-మెగా వ్యాక్సినేషన్ డ్రైవ్ ను పరిశీలించిన ఎమ్మెల్యే మల్లాది విష్ణు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
కరోనా నియంత్రణ చర్యల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలిచిందని సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు మల్లాది విష్ణు అన్నారు. మెగా వ్యాక్సినేషన్ కార్యక్రమంలో భాగంగా 61వ డివిజన్ లోని 258 వార్డు సచివాలయంలో ఏర్పాటు చేసిన వ్యాక్సినేషన్ సెంటర్ ను డివిజన్ కార్పొరేటర్ ఉమ్మడి రమాదేవితో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ థర్డ్ వేవ్ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో కరోనా నియంత్రణలో ప్రభుత్వం మెరుగైన పనితీరు కనబరుస్తుందన్నారు. కరోనా నియంత్రణ చర్యలలో భాగంగా విజయవాడ నగర వ్యాప్తంగా 64 డివిజన్ లలోని 25 కేంద్రాలలో మెగా వ్యాక్సినేషన్ డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు మల్లాది విష్ణు తెలిపారు. 30వేల మందికి వ్యాక్సినేషన్ వేసే దిశగా నిర్వహిస్తున్న ఈ డ్రైవ్ ను సద్వినియోగం చేసుకుని రక్షణ పొందవలసిందిగా ప్రజలకు పిలుపునిచ్చారు.
అగ్రిగోల్డ్ బాధితులకు అండగా జగనన్న ప్రభుత్వం…
పాదయాత్రలో ఇచ్చిన హామీకి కట్టుబడి రూ. 20 వేల లోపు ఉన్న అగ్రిగోల్డ్ డిపాజిట్ దారులకు బ్యాంకు ఖాతాల్లో రేపు ముఖ్యమంత్రి నగదు జమ చేయనున్నట్లు మల్లాది విష్ణు తెలిపారు. ఇందులో భాగంగా ఒక్క 258వ వార్డు సచివాలయ పరిధిలోనే 118 మంది డిపాజిట్ దారులకు రూ. 7,74,705 అందజేయనున్నట్లు వెల్లడించారు. దేశంలో ఎక్కడా ప్రైవేట్ సంస్ధ మూసేస్తే బాధితులకి ప్రభుత్వం న్యాయం చేసిన దాఖలాలు లేవన్నారు. అగ్రి గోల్డ్ బాధితుల కష్డాలని నేరుగా చూసిన వ్యక్తిగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం తరపున న్యాయం చేస్తున్నారన్నారు. అధికారంలోకి రాగానే తొలి బడ్జెట్ లో రూ. 264 కోట్లు కేటాయించి రూ.10 వేలలోపు డిపాజిట్ చేసిన 3 లక్షల 40వేల మందికి రూ. 240 కోట్లను చెల్లించారని గుర్తు చేశారు. రూ.20 వేలలోపు డిపాజిట్ చేసిన వారికి సైతం డబ్బు చెల్లించేందుకు వీలుగా హైకోర్టు అనుమతి తీసుకుని చెల్లింపు ప్రక్రియను వేగవంతం చేశారన్నారు. గత చంద్రబాబు ప్రభుత్వం అగ్రి గోల్డ్ యాజమాన్యంతో కుమ్మక్కై బాధితులకి అన్యాయం చేసిందని.. 300 మంది బాధితుల ఆత్మహత్యకు కారకులయ్యారని విమర్శించారు. చంద్రబాబు చేసిన తప్పిదాలను సరిదిద్దుతూ ముఖ్యమంత్రులు బాధితులకు న్యాయం చేస్తున్నారన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ నాయకులు ఉమ్మడి వెంకట్రావు, నాళం బాబు, నాగిరెడ్డి, కరీముల్లా, వియ్యపు రాజా తదితరులు పాల్గొన్నారు.
కరోనా కట్టడికి వ్యాక్సినేషన్ ఒక్కటే శాశ్వత పరిష్కారం…
కండ్రికలోని 282వ వార్డు సచివాలయంలో నిర్వహించిన వ్యాక్సినేషన్ డ్రైవ్ ను శాసనసభ్యులు మల్లాది విష్ణు సందర్శించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో కరోనా పరిస్థితులను రాష్ట్ర ప్రభుత్వం సమర్థవంతంగా ఎదుర్కొంటోందని పేర్కొన్నారు. కరోనా వైరస్ నియంత్రణ, లాక్‌డౌన్ అమలు చేస్తున్న తీరు, నిర్వహిస్తున్న పరీక్షలు, వ్యాక్సినేషన్‌లో దేశంలోనే ఏపీ ముందుందని చెప్పారు. కానీ చంద్రబాబు, నారా లోకేష్ మాత్రం జూమ్ లలో కాలక్షేపం చేస్తున్నారని విమర్శించారు. మూడో దశ కరోనాపై ఇప్పటికే సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అధికార యంత్రాంగాన్ని సన్నధ్ధం చేశారని చెప్పారు. ప్రజలందరికీ వ్యాక్సినేషన్ ద్వారా రక్షణ కల్పించి, తగు చికిత్సలు అందించాలని ఆదేశించారన్నారు. కరోనా ఎన్ని వేవ్ ల్లో వచ్చినా కూడా ఎదుర్కొనేందుకు ప్రభుత్వ యంత్రాంగం అంతా అప్రమత్తంగా ఉందని మల్లాది విష్ణు అన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ నాయకులు యర్రగొర్ర శ్రీరాములు, అక్తిశెట్టి నారాయణ, ఎస్.కె.ఇస్మాయిల్, ఎస్.కె.భాష, అగురు త్రినాథ్, పిన్నిబోయిన సుబ్బారావు, భీమిరెడ్డి శివరామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News