-పేదరికాన్ని అధిగమించే శక్తి విద్యకే ఉంది…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సారధ్యంలో చదువుల విప్లవం వచ్చిందని సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు మల్లాది విష్ణు అన్నారు. రాజీవ్ నగర్లోని రాజీవ్ గాంధీ మునిసిపల్ ప్రభుత్వ పాఠశాలలో మూడోరోజు జగనన్న విద్యాకానుక పథకాన్ని డిప్యూటీ మేయర్ అవుతు శ్రీశైలజ తో కలిసి ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదరికం, అసమానతలను అధిగమించడంలో విద్య ప్రధాన భూమిక పోషిస్తుందన్నారు. విద్యతోనే మనిషి విలువ పెరుగుతుందన్నారు. జీవితాలను ఉన్నత శిఖరాలకు చేర్చగల, సాధికారికత చేకూర్చగల శక్తి ఒక్క చదువుకే ఉందన్నారు. అంతటి ప్రాముఖ్యం గల విద్యను ప్రతి ఒక్కరికి అందించేందుకు అమ్మ ఒడి, నాడు– నేడు, విద్యా దీవెన వంటి పథకాలను రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టడం జరిగిందన్నారు. విద్యారంగంలో గడిచిన రెండేళ్లల్లో రాష్ట్ర ప్రభుత్వం రూ. 30 వేల కోట్ల నిధులు వెచ్చించినట్లు వెల్లడించారు. ప్రైమరీ స్కూల్ దశ నుంచి విదేశీ విద్య వరకు పేద విద్యార్థులకు అన్ని రకాల సహాయ సహకారాలందిస్తున్నట్లు తెలియజేశారు. గత తెలుగుదేశం హయాంలో విద్యారంగాన్ని వ్యాపారంగా మార్చి కార్పొరేట్ కబంధ హస్తాలలో పడవేసిందని మల్లాది విష్ణు అన్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం విద్యా వ్యవస్థలో పలు సంస్కరణలు చేపట్టి.. 100 శాతం అక్షరాస్యత సాధించే దిశగా అడుగులు వేస్తోందన్నారు. నాడు-నేడు కార్యక్రమం ద్వారా శిథిలావస్థకు చేరిన బడులను మళ్లీ దేవాలయాలుగా మారుస్తున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా రూ. 60 లక్షలతో రాజీవ్ గాంధీ మున్సిపల్ పాఠశాలను సైతం అభివృద్ధి చేసుకోబోతున్నట్లు తెలియజేశారు. పేరెంట్స్ కమిటీ సభ్యులు ఈ ప్రగతి పనులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాల్సిన అవసరం ఉందన్నారు. దీనికితోడు పాఠశాలకు ఒక శాశ్వత ఆటస్థలాన్ని కూడా ఏర్పాటు చేసే దిశగా ఆలోచనలు చేస్తున్నట్లు మల్లాది విష్ణు పేర్కొన్నారు. పాఠశాలలో విద్యార్థుల హాజరు శాతం పెంచే దిశగా ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు. అనంతరం పాఠశాలలో చదువుతున్న 776 మంది విద్యార్థులకు జగనన్న విద్యాకానుక కిట్లను పంపిణీ చేయడంతో పాటుగా.. నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్ షిప్ సాధించిన కత్తి ప్రేమ్ కుమార్ అనే విద్యార్థికి ఎమ్మెల్యే చేతుల మీదుగా బహుమతి ప్రదానం చేయడం జరిగింది. కార్యక్రమంలో డీవైఈవో వీఎంసీ రాజు, స్థానిక వైఎస్సార్ సీపీ నాయకులు మోదుగుల గణేష్, టెక్కెం కృష్ణ, సీహెచ్ రవి, మందాడి వెంకట్రావ్, నాగు, హెడ్ మాస్టర్ శ్రీనివాసరావు, విద్యార్థుల తల్లిదండ్రులు, పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News