ఆక్వా ఉత్పత్తుల వినియోగం పెంచేందుకు మూడు ప్రాంతాల్లో ఆక్వాహబ్ లు…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలో ఆక్వా ఉత్పత్తుల వినియోగం పెంచడానికి పెనమలూరు, గుడివాడ, నూజివీడు ప్రాంతాల్లో ఆక్వాహబ్ లు ప్రభుత్వం ఏర్పాటు చేస్తోందని జిల్లా కలెక్టర్ జె.నివాస్ చెప్పారు. మంగళవారం స్థానిక కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో జిల్లా స్థాయి ఆక్వా అభివృద్ధి పై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ జె.నివాస్ మాట్లాడుతూ ఆళ్వాహబ్ ద్వారా జిల్లాలో 31 విక్రయ కేంద్రాలు అనుమతినిచ్చామని చెప్పారు. రైతులు తాము సాగుచేసిన చేపలు, రొయ్యలు, పీతలు వంటి ఆక్వా ఉత్పత్తులను ఆక్వాహకు ఇస్తారన్నారు. అక్కడి నుండి విక్రయదారులు చేపల ఉత్పత్తులను తీసుకొని ప్రజలకు విక్రయిస్తారన్నారు. ఆక్వాహబ్ పద్ధతి ద్వారా జిల్లాలో మత్స్య ఉత్పత్తుల ఆహార వినియోగం కూడా పెరుగుతుందన్నారు. లైవ్ ఫిష్ కు డిమాండ్ ప్రజల నుండి ఎక్కువ వస్తుందని ఆమేరకు ఆక్వా హబ్ లో కూడా ఆ సౌకర్యాన్ని అభివృద్ధి చేశామన్నారు. ఈ ఆక్వాహబ్ ను వచ్చే నెలలో రాష్ట్ర ముఖ్యమంత్రి  వై.యస్.జగన్ మోహన్ రెడ్డి ప్రారంభించనున్నారని కలెక్టర్ చెప్పారు. జిల్లాలో నాగాయలంక, మండవల్లి, ముసునూరు, పెడన ప్రాంతాల్లో మంచినీటి రొయ్యల చెరువుల కోసం ఆటో అప్రూవల్ లైసెన్స్ కోసం దరఖాస్తులు వచ్చాయని వాటన్నింటిని తిరిగి పరిశీలించి తుది అనుమతి మంజూరు చేయాలని కలెక్టర్ ఫిషరీస్ జేడి లాల్ మహ్మద్ ను ఆదేశించారు.
జిల్లాలో మొత్తం రొయ్యలు, చేపలు మంచినీటి చెరువుల కోసం 497 దరఖాస్తులు రాగా 211 దరఖాస్తులు పరిశీలనలో ఉన్నాయన్నారు. అలాగే ఉప్పునీటి సాగు చెరువుల కోసం 135 దరఖాస్తులు వచ్చాయన్నారు. జిల్లాలో 1.60 లక్షల ఎకరాల విస్తీర్ణంలో చేపలు, రొయ్యలు ఉత్పత్తి జరుగుతుందన్నారు. అయితే కొత్త ఆక్వా జోన్లు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు. తహసీల్దార్లు, ఎంపిడిఓలు గ్రామాల్లో గ్రామ సభలు పెట్టి కొత్త ఆక్వాజోన్లు ఏర్పాటు కోసం ప్రతిపాదించాలని కలెక్టర్ ఆదేశించారు.
జిల్లాలో నాణ్యమైన దాణా ధర అమాంతంగా పెరిగిందని కలెక్టర్ ఆవేదన వ్యక్తం చేశారు. సోయా పంట జిల్లాలో కూడా సాగు చేయడానికి రైతులు ప్రయత్నించాలని కలెక్టర్ కోరారు .ప్రస్తుతం మధ్యప్రదేశ్ రాష్ట్రంలోనే సోయా సాగు విస్తృతంగా జరుగుతుందని ఆయన చెప్పారు. స్థానికంగా సోయ ఉత్పత్తి అయితే రొయ్యలకు పెట్టే దాణా ధర కూడా అదుపులో ఉంటుందని కలెక్టర్ అభిప్రాయపడ్డారు. జిల్లాలో చేపలు, రొయ్యలకు వేసే ఫీడ్ నాణ్యత పరిశీలన కోసం మచిలీపట్నం, గుడివాడ, అవనిగడ్డ, కంకిపాడుల్లో సమగ్ర ఆక్వా లాబ్ లు ఏర్పాటు చేశామన్నారు. ఒక సభ్యుడు అడిగిన ప్రశ్నకు కలెక్టర్ సమాధానమిస్తూ కైకలూరు ల్యాబ్ ను అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ ల్యాబ్ ద్వారా ప్రోటీన్, కార్బోహైడ్రేట్, ఫైబర్ శాతం కూడా ఎప్పటికప్పుడు తెలుసుకుంటామని సభ్యుడు సమాధానం చెప్పారు. అలాగే రొయ్యలకు, చేపలకు సోకే వ్యాధుల గురించి కూడా తెలుసుకోవడానికి వీలుగా ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. అనుమతి లేకుండా చెరువులను ఎవరైనా నిర్వహిస్తే వారిపై కఠినంగా వ్యవహరించాలని జేడి లాల్ మహ్మద్ ను  ఆదేశించారు. జిల్లాలో పి.ఎం.ఎం.ఎస్.వై పథకం కింద 813 దరఖాస్తులు వచ్చాయని ఇప్పటికే 396 దరఖాస్తులకు అనుమతి కూడా ఇచ్చామని జేడి లాల్ మహ్మద్ కలెక్టర్ కు నివేదించారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ (రెవెన్యూ) డా.కె.మాధవీలత, మత్స్యశాఖ జేడి లాల్ మహ్మద్, డిఆర్డిఎ పీడి శ్రీనివాసరావు, జిల్లాపరిషత్ సిఇఓ పి.ఎస్.సూర్యప్రకాష్, వ్యవసాయశాఖ జేడి టి.మోహన్ రావు, ఎల్‌డిఎం రామ్మోహనరావు, జిల్లా పరిశ్రమల కేంద్రం జీఎం సుధాకర్, గ్రౌండ్ వాటర్ డిడి డి.వందనం, జిల్లా కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Check Also

చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ కి కోటి విరాళం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ (CMRF) కోసం శశి విద్యా సంస్థల చైర్మన్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *