-సి.రాఘవాచారి మీడియా అకాడమీ చైర్మన్ సురేశ్ కుమార్
-సహకారభూమి పక్ష పత్రిక 48వ సంచిక ఆవిష్కరణ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
జాతీయోద్యమంతో సమంగా ఆనాడు దేశంలో బలంగా సాగిన సహకారోద్యమం అనేక కారణాల వల్ల క్రమేణా బలహీనపడిందని, దీన్ని పునర్జీవింపజేసేలా సమాజంలోని అన్ని వర్గాల చెంతకు చేర్చితే సహకారభూమి స్థాపిత లక్ష్యం చరితార్థమౌతుందని సి.రాఘవాచారి మీడియా అకాడమీ, ఆంధ్రప్రదేశ్ చైర్మన్ ఆలపాటి సురేశ్ కుమార్ సూచించారు. సహకార భావన నేటి యువతరానికి తెలిసేలా, వారిని ప్రభావితం చేసేలా విస్తృత ప్రచారం జరగాల్సిన అవసరం కూడా వుందని పిలుపిచ్చారు. సహకారభూమి జర్నల్ సహకార సంఘం ఆధ్వర్యాన విజయవాడ నుంచి వెలువడుతున్న సహకారభూమి పక్ష పత్రిక రెండేళ్ల ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా 48వ సంచికను సురేశ్ కుమార్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సీనియర్ జర్నలిస్ట్, సంఘం డైరెక్టర్ చావా రవి అధ్యక్షతన సహకారభూమి సహకార సంఘ కార్యాలయంలో బుధవారం ఉదయం జరిగిన సభలో ఆయన ప్రసంగించారు.
మానవుడి ఆవిర్భావంతోనే సహకారం మొదలైందని, మనిషి కుటుంబం నుంచి సామాజిక జీవనం వరకూ సహకారంలో భాగమేనని సురేశ్ కుమార్ అన్నారు. పదిమందీ కలిసి ఏదైనా ఒక లక్ష్యాన్ని చేరటమనేదే సహకారమనే విషయంపై యువతలో అవగాహన కల్పించి, సహకార విలువలను వారిలో ప్రోది చేసే ప్రయత్నం జరగాలన్నారు. ‘సహకార సంఘాలనే ఒక వ్యవస్థ వుంది. పదిమందీ కలిసి సంఘం ఏర్పాటు చేసుకుంటారు. అందులో కొంత సొమ్ము పొదుపు చేస్తారు. నలుగురూ కలసికట్టుగా అభివృద్ధి చెందుతారు. వాటి సత్ఫలితాలు ఆస్వాదిస్తారనే విషయాలు నేటితరానికి తెలియనే తెలియవు’ అని విచారం వ్యక్తపర్చారు.
‘దేశానికి స్వాతంత్ర్య సముపార్జన తరువాత ఆనాటి ప్రభుత్వాలు సహకార రంగానికి పెద్దపీట వేశాయి. సహకారోద్యమం క్రమేపీ బలపడింది. ఒక దశకు చేరాక ఎదుగుదల ఆగిపోయింది. దేశంలో ఉదారవాద విధానాలు అమల్లోకి వచ్చాక సహకార రంగానికి ఆదరణ తగ్గింది. ప్రజల్లోనూ క్రమంగా ఉద్యమం బలహీనపడింది. రాజకీయ పార్టీల అనుబంధ సంఘాలుగా కార్మికవర్గం సంఘటితంగా వున్నంతకాలం సహకార భావన కూడా బలంగా వుంది. ఇవాళ కార్మికవర్గమనేదే దాదాపుగా నిర్వీర్యమయింది. సహకారంపైనా దాని ప్రభావం పడింది’ అని విశ్లేషించారు. ఇక, కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకించి సహకార శాఖను ఏర్పరచి కార్యకలాపాలను వేగవంతం చేసినప్పటికీ మంచిచెడ్డల మాటెలావున్నా, సహకార రంగమనేది రాష్ట్రాల పరిధిలోని విభాగమనేది తన నిశ్చితాభిప్రాయమని సురేశ్ కుమార్ స్పష్టం చేశారు.
హైదరాబాద్ ఆంధ్రప్రభలో పనిచేసినపుడు తమకో సహకార సంఘం వుండేదని, అవసరమైనపుడు సభ్యులకు రుణ సదుపాయం లభించేదంటూ సంఘం ప్రయోజనాల్ని ప్రస్తావించారు. సహకారభూమి పత్రిక చేస్తున్నది చాలా మంచి ప్రయత్నమని, అన్ని రంగాల్లో పనిచేసే సంఘటిత, అసంఘటిత రంగ కార్మికులను సహకార రంగం వైపు మరల్చేలా పత్రిక కృషి చేయాలని సూచించారు. ఇవాళ ముద్రణలో వచ్చే పత్రికలు చదివేవారి సంఖ్య చాలావరకు తగ్గిపోయిందనీ, డిజిటల్ రూపంలో విస్తృత ప్రజాబాహుళ్యం చెంతకు చేర్చేలా మార్గాలు అన్వేషించాలని సూచించారు. యువతరాన్ని సహకార రంగం వైపు ఆకర్షించేలా తెలుగు రాష్ట్రాల్లో, ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్ లో సహకార రంగానికి ఏమాత్రం ఊతమివ్వగలిగినా సహకారభూమి లక్ష్యం చరితార్థమౌతుందని సి.రాఘవాచారి మీడియా అకాడమీ, ఆంధ్రప్రదేశ్ చైర్మన్ ఆలపాటి సురేశ్ కుమార్ ఆకాంక్షించారు.
తొలుత సహకారభూమి జర్నల్ సహకార సంఘం వ్యవస్థాపక సభ్యులు కొమ్మాలపాటి శరశ్చంద్ర జ్యోతిశ్రీ సభకు స్వాగతం పలికారు. సంఘం అధ్యక్షులు, పత్రిక గౌరవ సంపాదకులు దాసరి కేశవులు, ఎడిటర్ అక్బర్ పాషా, సంపాదకవర్గ సభ్యులు కృష్ణ కానూరి, డి.స్వాతి, నాగార్జున, న్యాయ సలహాదారు మల్లెల శేషగిరిరావు, సభ్యులు టి.వి.నరసింహరావు, వై.దయానంద్, సహకారవాదులు జి.ఎస్.చక్రవర్తి, బి.సాంబిరెడ్డి, సాంబశివరావు, పీపుల్స్ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ ప్రతినిధులు ఎ.రామ్ జీ, జి.పరశురామ్ పాల్గొన్నారు. సహకారభూమి సహకార సంఘం కార్యదర్శి వీరమాచనేని రత్నప్రసాద్ వందన సమర్పణ చేశారు.
Prajavartha Online Telugu News