Breaking News

త‌మ ప‌విత్ర విధుల నిర్వ‌హ‌ణ‌పై న‌ర్సులు ఆత్మ విమ‌ర్శ చేసుకోవాలి

-రోగుల‌తో మాన‌వీయ ద్రుక్ప‌థంతో వ్య‌వ‌హ‌రించాలి- మంత్రి స‌త్య‌కుమార్ యాద‌వ్‌
-చిరు న‌వ్వుతో ఆహ్వానించి రోగుల ముఖాల‌పై చిరున‌వ్వుతో పంపాలి
-మొద‌టిసారిగా నైటింగేల్ అవార్డుల ప్ర‌దానం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఉత్త‌మ‌మైన న‌ర్సింగ్ వృత్తిని చేప‌ట్టిన న‌ర్సులు త‌మ విధుల నిర్వ‌హ‌ణ తీరుపై ఆత్మ విమ‌ర్శ చేసుకోవాల‌ని రాష్ట్ర ఆరోగ్య‌,వైద్య శాఖా మంత్రి స‌త్య‌కుమార్ యాద‌వ్ సూచించారు. సోమ‌వారంనాడు విజ‌య‌వాడ‌లోని తుమ్మ‌ల‌ప‌ల్లి క‌ళా క్షేత్రంలో జ‌రిగిని అంత‌ర్జాతీయ న‌ర్సుల దినోత్స‌వం కార్య‌క్ర‌మంలో న‌ర్సింగ్ వృత్తికి సంబంధించిన ప‌లు విష‌యాల‌పై ఆయ‌న ప్ర‌సంగించారు. విశ్వ‌విఖ్యాత న‌ర్సు ఫ్లోరెన్స్ నైటింగేల్ 205వ జ‌యంతి సంద‌ర్భంగా రాష్ట్ర న‌ర్సులు మ‌రియు మిడ్‌వైఫ్‌ల కౌన్సిల్ ఈ కార్య‌క్ర‌మాన్ని ఏర్పాటు చేసింది.

ఆధునిక న‌ర్సింగ్ వృత్తికి ప్ర‌మాణాల్ని రూపొందించి గురుత‌ర సేవ‌లందించిన నైటింగేల్ చూపిన బాట‌లో న‌డ‌వాల‌ని న‌ర్సుల‌కు మంత్రి సూచించారు. “రోగుల‌ను చిరున‌వ్వుతో స్వీక‌రించి, వారి స‌మ‌స్య‌ల్ని ఓపిగ్గా విని, అర్ధం చేసుకుని, క‌రుణార్ధ హృద‌యంతో రోగుల‌కు చికిత్స‌నందించి, వారి ముఖాల్లో చిరున‌వ్వుతో ఆసుప‌త్రి నుంచి పంపాలి” అని మంత్రి  స‌త్య‌కుమార్ యాద‌వ్ న‌ర్సుల‌కు పిలుపునిచ్చారు. ఈ విలువ‌ల ప్రేర‌ణ‌తో సేవ‌లందిస్తున్న న‌ర్సుల్ని ఆయ‌న అభినందించారు.

న‌ర్సింగ్ ప్రాధాన్య‌త‌
న‌ర్సింగ్ సేవ‌ల ఆర్థిక ప్రయోజ‌న కోణాన్ని మంత్రి వివ‌రించారు. వ్య‌క్తులు, స‌మాజం పూర్తి ఆరోగ్యంతో జీవించేట‌ట్టుగా చేయ‌డానికి న‌ర్సింగ్ సేవ‌లు ఎంతో దోహ‌దం చేస్తాయ‌ని త‌ద్వారా సంపూర్ణ ఆరోగ్యంతో కూడిన ప్ర‌జానీకం శీఘ్ర ఆర్థిక ప్ర‌గ‌తికి దోహ‌దం చేస్తార‌ని మంత్రి స‌త్య‌కుమార్ యాద‌వ్ తెలిపారు. ప్ర‌జ‌ల స‌గ‌టు జీవ‌న కాలం ఒక సంవ‌త్స‌రం పెరిగితే ఆర్ధిక ప్ర‌గ‌తి భారీ స్థాయిలో ఊపందుకుంటుంద‌ని ఆయ‌న అన్నారు.

వైద్య సేవ‌లు స‌రిహ‌ద్దుల్లో దేశ ర‌క్ష‌ణ కోసం సైనికులు అందిస్తున్న సేవ‌ల‌తో స‌మ ప్రాధాన్య‌త క‌లిగిన‌వ‌ని అంటూ ఈ వృత్తిలో ఉన్న‌వారు త‌మ హ‌క్కుల ప‌రిర‌క్ష‌ణ కోసం ప్ర‌ధాన బాధ్య‌త‌ల్ని విస్మ‌రించ‌డం స‌రికాద‌ని మంత్రి వ్యాఖ్యానించారు.

న‌ర్సులు కూడా స‌గ‌టు మ‌నుషులేన‌ని, వారు వ్య‌క్తిగ‌త మ‌రియు వృత్తిప‌ర‌మైన స‌మస్య‌ల్ని ఎదుర్కొంటూ రోగుల‌కు సేవ‌లందిస్తార‌ని, ఈ క్ర‌మంలో జ‌రిగే చిన్న‌చిన్న పొర‌పాట్ల‌ను భూత‌ద్దంలో చూపి వారి ఆత్మ‌స్థైర్యాన్ని దెబ్బ‌తీయ‌కుండా మీడియా త‌గు సంయ‌మ‌నంతో వ్య‌వ‌హ‌రించాల‌ని మంత్రి స‌త్య‌కుమ‌ర్ యాద‌వ్ సూచించారు

రాష్ట్రంలో న‌ర్సింగ్ సేవ‌లు
తాజా స‌మాచారం మేర‌కు రాష్ట్రంలో 1,21,403 అర్హ‌త క‌లిగిన న‌ర్సులు రిజిస్ట‌ర్ చేసుకున్నార‌ని, ఇందులో 16,801 మంది ప్ర‌భుత్వాసుప‌త్రుల్లో ప‌నిచేస్తున్నార‌ని మంత్రి తెలిపారు. గ‌త ప్ర‌భుత్వం వైద్య రంగంలో ఎటువంటి ఖాళీలు లేకుండా నియామ‌కాలు చేశామ‌ని గొప్ప‌లు చెప్పుకుంద‌ని, దీనికి విరుద్ధంగా న‌ర్స‌ల‌కు సంబంధించే 5000 పైగా పోస్టులు ఖాళీగా ఉన్నాయ‌ని, వీటి భ‌ర్తీ కార్య‌క్ర‌మం మొద‌ల‌య్యింద‌ని మంత్రి స‌త్య‌కుమార్ యాద‌వ్ వెల్ల‌డించారు.

రాష్ట్రంలో అర్హ‌త క‌లిగిన ప్ర‌తి న‌ర్సూ రిజిస్ట్రేషన్ చేయించుకోవ‌డంతో పాటు గ‌త ఐదేళ్ల‌కు రెన్యువ‌ల్ చేసుకునేలా మ‌రియు అర్హ‌త లేని న‌ర్సులు ఆసుప‌త్రుల్లో ప‌నిచేయ‌కుండా త‌గు చ‌ర్య‌లు తీసుకోవాల‌ని రాష్ట్ర కౌన్సిల్‌ను మంత్రి ఆదేశించారు.

న‌ర్సింగ్ విద్యా ప్ర‌మాణాల ప్రాధాన్య‌త దృష్ట్యా ప్ర‌తి విద్యా సంస్థ‌లో అవ‌స‌రాల మేర‌కు మౌలిక స‌దుపాయాల ల‌భ్య‌త, స్వంత భ‌వ‌నాలు, క్లినిక‌ల్ అటాచ్మెంట్, బోధ‌నా సిబ్బంది ఉండేలా చూసేందుకు ప‌లు చ‌ర్య‌ల్ని చేప‌ట్టామ‌ని మంత్రి తెలిపారు.

మొద‌టిసారి నైటింగేల్ అవార్డుల ప్ర‌దానం
ఫ్లోరెన్స్ నైటింగేల్ పేరుతో ఆవిడ చూపిన మార్గాన్ని నేటి న‌ర్సులు అనుస‌రించే విధంగా ప్రోత్స‌హించేందుకు రాష్ట్ర కౌన్సిల్ మొద‌టి సారిగా ప్ర‌వేశ‌పెట్టిన అవార్డుల్ని మంత్రి శ్రీ స‌త్య‌కుమార్ యాద‌వ్ ప్ర‌దానం చేశారు. ప్ర‌తి అవార్డు గ్ర‌హీత‌ను రూ.25,000 న‌గ‌దు, షీల్డ్ ల‌తో స‌న్మానించారు. ఉత్త‌మ ఎఎన్ ఎంగా శ్రీమ‌తి రోహిణి, ఉత్త‌మ స్టాఫ్ న‌ర్సుగా శ్రీమ‌తి ఎం.నిరీక్ష‌ణా కుమారి, ఉత్త‌మ న‌ర్సింగ్ ఎడ్యుకేట‌ర్ గా డాక్ట‌ర్ సిబా ఫ్రాన్సిస్‌, ఉత్త‌మ న‌ర్సింగ్ ప‌రిశోధ‌క‌రాలుగా శ్రీమ‌తి బి. గంగాభ‌వాని, ఉత్తమ నర్సింగ్ అడ్మినిస్ట్రేటర్ గా డాక్టర్ ఎం. సత్యవల్లి అవార్డులందుకున్నారు.

ఈ కార్య‌క్ర‌మంలో డిఎంఇ మ‌రియు రాష్ట్ర కౌన్సిల్ ఎక్స్ అఫిషియో ప్రెసిడెంట్ డాక్ట‌ర్ న‌ర్సింహం, కౌన్సిల్ రిజిష్ట్రార్ ప్రొఫెస‌ర్ సుశీల ఇత‌ర ఉన్న‌తాధికారులు, న‌ర్సింగ్ క‌ళాశాల‌ల ప్రిన్సిపాళ్లు, బోధ‌నా సిబ్బంది, న‌ర్సులు మ‌రియు న‌ర్సింగ్ విద్యార్థులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

36 ఏళ్ల స్టీల్ ప్లాంట్ చరిత్రలో ఇలాంటి ఘటన జరగలేదు

-బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం -మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల చొప్పున పరిహారం -కుటుంబంలో ఒకరికి ప్లాంట్ లో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *