్ సబ్ ప్లాన్ అమలుకు కేంద్ర ప్రభుత్వ సహకరిస్తుందని, దేశంలో 740 ఏకలవ్య స్కూలు ప్రారంభించామని కపూర్ అన్నారు. ట్రైబల్ ఫ్రీడమ్ ఫైటర్ల మ్యూజియంను ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు చేస్తున్నామని, గిరిజన సాంస్కృతిక పరిశోధన మరియు శిక్షణా మిషన్ ద్వారా గిరిజనుల జీవనస్థితగతులు మెరుగుపరచడానికి కేంద్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తున్నదని కపూర్ అన్నారు. మనదేశంలో అనేకమంది గిరిజనుల యొక్క సమస్యలకు సంబంధించిన పాలసీలు మరియు ప్రణాళికలు రూపొందించి ఖచ్చితంగా గిరిజన సమాజానికి ఉపయోగపడేలా అమలు చేయవలసిన అవసరం ఉందని ఇందుకు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలకు తమవంతు సహకారాన్ని అందిస్తున్నవని కపూర్ అన్నారు.
రాష్ట్రగిరిజన సంక్షేమశాఖ టిసిఆర్ అండ్ టియం మిషన్ డైరెక్టరు ఇ.రవీంధ్రబాబు మాట్లాడుతూ దేశంలో 10.5 కోట్ల మంది గిరిజన ప్రజలు ఉన్నారని దేశ జనాభాలో 8.6 శాతం గిరిజన ప్రజలు ఉన్నారని అన్నారు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 27.40 లక్షల మంది గిరిజన ప్రజలు ఉన్నారని అన్నారు. ప్రతీ గిరిజన తెగకు ప్రత్యేక సంస్కృతి, సంప్రదాయం జీవనోపాధిలు ఉన్నాయని వాటిని పరిరక్షిస్తూ ఆయా తెగల అభివృద్ధికి ప్రభుత్వం అనేక పధకాల ద్వారా కృషి చేస్తున్నదని ఆయన అన్నారు. ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా నిర్వహించిన సెమినార్ లో దేశంలో అనేక ప్రాంతాల నుండి వర్చువల్ విధానంలో పాల్గొని ప్రపంచీకరణ నేపథ్యంలో గిరిజన ప్రాంతాలకు అవకాశాలు, ప్రజల అభివృద్ధి పై, గిరిజన సంస్కృతీ వారసత్వంపై సెమినార్ లో పాల్గొన్న ప్రతినిధులు వారి అభిప్రాయాలను తెలియజేశారని శ్రీ రవీంద్రబాబు అన్నారు.
ఈ సెమినార్ కు యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ సెంట్రల్ ఫర్ రీజనల్ స్టడీస్ హెడ్ డా. వి. శ్రీనివాసరావు వర్చువల్ విధానంలో కోఆర్డినేటర్ గా వ్యవహరించగా ఈ సెమినార్ లో ప్రముఖ న్యాయవాది పల్లా త్రినాధ్ రావు, గిరిజన సంక్షేమ శాఖ ఇంజినీరింగ్ ఇన్ చీఫ్ జియస్వవియయవి. ప్రసాద్, ప్రొఫెసర్ శ్రీనివాసరావులు ఈ సెమినార్ లో పాల్గొన్నారు. గిరిజన సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టరు డి.లక్ష్మీ వందన సమర్పణ చేశారు. ముందుగా గిరిజనుల జీవన పరిస్థితులు, అభివృద్ధి సంక్షేమంపై ముద్రించిన 4 పుస్తకాలను గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి శ్రీ కాంతీలాల్ దండే విడుదల చేశారు. ముందుగా సెమినార్ ను జ్యోతి ప్రజ్వలన చేసి రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ సెక్రటరీ శ్రీ కాంతీలాల్ దండే ప్రారంభించగా, విజయవాడతోపాటు దేశంలోని ఇతర ప్రాంతాల నుండి వర్చువల్ విధానంలో ఈ సెమినార్ లో పాల్గొన్నారు.

Check Also

చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ కి కోటి విరాళం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ (CMRF) కోసం శశి విద్యా సంస్థల చైర్మన్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *