విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రజా సమస్యల సత్వర పరిష్కార కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన వార్డు సచివాలయాల వ్యవస్థ సేవలను ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు మల్లాది విష్ణు అన్నారు. గుడ్ మార్నింగ్ విజయవాడ సెంట్రల్ కార్యక్రమంలో భాగంగా 30 వ డివిజన్ లోని రామకృష్ణపురంలో డివిజన్ కార్పొరేటర్ జానారెడ్డి తో కలిసి విస్తృతంగా పర్యటించారు. స్థానిక సమస్యల పరిష్కారంలో అన్ని శాఖల సమన్వయం అత్యంత ప్రధానమని ఈ సందర్భంగా అధికారులకు ఎమ్మెల్యే సూచించారు. బుడమేరు వంతెన కింద పేరుకున్న చెత్తను తక్షణమే తొలగించాలని ఆదేశించారు. లేకుంటే దోమలు పెరిగి సీజనల్ వ్యాధులు ప్రబలే ప్రమాదముందని హెచ్చరించారు. కోడూరు వారి వీధి చివరన పైపులైన్ నుంచి నీరు వృధాగా పోతుండటంపై శాసనసభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే మరమ్మతులు నిర్వహించాలని సూచించారు. అనంతరం గ్రంథాలయాన్ని సందర్శించిన ఆయన అక్కడి సదుపాయాలపై పాఠకులను ఆరా తీశారు. దిశ యాప్ పై అవగాహన కల్పించాలని రఘునాథరావు కాలనీకి చెందిన మల్లేశ్వరి అనే మహిళ కోరగా శాసనసభ్యులు మల్లాది విష్ణు సమక్షంలో ఎస్సై సౌజన్య ఆమెకు యాప్ ప్రయోజనాలను క్షుణ్ణంగా వివరించారు. అనంతరం మల్లాది విష్ణు విలేకరులతో మాట్లాడారు. మన రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏర్పాటు చేసిన గ్రామ సచివాలయ వ్యవస్థ అనతికాలంలోనే దేశానికే ఆదర్శంగా నిలిచిందని ఎమ్మెల్యే తెలియజేశారు. సచివాలయ వ్యవస్థ ద్వారా ప్రజలకు ప్రభుత్వం పూర్తిగా చేరువైందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు ప్రతి ఒక్క గడపకు చేరే విధంగా సచివాలయ వ్యవస్థ సమర్థవంతంగా పనిచేయాలన్నారు. అదేవిధంగా సంక్షేమ క్యాలెండర్ పై ప్రజలకు విస్తృత అవగాహన కల్పించాలని సిబ్బందికి సూచించారు. గడిచిన రెండేళ్లల్లో వైఎస్సార్ సీపీ ప్రభుత్వం 5 కోట్ల రాష్ట్ర ప్రజానీకానికి దాదాపు రూ. 60 వేల కోట్ల సంక్షేమాన్ని అందించడం జరిగిందన్నారు. కావున సంక్షేమ కార్యక్రమాలన్నింటికీ కేంద్ర బిందువైన సచివాలయ వ్యవస్థపై అధికారుల నిరంతర పర్యవేక్షణ ఉండాలన్నారు. మరోవైపు ప్రజా సమస్యల పరిష్కార వేదిక ‘స్పందన’ కార్యక్రమానికి అనూహ్యమైన స్పందన వస్తోందని ఈ సందర్భంగా మల్లాది విష్ణు అన్నారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు వికాస్, వర్మ, కృష్ణ, శేఖర్, సుబ్బారెడ్డి, దుర్గారావు, రామకృష్ణ, వీఎంసీ అధికారులు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.
Tags vijayawada
Check Also
కేంద్ర ప్రభుత్వం రూ.1100 కోట్ల వరద సాయాన్ని త్వరగా అందించాలి : ఎంపి కేశినేని శివనాథ్
-కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా కు విజ్ఞప్తి -విపత్తు నిర్వహణ (సవరణ) బిల్లు- 2024కు ఆమోదం -విజయవాడ …