Breaking News

రోగరహిత జీవితం… యోగాతో సాధ్యం

– రోజువారీ జీవితంలో యోగా భాగం కావాలి
– యోగాస‌నాల సాధ‌న‌తో శ‌రీరానికి కొత్త శ‌క్తి
– జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ‌

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
భార‌తీయ వార‌స‌త్వ సంప‌ద అయిన యోగాస‌నాల సాధ‌న‌ను నేడు ప్ర‌పంచ‌మంతా అనుస‌రిస్తోంద‌ని.. ఇది మ‌న దేశానికి గ‌ర్వ‌కార‌ణ‌మ‌ని ఎన్‌టీఆర్ జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ అన్నారు.
యోగాంధ్ర-2025 మాసోత్స‌వాల్లో భాగంగా 15వ రోజు బుధ‌వారం బీఆర్‌టీఎస్ యోగా స్ట్రీట్‌లో ఆయుష్‌శాఖ‌, జిల్లా అధికార యంత్రాంగ‌, విజ‌య‌వాడ న‌గ‌ర‌పాల‌క సంస్థ ఆధ్వ‌ర్యంలో జ‌రిగిన ప్ర‌త్యేక కార్య‌క్ర‌మంలో మాజీ సైనికోద్యోగులు, పెన్షనర్ల‌తో క‌లిసి క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ యోగాస‌నాలు వేశారు. అనంత‌రం క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ మాట్లాడుతూ ప్రతిఒక్కరి జీవితంలో యోగా సాధన భాగం కావాలని పిలుపునిచ్చారు. ప్ర‌స్తుత ఆధునిక జీవ‌న‌శైలిలో ఒత్తిడితో పాటు వివిధ అనారోగ్య స‌మ‌స్య‌లు ఎదుర‌వుతున్నాయ‌ని.. ఇలాంటి వాటి నుంచి ర‌క్ష‌ణ పొందేందుకు ఆరోగ్య‌క‌ర జీవితాన్ని సొంతం చేసుకునేందుకు యోగాస‌నాల అభ్య‌స‌న ముఖ్య‌మ‌న్నారు. భారతదేశ వార‌స‌త్వ‌, సాంస్కృతిక సంప‌ద అయిన యోగాను నేడు ప్ర‌పంచంలోని అనేక దేశాలు అనుస‌రిస్తున్నాయ‌న్నారు. జూన్ 21 నాటికి ఎన్‌టీఆర్ జిల్లాలో దాదాపు 10 ల‌క్ష‌ల మందికి యోగాసనాలు నేర్పించేందుకు జిల్లా యంత్రాంగం వేలాదిమంది శిక్షకులను ఏర్పాటు చేసిందన్నారు. గ్రామస్థాయి నుంచి జిల్లాస్థాయి వ‌ర‌కు ప్ర‌తిరోజూ ప్ర‌త్యేక యోగా కార్య‌క్ర‌మాలు జ‌రుగుతున్నాయ‌న్నారు. యోగా సాధ‌నను జీవితాంతం ఆచ‌రించేలా ప్ర‌జ‌ల‌ను ప్రోత్స‌హిస్తున్న‌ట్లు తెలిపారు. రోజువారి జీవితంలో ఎదుర‌య్యే ఒత్తిడిని యోగా సాధన ద్వారా అధిగమించవచ్చునని.. ఇది ప‌రిశోధ‌న‌ల్లో రుజువైంద‌ని పేర్కొన్నారు. యోగా సాధనతో శరీరంలో నూతన శక్తి వస్తుందన్నారు. రోజువారి జీవితంలో చేసే ప్రతి పనిని మరింత ఉత్తేజంగా చేసేందుకు యోగా సాధన ఒక మంచి అవకాశ‌మ‌న్నారు. జూన్ 21వ తేదీన అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుక‌ల‌ను ప్రతి గ్రామం, మండలం, పట్టణం, నగరాల్లో వైభవంగా నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం ఇప్పటికే వేదికలు సిద్ధంచేసిన‌ట్లు వివ‌రించారు.

