-లాభ, నష్టాలతో సంబంధం లేకుండా పొగాకు కొనుగోళ్లు చేయాలి
-ప్రతి కంపెనీ దామాషా ప్రకారం ఆక్షన్ లో గ్రేడ్ 2,3 పొగాకు కొనాలి
-ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్
ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త :
సరైన డిమాండ్ తో పాటు గిట్టుబాటు ధరలు లేక కష్టాల్లో ఉన్న పొగాకు రైతుల్ని బయ్యర్లు ఆదుకోవాలని ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ సూచించారు. పొగాకు రైతుల సమస్యలపై ఒంగోలు కలెక్టరేట్ లో సోమవారం సమావేశం నిర్వహించారు. మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామితో పాటు జిల్లా కలెక్టర్, ఐటీసీ ఛైర్మన్, ఈడీ, పలువురు ప్రజా ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొని పొగాకు రైతుల సమస్యల పరిష్కారానికి తీసుకోవాల్సిన వివిధ చర్యలపై చర్చించారు. ఈ సందర్భంగా మంత్రి గొట్టిపాటి రవికుమార్ మాట్లాడుతూ… గత రెండు, మూడు సంవత్సరాలుగా పొగాకు కొనుగోలు చేసిన బయ్యర్లు, కంపెనీలు ఎంతో లాభ పడ్డాయని తెలిపారు. ఆ సమయంలో రైతులకు కూడా పొగాకు పంట లాభాలు తెచ్చి పెట్టిందన్నారు. లాభాలు వచ్చినప్పుడు అందరూ కలసి పంచుకున్నట్లే… ప్రస్తుత పరిస్థితుల్లో బయ్యర్లు, వ్యాపారులు ముందుకు వచ్చి పొగాకు రైతుల్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.
బ్రెజిల్, జింబాబ్వే వంటి దేశాల్లో పొగాకు అధిక దిగుబడి రావడంతో, అంతర్జాతీయ మార్కెట్ లో పొగాకుకు కొంతమేర డిమాండ్ తగ్గిందని మంత్రి గొట్టిపాటి తెలిపారు. 160, 170 మిలియన్ టన్నులు పొగాకు దిగుబడి రావాల్సి ఉన్నా… దేశంలోనూ 240 మిలియన్ టన్నుల పంట వచ్చిందని వివరించారు. దీనితో పొగాకు రైతులకు కొంత మేర ఇబ్బంది కలిగిందని ఆయన స్పష్టం చేశారు. ఈ సమయంలో రైతుల్ని కాపాడాల్సిన అవసరం ఉందన్నారు. గ్రేడ్ 1 కొనుగోళ్లకు ముందుకు వచ్చిన బయ్యర్లు గ్రేడ్ 2, 3 రకాలను కూడా కొనుగోలు చేయాల్సిందేనని మంత్రి గొట్టిపాటి స్పష్టం చేశారు. అధిక ఉత్పత్తి పేరుతో పొగాకు ధరల్ని తగ్గించడం మంచి పద్ధతి కాదన్నారు. లాభ, నష్టాలను బేరీజు వేసుకోకుండా… ప్రతి కంపెనీ విధిగా ఆక్షన్ లో పాల్గొని అన్ని రకాల పొగాకును దామాషా ప్రకారం కొనుగోలు చేసి రైతులలో ఆందోళన తగ్గించి వారికి మేలు చేయాలని సూచించారు. రైతులకు ఎట్టి పరిస్థితుల్లో నష్టం కలుగకుండా చూడాల్సిన బాధ్యత బయ్యర్లు, వ్యాపారులపై ఉందని మంత్రి గొట్టిపాటి స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వం రైతులకు అండగా ఉంటుందని ఆయన తెలిపారు.
Prajavartha Online Telugu News