Breaking News

అట్టడుగు వర్గాల అభ్యున్నతికే ముఖ్యమంత్రి జగన్మోహన రెడ్డి అధిక ప్రాధాన్యత…

-లిడ్ క్యాప్ ద్వారా ఎస్సీ, ఎస్టీ వర్గాలకు ప్రయోజనం చేకూర్చేందుకు కృషి చేస్తాం…
-రాష్ట్ర విద్యుత్తు, అటవీ శాఖా మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రెక్కాడితేగానీ డొక్కాడని అట్టడుగువర్గాల వారికి ఆర్ధికప్రయోజనాలను కల్పించి సమాజంలో సముచితం స్థానం కల్పించాలనే లక్ష్యంతో రాష్ట్ర ముఖ్యమంత్రి వై.యస్. జగన్మోహన రెడ్డి అనేక సంక్షేమ పధకాలను అమలు చేస్తున్నారని రాష్ట్ర విద్యుత్తు, అటవీ శాఖామంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు.
లెదర్ ఇండస్ట్రీస్ డెవలప్ మెంట్ కార్పో రేషన్ ఆఫ్ ఆంధ్ర ప్రదేశ్ (లిడ్ క్యాప్) ఛైర్మన్‌గా నియమితులైన కాకుమాను రాజశేఖర్ గురువారం తాడేపల్లిలోని లిడ్ క్యాప్ ప్రధాన కార్యాలయంలో పదవీ బాధ్యతలను స్వీకరించారు. కార్యక్రమానికి మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈసందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలోని పేద బలహీన అట్టడుగు వర్గాల వారిని గత ప్రభుత్వం విస్మరించడం జరిగిందన్నారు. ముఖ్యంగా యస్ సి యస్ బిసి వర్గాల వారు ఆర్ధిక ఎదుగుదలకు దూరం అయ్యారన్నారు.
ముఖ్యమంత్రి పాదయాత్రలో బలహీనవర్గాల వారుపడుతున్న ఇబ్బందులను ప్రత్యక్షంగా చూసి చలించిపోయారన్నారు. రాష్ట్రం ఆర్ధిక ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ అప్పుడు ఇచ్చిన వాగ్దానాలను నెరవేరుస్తూ పేదల సంక్షేమానికి కట్టుబడ్డారన్నారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా పేద ప్రజలకు 38 లక్షల ఇళ్లస్థలాలను మంజూరు చేయడంతోపాటు గృహనిర్మాణాలు చేపడుతున్నారన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలలో యస్ సి యటి వర్గాల వారికి అధికప్రాధాన్యతనిచ్చి వారు ఆర్ధికంగా నిలదొక్కుకోవడం ద్వారా సమాజంలో సముచితస్థానం కల్పించాలన్నదే ముఖ్యమంత్రి ఉద్దేశ్యమన్నారు. లిడ్ క్యాప్ సంస్థ ద్వారా అట్టడుగువర్గాలవారికి ఆర్ధికప్రయోజనం చేకూరే విధంగా కృషి చేయాలని ఆయన నూతన ఛైర్మన్ కు సూచిస్తూ అభినందనలు తెలియజేశారు.
ఛైర్మన్ గా బాధ్యతలు చేపట్టిన కాకుమాను రాజశేఖర్ మాట్లాడుతూ పేదబలహీనవర్గాల ప్రజల సంక్షేమానికి కృషి చేస్తున్న ఏకైక ముఖ్యమంత్రి వై.యస్. జగన్మోహన రెడ్డే నన్నారు. ఇటీవల కార్పోరేషన్  ఛైర్మన్లుగా అధికశాతం మంది బలహీనవర్గాలవారిని ఆయన ఎంపిక చేయడమే ఇందుకు నిదర్శనం అన్నారు. నిర్జీవమైన లిడ్ క్యాప్ సంస్థకు జవసత్వాలను తీసుకొచ్చి ముందుకు నడపడం ద్వారా సంస్థ పై ఆధారపడిన బలహీనవర్గాల వారికి ప్రయోజనాలు కల్పించేందుకు ఇప్పటికే తాను ప్రణాళికలను రూపొందించుకోవడం జరిగిందన్నారు. వాటిని అమలు పరచడం ద్వారా ముఖ్యమంత్రి తన పై ఉంచిన నమ్మకాన్ని సఫలీకృతం చేసి ఆయన మన్ననలను పొందేందుకు కృషిచేస్తానన్నారు.
కార్యక్రమంలో లెదర్ ఇండస్ట్రీస్ డెవలప్ మెంట్ కార్పోరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (లిడ్ క్యాప్) మేనేజింగ్ డైరెక్టరు కె. హర్షవర్ధన్, జనరల్ మేనేజరు యం. పుష్పవతి, అసిస్టెంట్ మేనేజరు యన్. అధికారి, ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.

Check Also

కేంద్ర ప్ర‌భుత్వం రూ.1100 కోట్ల వ‌ర‌ద సాయాన్ని త్వ‌ర‌గా అందించాలి : ఎంపి కేశినేని శివ‌నాథ్

-కేంద్ర హోం శాఖ‌ మంత్రి అమిత్ షా కు విజ్ఞ‌ప్తి -విపత్తు నిర్వహణ (సవరణ) బిల్లు- 2024కు ఆమోదం -విజయవాడ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *