విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ నగరం సత్యనారాయణపురంలోని శ్రీ కాశీ విశ్వేశ్వరస్వామి దేవస్థాన ట్రస్ట్ బోర్డు నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవం శుక్రవారం ఆలయ ప్రాంగణంలో ఘనంగా జరిగింది. వేద పండితుల మంత్రోత్చరణలు, మేళతాళాలు, మంగళవాయిద్యాల నడుమ దేవాదాయ శాఖామాత్యులు వెల్లంపల్లి శ్రీనివాస్, స్థానిక శాసనసభ్యులు మల్లాది విష్ణు, మేయర్ రాయన భాగ్యలక్ష్మి కలసి చైర్మన్ గా కొల్లూరు రామకృష్ణచే ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా మల్లాది విష్ణు మాట్లాడుతూ.. శతాబ్ధ కాల చరిత్ర కలిగిన శ్రీ కాశీవిశ్వేశ్వర స్వామి దేవస్థానం ఏళ్ల తరబడి నిత్య పూజలతో తేజోవంతంగా వెలుగొందుతుందన్నారు. అటువంటి ఆలయ చైర్మన్ గా నియమితులు కావడమంటే ఎంతో బాధ్యతతో కూడుకున్నదని పేర్కొన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గుడికో గోమాత కార్యక్రమాన్ని సైతం వైవీ సుబ్బారెడ్డి చేతుల మీదుగా ఇటీవల ఆలయంలో ప్రారంభించుకోవడం జరిగిందన్నారు. దేవస్థాన ధ్వజారోహన కార్యక్రమాన్ని కూడా కన్నులపండువగా నిర్వహించుకున్నామన్నారు. ఇటువంటి ప్రశస్త ఆలయ పవిత్రను కాపాడవలసిన బాధ్యత పాలకమండలిపై ఉందని.. భక్తుల మనోభావాలకనుగుణంగా పారదర్శకంగా పనిచేయాలని సూచించారు. దేవస్థాన అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి సహాయ సహకారాలు ఎలప్పుడూ ఉంటాయని వెల్లడించారు. మరోవైపు ఆలయాల పునర్నిర్మాణం, టీటీడీ ప్రవేశపెడుతున్న కార్యక్రమాలతో ప్రజలలో ఆధ్యాత్మికత వెల్లివిరుస్తోందని మల్లాది విష్ణు చెప్పుకొచ్చారు. కావున ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక భావాన్ని పెంపొందించుకొని సన్మార్గంలో పయనించాలని.. అప్పుడే సమాజం సుఖ:సంతోషాలతో ప్రణవిల్లుతుందని వ్యాఖ్యానించారు.
అనంతరం కొల్లూరు రామకృష్ణ మాట్లాడుతూ.. తన నియామకానికి సహకరించిన సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు మల్లాది విష్ణు కి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. దేవస్థానాన్ని అన్నివిధాలుగా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానని.. దర్శనానికి వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా అన్ని వసతులు కల్పిస్తామని తెలిపారు. శాసనసభ్యులు తనపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని పేర్కొన్నారు. అనంతరం నూతన చైర్మన్ కు వేద పండితులు ఆశీస్సులు అందించి స్వామి వారి తీర్థప్రసాదాలు, చిత్ర పటం అందించారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు శర్వాణీ మూర్తి, బాలిగోవింద్, జానారెడ్డి, విజయవాడ చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు కొనకళ్ల విద్యాధరరావు, ఆర్యవైశ్య మహాసభ స్టేట్ ప్రెసిడెంట్ వి.వి.కె. నరసింహరావు, డబ్ల్యూఏఎం జిల్లా ప్రెసిడెంట్ పథకం నాగేశ్వరరావు, ఆలయ ఈఓ సీతారామయ్య, మాజీ కార్పొరేటర్ శిశ్లా రామలింగమూర్తి, వైఎస్సార్ సీపీ నాయకులు, శ్రేణులు, భక్తులు పాల్గొన్నారు.