Breaking News

సుసంపన్న భారత్ ఆవిష్కృతం కావాలి… : పవన్ కల్యాణ్

-దేశ ప్రజలకు వజ్రోత్సవ శుభాకాంక్షలు…

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
వజ్రోత్సవ స్వాతంత్ర్య వేడుక… భారతావనికి ఓ మధురమైన ఘట్టం. భారత మాతకు స్వేచ్ఛా స్వాతంత్రాలు సిద్ధించినందుకు చారిత్రాత్మక గురుతుగా జరుపుకొంటున్న 75వ వేడుక. అమృతోత్సవ గీతిక. శతాబ్దాల పోరాట ఫలితం ఈ స్వాతంత్ర ఫలం. ఈ మహోత్కృష్టమైన రోజున మన దేశ స్వాతంత్ర సంగ్రామంలో ప్రాణాలు అర్పించిన త్యాగధనులను స్మరించుకుంటూ వారికి నీరాజనాలు సమర్పిస్తున్నానని జనసేన అధ్యక్షులు  పవన్ కల్యాణ్ జనసేన కార్యాలయం నుండి శ‌నివారం ఓ ప్రకటన విడుదల చేసారు. ఎన్నో అవాంతరాలను, మరెన్నో విలయాలను అధిగమిస్తూ మన దేశం విజయ ప్రస్థానాన్ని కొనసాగిస్తోంది. ఎందరో మేధావులు, రాజనీతిజ్ఞులు, కవులు, కళాకారులు, కోట్లాది మంది కార్మిక కర్షకులను ఈ ప్రపంచానికి భరతమాత అందిస్తూనే ఉంది. ప్రాచీన విజ్ఞానం, వేద వేదాంగాలను ఈ విశ్వ యవనికపై వెదజల్లుతూనే ఉంది. ప్రపంచంలో ఒక మహత్తరమైన శక్తిగా ఆవిర్భవించడానికి కృషి సలుపుతోంది. వసుధైక కుటుంబానికి బాటలు వేస్తోంది. ఇంతటి తేజోమూర్తి అయిన భరతమాతకు ప్రణమిల్లుతున్నాను. శతవార్షిక స్వాతంత్ర దినోత్సవం నాటికి నిరక్షరాస్యత, పేదరికం, సాంఘిక అసమానతలు లేని దేశంగా భారత్ ఆవిష్కృతమవ్వాలని కోరుకుంటున్నాను. ఆరోగ్యకరమైన సుసంపన్నమైన దేశంగా భారతావని విరాజిల్లాలన్నది నా ఆశ.. ఆకాంక్ష.. ఈ వజ్రోత్సవ శుభవేళ నా పక్షాన, జనసేన పక్షాన భారతీయులందరికీ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు.

Check Also

కేంద్ర ప్ర‌భుత్వం రూ.1100 కోట్ల వ‌ర‌ద సాయాన్ని త్వ‌ర‌గా అందించాలి : ఎంపి కేశినేని శివ‌నాథ్

-కేంద్ర హోం శాఖ‌ మంత్రి అమిత్ షా కు విజ్ఞ‌ప్తి -విపత్తు నిర్వహణ (సవరణ) బిల్లు- 2024కు ఆమోదం -విజయవాడ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *