-గన్నవరం ఎయిర్ పోర్ట్ లో ఎయిర్ పోర్ట్ అడ్వైజరి కమిటీ సమావేశం
-ఎయిర్ పోర్ట్ అడ్వైజరి కమిటీ చైర్మన్ ఎంపీ బాలశౌరి, వైస్ చైర్మన్ ఎంపీ కేశినేని శివనాథ్ హాజరు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి త్వరలో దేశ,విదేశాలకు కొత్త విమాన సర్వీసులు రాబోతున్నాయని ఎయిర్ పోర్ట్ అడ్వైజరి కమిటీ వైస్ చైర్మన్, ఎంపి కేశినేని శివనాథ్ తెలిపారు. విజయవాడ గన్నవరం విమానాశ్రయం లో విమానాశ్రయ అభివృద్ది గురించి ఎయిర్ పోర్ట్ అడ్వైజరి కమిటీ గురువారం సమావేశం నిర్వహించింది. ఈ సమావేశంలో ఎయిర్ పోర్ట్ అడ్వైజరి కమిటీ చైర్మన్ ఎంపీ బాలశౌరి, వైస్ చైర్మన్ ఎంపీ కేశినేని శివనాథ్, ఎయిర్ పోర్ట్ డైరెక్టర్ లక్ష్మీకాంత్ రెడ్డి, కృష్ణ జిల్లా ఎస్పీ ఆర్.గంగాధర రావు, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశా పాల్గొన్నారు.
రాజధాని ప్రాంతంలోని విజయవాడ విమానాశ్రయం అభివృద్ది పలు అంశాలు ఈ సమావేశంలో విమానశ్రయ అధికారులతో చర్చించారు. అనంతరం ఎంపి కేశినేని శివనాథ్ మీడియా తో మాట్లాడుతూ ఎయిర్ పోర్ట్ లో భద్రతా ప్రమాణాలు, ట్రాఫిక్ మేనేజ్‌మెంట్‌పై చర్చించి ప్రయాణికుల సౌకర్యాల మెరుగుదలపై కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు తెలిపారు. పలు ఎయిర్ లైన్స్ సంస్థలతో మాట్లాడి కొత్త విమాన సర్వీసులు ప్రారంభించాలని కోరినట్లు తెలిపారు. దేశంలోని వివిధ ప్రాంతాలకు కనెక్టివిటీ పెంచే విధంగా కృషి చేస్తున్నట్లు వెల్లడించారు. కొత్త టెర్మినల్ పనులు ఆలస్యం అవటానికి గత ప్రభుత్వం నిర్లక్ష్యం కారణమన్నారు. ఎన్డీయే కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత పనులు వేగవంతంగా జరుగుతున్నాయన్నారు.ముఖ్యమంత్రి నారా చంద్రబాబు సూచనలు మేరకు మన సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టిపడేలా గన్నరం ఎయిర్పోర్ట్ డిజైన్ ఉండబోతుందన్నారు.
Prajavartha Online Telugu News