Breaking News

దేశ, రాష్ట్రాల చట్టసభల్లో సమావేశాలకు తరచూ అంతరాయాలు కలగడం పట్ల ఆవేదన వ్యక్తం చేసిన ఉపరాష్ట్రపతి, తన దుఃఖానికి అదే కారణమని వెల్లడి…

-సభ్యుల ప్రవర్తన పట్ల భయపడి కాదు, కఠిన చర్యలు తీసుకోవలసిన పరిస్థితులు కల్పిస్తున్నారనే తన ఆవేదన అన్న ఉపరాష్ట్రపతి
-ఇటీవల పార్లమెంట్ లో సమావేశాలు సరిగా జరగకపోవడం ఎంతో బాధించింది
-ప్రజా ప్రతినిధులు ఆదర్శప్రాయమైన వ్యవహార శైలి కలిగి ఉండాలి, అర్థవంతమైన చర్చల ద్వారా ప్రజా జీవన ప్రమాణాలు పెంచాలి
-దేశ పురోగతిని వేగవంతం చేయడానికి యువత నూతన ఆవిష్కరణలతో ముందుకు రావాలని పిలుపు
-కర్బన ఉద్గారాలను తగ్గించేందుకు విలక్షణ మార్గాల మీద దృష్టి పెట్టాలని పిలుపు
-ఫెడరేషన్ ఆఫ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (ఎఫ్‌కేసీసీఐ) ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ‘శ్రీ మోక్షగుండం విశ్వేశ్వరయ్య స్మారక అవార్డు’ ప్రదానోత్సవాని ముఖ్య అతిథిగా విచ్చేసిన ఉపరాష్ట్రపతి
-ఆధునిక భారత సామర్థ్యం, ఆకాంక్షలకు మోక్షగుండం విశ్వేశ్వరయ్య ప్రతిరూపమని వెల్లడి
-విశ్వేశ్వరయ్యకు ఘనంగా నివాళులు అర్పించిన ఉపరాష్ట్రపతి

బెంగళూరు, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రజల ఆకాంక్షలను ప్రతిబింబించాల్సిన చట్టసభల్లో తరచూ సమావేశాలకు తరచూ కలుగుతున్న అంతరాయాల పట్ల, ప్రజాస్వామ్య వ్యవస్థ నవ్వులపాలు అవుతుండడం పట్ల ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. భారత పార్లమెంట్, మరియు రాష్ట్రాల శాసన సభల్లో జరిగే సమావేశాలు అర్ధవంతంగా ప్రజల జీవన ప్రమాణాలను పెంచే విధంగానూ, యు వతకు ఆదర్శంగా ఉండాలన్న ఆయన, ప్రజాప్రతినిధులు ఆదర్శనీయులుగా ఉండాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు.
బుధవారం బెంగళూరులో ఫెడరేషన్ ఆఫ్ కర్ణాటక చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (ఎఫ్‌కేసీసీఐ) ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన శ్రీ మోక్షగుండం విశ్వేశ్వరయ్య స్మారక అవార్డు ప్రదానోత్సవంలో ఉపరాష్ట్రపతి ముఖ్య అతిథిగా ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఇటీవల రాజ్యసభలో సమావేశాలకు తరచూ అంతరాయాలు కలగడం, సభ సజావుగా ముందుకు సాగకపోవడం తనకు బాధను కలిగించిందని, అంతే కాకుండా ఇటీవల పలు రాష్ట్రాల శాసన సభల్లో జరిగిన సంఘటనలు, చోటు చేసుకుంటున్న పరిణామాలు తనకు ఆవేదన కలిగించాయని తెలిపారు. పార్లమెంట్ లో ఇటీవల జరిగిన సంఘటనలు దురదృష్టకరమన్న ఉపరాష్ట్రపతి, కొంత మంది సభ్యులు ప్రవర్తించిన తీరు విచారకరమన్నారు. పార్లమెంట్ స్థాయిని దిగజార్చే విధంగా కొందరు సభ్యులు ప్రవర్తించారని, కఠిన చర్యలు తీసుకునే పరిస్థితులు కల్పిస్తున్నారని, ఇదే తనకు దుఃఖాన్ని కలిగించిందని తెలిపారు.
కొందరు పార్లమెంట్ సభ్యుల ప్రవర్తన సభాస్థాయికి తగిన విధంగా లేవన్న ఉపరాష్ట్రపతి, చట్టసభలు చర్చించడానికి, నిర్ణయాలు తీసుకోవడానికి మాత్రమేనని, అంతరాయాలు కలిగించడం సరైన పద్ధతి కాదని తెలిపారు. ప్రజాస్వామ్యంలో ప్రజాతీర్పును గౌరవించాలన్న ఆయన, అసమ్మతిని వ్యక్తం చేయడంలో తప్పు లేదని, నిశితంగా విమర్శించవచ్చని అదే సమయంలో ఎవరి మీద తమ అభిప్రాయాలను బలవంతంగా రుద్దకూడదని స్పష్టం చేశారు. వివిధ స్థాయిల్లో పార్లమెంట్ సభ్యులు, శాసన సభ్యులు అర్థవంతమైన చర్చల ద్వారా సమావేశాలను ప్రజలకు మేలు కలిగే విధంగా వినియోగించుకోవాలని సూచించారు. భవిష్యత్ లో ఈ పరిస్థితి మారాలని ఆకాంక్షించారు.
భారతదేశ ఆర్థిక వ్యవస్థను, ఇక్కడి ప్రజల జీవన ప్రమాణాలను మరింత సుస్థిరం చేసేందుకు శ్రీ మోక్షగుండం విశ్వేశ్వరయ్య లాంటి మహనీయుల స్ఫూర్తితో నూతన ఆవిష్కరణల దిశగా యువత ముందుకు కదలాల్సిన అవసరం ఉందని, ఈ దిశగా వారిని మరింత ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతో ఉందని ఉపరాష్ట్రపతి పేర్కొన్నారు. వాతావరణ మార్పులనుంచి మనల్ని మనం కాపాడుకునేందుకు అంతర్జాతీయంగా తీసుకునే చర్యల్లో రానున్న కొన్ని సంవత్సరాలు అత్యంత కీలకమని, దేశ ఆర్థిక వ్యవస్థను సుస్థిరం చేసే విషయంలో కర్బన ఉద్గారాలను గణనీయమైన స్థాయిలో తగ్గించాల్సిన అవసరం ఉందని ఆయన సూచించారు. నూతన ఆవిష్కరణలతోనే సుస్థిరాభివృద్ధి సాధ్యమవుతుందని నొక్కిచెప్పారు.
దేశంలో క్షేత్రస్థాయిలో నూతన ఆవిష్కరణకోసం ప్రయత్నిస్తున్నవారిని గుర్తించి, ప్రోత్సహించి వారికి కావాల్సిన సహాయాన్ని అందించడం ద్వారా వారిని వాణిజ్యపరంగా బలోపేతం చేసే విషయంలో జాతీయ స్థాయిలో జరుగుతున్న ప్రయత్నానికి ప్రైవేటు రంగం, పారిశ్రామికవేత్తలు తమవంతు సహకారం అందించాలన్న ఉపరాష్ట్రపతి, ఈ సందర్భంగా నేషనల్ ఇన్నొవేషన్ ఫౌండేషన్, నీతి ఆయోగ్, అటల్ ఇన్నొవేషన్ మిషన్ వంటి కార్యక్రమాలను ప్రస్తావించారు.
కొంతకాలంగా దేశంలో ఆవిష్కరణలను ప్రోత్సహించేందుకు అనువైన వాతావరణం ఏర్పడిందన్న ఉపరాష్ట్రపతి, ప్రపంచ మేథోసంపత్తి హక్కుల సంస్థ (డబ్ల్యూఐపీవో) 2020 సంవత్సరానికి గానూ విడుదల చేసిన ‘ప్రపంచ ఆవిష్కరణల సూచీ’ (గ్లోబల్ ఇన్నొవేషన్ ఇండెక్స్)లో భారతదేశం ఉత్తమ 50 దేశాల జాబితాలో చోటు దక్కించుకున్న విషయాన్ని గుర్తుచేశారు. రానున్న రోజుల్లో మరింత శ్రమించి టాప్-10 జాబితాలో నిలవాలని ఉపరాష్ట్రపతి ఆకాంక్షించారు. (తాజా జాబితాలో భారతదేశం 48వ స్థానంలో ఉంది.)
విద్యార్థుల్లో చిన్నప్పటినుంచే సృజనాత్మకతను, నూతన ఆవిష్కరణల సంస్కృతిని ప్రోత్సహించాల్సిన ప్రాధాన్యతను తెలియజేసిన ఉపరాష్ట్రపతి, ఈ దిశగా అభ్యాసన-విద్యాబోధన ప్రక్రియలో చిన్నారుల్లో కొత్త విషయాలను తెలుసుకోవాలన్న ఉత్సుకతను పెంపొందించాలన్నారు. అటల్ టింకరింగ్ ల్యాబ్‌లు ఈ దిశగా ప్రయత్నిస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. విద్యార్థులు తమ సృజనాత్మకతను చాటుకునేందుకు అవసరమైన ‘ఇన్నొవేషన్ హబ్స్’ ను కళాశాలల్లో ఏర్పాటుచేయాలన్నారు. పరిశ్రమలు కూడా ఆవిష్కరణలు, పరిశోధన, అభివృద్ధి (ఆర్ & డీ) పై మరింత పెట్టుబడి పెట్టాలని సూచించారు.
కర్ణాటక ప్రభుత్వం, తమ రాష్ట్రంలో నూతన ఆవిష్కరణలకు విశేషమైన ప్రోత్సాహాన్ని అందించడాన్ని అభినందించిన ఉపరాష్ట్రపతి, ఇందుకుగానూ జనవరి 2021లో నీతి ఆయోగ్ సంస్థ విడుదల చేసిన.. ‘ఇండియా ఇన్నొవేషన్ ఇండెక్స్ -2020’లో మేజర్ స్టేట్స్ విభాగంలో కర్ణాటక రాష్ట్రం మొదటి స్థానంలో నిలవడం ఆనందదాయకమని తెలిపారు. ఈ దిశగా ప్రోత్సహించిన రాష్ట్ర ప్రభుత్వం, పారిశ్రామికవేత్తలు, ఇతర భాగస్వామ్య పక్షాలను అభినందించారు..
ఈ వేదిక ద్వారా శ్రీ మోక్షగుండం విశ్వేశ్వరయ్యకు ఘనంగా నివాళులు అర్పించిన ఉపరాష్ట్రపతి, శ్రీ విశ్వేశ్వరయ్య ఆధునిక భారత నిర్మాణంలో కీలకపాత్ర పోషించిన ఇంజనీర్ అని, ప్రఖ్యాత మౌలికవసతుల నిర్మాత అని ప్రశంసించారు. మైసూరులోని కృష్ణ సాగర్ ఆనకట్ట, హైదరాబాద్‌లో నిర్మించిన వరదల నివారణ వ్యవస్థతో పాటు తిరుమల ఘాట్ రోడ్ వంటి ఎన్నో ప్రతిష్టాత్మక నిర్మాణాల్లో శ్రీ విశ్వేశ్వరయ్య పాత్రను ఆయన గుర్తుచేసుకున్నారు. వారి జయంతిని ప్రతి ఏటా దేశవ్యాప్తంగా ‘ఇంజనీర్స్ డే’గా జరుపుకుంటున్నామన్నారు.
మైసూరు రాజ్య దీవాన్ గా, ఆ ప్రాంతంలో భద్రావతిలో ఉక్కు కర్మాగారం, మైసూరు సబ్బుల కర్మాగారం, మైసూరు చాంబర్ ఆఫ్ కామర్స్ ఎన్నో ప్రతిష్టాత్మకమైన సంస్థలను ఏర్పాటుచేయడంలో శ్రీ విశ్వేశ్వరయ్య తీసుకున్న చొరవను ఈ సందర్భంగా ఉపరాష్ట్రపతి గుర్తుచేశారు. స్వాతంత్ర్యానికి పూర్వమే దేశంలో పారిశ్రామికీకరణ ఉద్యమానికి శ్రీ విశ్వేశ్వరయ్య నేతృత్వం వహించారన్నారు. వారి బహుముఖ ప్రజ్ఞను ప్రశంసిస్తూ నవజాత, ఆధునిక భారత శక్తిసామర్థ్యాలకు, ఆకాంక్షలకు శ్రీ విశ్వేశ్వరయ్య ప్రతిరూపంగా నిలిచారన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెస్ రామయ్య గ్రూప్ సంస్థల చైర్మన్ డాక్టర్ ఎమ్మార్ జయరామ్‌కు ఉపరాష్ట్రపతి శ్రీ ఎం విశ్వేశ్వరయ్య స్మారక అవార్డును ప్రదానం చేశారు. ఎమ్మెస్ రామయ్య గ్రూప్ సంస్థలను ప్రభావవంతమైన విద్యాకేంద్రంగా మార్చడంలో డాక్టర్ జయరాం అంకితభావంతో కృషిచేశారని ఉపరాష్ట్రపతి ప్రశంసించారు. రాష్ట్రంలో నూతన ఆవిష్కరణలకు ప్రోత్సాహాన్ని అందిస్తున్న ఎఫ్‌కేసీసీఐ ని కూడా ఉపరాష్ట్రపతి అభినందించారు.
ఈ కార్యక్రమంలో కర్ణాటక గవర్నర్  థావర్ చంద్ గెహ్లాట్, ముఖ్యమంత్రి  బసవరాజ్ బొమ్మాయ్, పార్లమెంట్ సభ్యులు  పి.సి.మోహన్, ఎఫ్.కె.సి.సి.ఐ. అధ్యక్షులు  పెరికల్ ఎం సుందర్ సహా పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

పనిచేయని అగ్నిమాపక పరికరాలను మూడు రోజుల్లోగా పునరుద్ధరించాలి

-లేనిపక్షంలో అనుమతుల రద్దు : వీఎంసీ ఫైర్ అధికారులు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగరంలో ప్రజల …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *