-సంస్థ చైర్మన్ మెట్టు గోవర్ధనరెడ్డి
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
చేనేత సహకార సంఘాలకు మాతృ సంస్థ అయిన ఆప్కోను బలోపేతం చేసేందుకు ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ తరపున పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని ఏపీఐఐసీ చైర్మన్ మెట్టు గోవర్ధనరెడ్డి తెలిపారు. విజయవాడలోని ఆప్కో కేంద్ర కార్యాలయంలో శుక్రవారం ఆప్కో చైర్మన్ చిల్లపల్లి మోహనరావును మెట్టు మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా చేనేతల అభ్యున్నతి, ఆప్కో తరపున చేపడుతున్న కార్యక్రమాలను అడిగి తెలుసుకున్నారు. ఆప్కో చైర్మన్ మోహనరావు మాట్లాడుతూ నేటి ఆధునిక యుగంలో యువత, మహిళల అభిరుచికి తగ్గట్టుగా ఆప్కో తరపున కొన్ని డిజైన్లు, మోడళ్లను సొసైటీలకు అందజేసి నూతన వెరైటీలను ఆవిష్కరిస్తున్నామని తెలిపారు. అధునాతన డిజైన్లు నేసే విధంగా కార్మికులను చైతన్యవంతం చేస్తున్నామని, చేనేత కార్మికులు, యువతకు ఉపాధి అవకాశాలు మెరుగు పరిచేందుకు సహకార రంగాన్ని బలోపేతం చేసే చర్యలు చేపడుతున్నామని వివరించారు. కేవలం మహిళల కోసమే కాకుండా పురుషుల కోసం ఆప్కో ద్వారా రెడీమేడ్ షర్టులు తయారు చేసి షోరూముల్లో అందుబాటులో ఉంచామన్నారు. ప్రస్తుతం ఈ ప్రక్రియ మంచి ఫలితాలను ఇస్తుందన్నారు. గార్మెంట్స్ రంగంలో 50 వసంతాలకు పైబడి అనుభవం గడించిన ఏపీఐఐసీ చైర్మన్ మెట్టు గోవర్ధనరెడ్డి మాట్లాడుతూ రెడీమేడ్ వస్త్రాల తయారీకి సంబంధించి పలు సూచనలు, సలహాలు అందజేశారు. డిజైన్లు, రంగులు, స్టిచింగ్ తదితర విషయాలను ఆప్కో సిబ్బందికి వివరించారు. కొన్ని శాంపిళ్లను తమ కంపెనీ ద్వారా తయారు చేయించి ఇస్తామని తెలిపారు. కార్పొరేట్ కంపెనీలకు ధీటుగా ఆప్కో షోరూములు నిలదొక్కుకునే విధంగా తక్కువ ధరకు మన్నికైన రెడీమేడ్ వస్త్రాలను మార్కెట్లోకి ప్రవేశ పెట్టాలని సూచించారు. అలాగే, ఆప్కో బ్రాండుకు ప్రాచుర్యం కల్పించే విధంగా పబ్లిసిటీపై దృష్టి సారించాలని, సచివాలయంతోపాటు అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ఆప్కో వస్త్రాలను ప్రదర్శన, విక్రయం చేపట్టే విధంగా ఏర్పాటు చేస్తే మంచి ఆదరణ ఉంటుందని గోవర్ధన రెడ్డి అభిప్రాయపడ్డారు.