అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
వివిధ రంగాలలో అసామాన్య సేవలందించిన 60 మందికి వైఎస్సార్ లైఫ్ టైమ్ అఛీవ్ మెంట్ – 2021, వైఎస్సార్ అఛీవ్ మెంట్ – 2021 పురస్కారాలను మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గౌరవార్ధం ఆగస్టు 13, 2021 న ఉదయం 11 గంటలకు లబ్బీపేటలోని ఏ-1 కన్వెన్షన్ హాలునందు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అందజేస్తారు. ఈ కార్యక్రమం ఆసాంతం కోవిడ్ నిబంధనలు పాటిస్తూ నిర్వహించబడుతుందని ప్రభుత్వం సోమవారం ఒక ప్రకటనలో తెలియజేసింది.
అసామాన్య ప్రతిభ కనపరిచిన సామాన్యులకు, వివిధ రంగాల్లో అత్యుత్తమ సేవలు అందించిన వ్యక్తులు, సంస్థలను వైఎస్సార్ లైఫ్ టైమ్ అఛీవ్ మెంట్ మరియు వైఎస్సార్ అఛీవ్ మెంట్ అవార్డులతో సత్కరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ అవార్డులను సాధారణంగా మరణానంతరం ఇవ్వనప్పటికీ అత్యంత అర్హత ఉన్న వ్యక్తులకు అవార్డు మరణానంతరం ఇవ్వడానికీ ప్రభుత్వం అంగీకరించింది.
దరఖాస్తులను పరిశీలించటానికి రాష్ట్ర ప్రభుత్వం హైపవర్ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీకి చైర్మన్ గా ప్రవీణ్ ప్రకాష్, ప్రిన్సిపల్ సెక్రటరీ (రాజకీయ) మరియు ప్రభుత్వ సలహాదారులు సజ్జల రామకృష్ణ రెడ్డి, దేవులపల్లి అమర్, డాక్టర్ కోనుబట్ల రామచంద్ర మూర్తి, జివిడి కృష్ణ మోహన్ మరియు కె. దమయంతి (ప్రిన్సిపల్ సెక్రటరీ, మహిళలు, పిల్లలు, వికలాంగులు మరియు సీనియర్ సిటిజన్స్ విభాగం), కె. ఉషా రాణి, కార్యదర్శి (రెవెన్యూ), కోన శశిధర్, కమిషనర్ (పౌర సరఫరాలు), తుమ్మా విజయ్ కుమార్ రెడ్డి, ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి (ఐ&పిఆర్) సభ్యులుగా మరియు జేవీ మురళి, డిప్యూటీ సెక్రటరీ (ప్రోటోకాల్) మెంబర్-కన్వీనర్ గా వ్యవహరించారు.
డాక్టర్ వైఎస్సార్ లైఫ్ టైమ్ అఛీవ్ మెంట్, వైఎస్సార్ అఛీవ్ మెంట్ అవార్డులను వ్యవసాయ, అనుబంధ రంగాలలో 11 మందికి, లలిత కళలు, సంస్కృతి రంగాల్లో సేవలు అందించిన 20 మందికి, సాహిత్యంలో సేవలు అందించిన 7 గురికి, జర్నలిజంలో సేవలు అందించిన 7 గురికి మరియు కోవిడ్ ఫ్రంట్‌లైన్ యోధులుగా సేవలు అందించిన 7 మందికి, ఉత్తమ సేవలు అందించిన 8 సంస్థలకు దక్కాయి. డాక్టర్ వైఎస్సార్ జీవిత సాఫల్య పురస్కార గ్రహీతలకు రూ. 10 లక్షల నగదు, వైఎస్సార్ కాంస్య విగ్రహం మరియు ఒక పతకం, డాక్టర్ వైఎస్సార్ సాఫల్య పురస్కార అవార్డు గ్రహీతలకు రూ. 5 లక్షల నగదు మరియు ప్రశంసా పత్రం, వైఎస్సార్ కాంస్య విగ్రహం అందజేస్తారు. హైపర్ కమిటీ సమర్పించిన సిఫార్సుల జాబితాను ముఖ్యమంత్రి ఆమోదించారు. మొత్తం 60 మందికి మరియు సంస్థలకు ఈ అవార్డులను అందజేస్తారు.
Tags amaravathi
Check Also
ఆకాంక్షిత బ్లాక్ కార్యక్రమం (ఏబీపీ)పై అధికారులతో కలెక్టర్ డా. జి.లక్ష్మీశ
-పెనుగంచిప్రోలు ఇబ్రహీంపట్నం బ్లాక్ లను టాప్ టెన్ లో నిలపండి…. -హెల్త్ ,ఎడ్యుకేషన్, న్యూట్రిషన్ పై దృష్టి సారించండి….. -కలెక్టర్ …