డ్రగ్స్ వద్దు బ్రో…
కార్యక్రమంలో జిల్లా ఈగల్ టీమ్ ఆధ్వర్యంలో డ్రగ్స్ వద్దు బ్రో పోస్టర్ల ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది.
తెలిసీతెలియ‌ని వయసులో కొంద‌రు యువతీయువకులు మాద‌క‌ద్ర‌వ్యాల‌కు బానిసలుగా మారుతున్నార‌ని.. వారిని అలాంటి దురలవాట్ల నుంచి దూరం చేసేందుకు, డ్ర‌గ్స్ ర‌హిత రాష్ట్రం సాకారానికి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటుచేసిన “ఈగల్ టీం (టోల్‌ఫ్రీ నంబ‌రు 1972)కు ప్రజలందరూ సహకరించాలని కలెక్టర్ ల‌క్ష్మీశ పిలుపునిచ్చారు. మ‌త్తుప‌దార్థాలు అనేవి కుటుంబాల‌ను చిన్నాభిన్నం చేస్తాయ‌ని.. డ్ర‌గ్స్‌ను స‌మాజం నుంచి దూరం చేసేందుకు ప్ర‌తిఒక్క‌రూ చేయీచేయీ క‌ల‌పాల్సిన అవ‌స‌ర‌ముంద‌న్నారు. డ్రగ్స్ అలవాటు అనేది భయంకరమైన వ్యాధిగా తల్లిదండ్రులు గుర్తించాలన్నారు. మాద‌క‌ద్ర‌వ్యాల వినియోగం వల్ల కలిగే నష్టాలను తెలియజేసేందుకు పాఠశాల స్థాయి నుంచి విశ్వవిద్యాలయం వరకు అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నామని వివరించారు. ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా మాద‌క‌ద్ర‌వ్యాల వినియోగం, విక్రయాల అంశంలో ప్రభుత్వానికి సమాచారం అందించాలని, డ్ర‌గ్ ర‌హిత స‌మాజం సాకారానికి క‌లిసిరావాల‌ని క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ విజ్ఞ‌ప్తి చేశారు.
కార్య‌క్ర‌మంలో విజ‌య‌వాడ ఆర్‌డీవో కావూరి చైత‌న్య, జిల్లా సైనిక సంక్షేమ అధికారి, సర్జన్ లెఫ్టినెంట్ కమాండర్ (రిటైర్డు) కళ్యాణవీణ.కె, మాజీ సైనికుడు జగన్ మోహన్, మాజీ సైనిక సంక్షేమ సంఘాలకు చెందిన సుబేదార్ కె.కె. నరసింహారావు(రిటైర్డ్), నాయబ్ సుబేదార్ మోటూరి శంకర రావు(రిటైర్డ్), ఇతర మాజీ సైనికులు, వారి కుటుంబ సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
ఈగెల్ ఇన్‌స్పెక్ట‌ర్ టి.ధ‌నుంజ‌నాయుడు, డీఎంహెచ్‌వో డా. ఎం.సుహాసిని, కాలుష్య నియంత్ర‌ణ ఈఈ పి.శ్రీనివాస్‌, ఆయుష్ అధికారులు డా. వి.రాణి, డా. రామ‌త్లేహి, డా. ర‌త్న‌ప్రియ‌ద‌ర్శిని, యోగా ట్రైన‌ర్లు స‌త్య‌నారాయ‌ణ‌, రామాంజనేయులు త‌దిత‌రులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

36 ఏళ్ల స్టీల్ ప్లాంట్ చరిత్రలో ఇలాంటి ఘటన జరగలేదు

-బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం -మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల చొప్పున పరిహారం -కుటుంబంలో ఒకరికి ప్లాంట్ లో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *