Breaking News

గుండేరు డ్రైన్ వలన పంట పొలాలు మునిగిపోకుండా వెంటనే తగిన చర్యలు

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఆదుకోవడమే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయమని, గుండేరు డ్రైన్ వలన పంట పొలాలు మునిగిపోకుండా వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర గనులు భూగర్భవనరులు ఎక్సైజ్ శాఖ మంత్రి వర్యులు కొల్లు రవీంద్ర ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు.

శనివారం సాయంత్రం మంత్రివర్యులు మచిలీపట్నం మండలంలోని చిన్నాపురం గ్రామంలోని గుండేరు డ్రైన్ లో జెసిబి తో గుర్రపు డెక్క తొలగించే కార్యక్రమాన్ని పరిశీలించారు.

ఈ సందర్భంగా పలువురు చిన్నాపురం గ్రామ రైతులు మంత్రి వద్దకు వచ్చి మాట్లాడుతూ గుండేరు డ్రైన్ పై ఉన్న పాత వంతెనను పూర్తిగా తొలగించ లేదని, కొత్త వంతెన కింద క్రాస్ బండలు అలాగే ఉన్నాయని, గుర్రపు డెక్క తొలగించకపోవడం వలన పై నుండి వచ్చే వరద నీరు సరిగా ప్రవహించడం లేదని, గతంలో వరదలు వచ్చి చుట్టుపక్కల గల పంట పొలాలు మునిగిపోయి నష్టపోయామని మంత్రి దృష్టికి తీసుకుని వచ్చారు.

అనంతరం మంత్రివర్యులు వెంటనే స్పందించి మాట్లాడుతూ రైతులు ఎవరూ కూడా ఆందోళన చెందవద్దని, రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఆదుకోవడమే ప్రభుత్వ ధ్యేయమని, పాత మంతెనను తొలగించేందుకు 25 లక్షల రూపాయలు ఇదివరకే మంజూరు చేశామని, ఆ నిధులతో దానిని తొలగించేందుకు వెంటనే తగిన చర్యలు తీసుకుంటున్నామని, అందులో భాగంగానే క్రేన్ వచ్చి వెళ్లిందని రైతులకు వివరించారు.
ప్రధాన వంతెన కింద ఉన్న క్రాస్ బండలు కూడా తొలగించేందుకు ఎంత ఖర్చవుతుందో అంచనాలు రూపొందించాలని మంత్రి డ్రైనేజీ ఇంజనీర్లకు సూచించారు.
ఆ క్రాస్ బండలు తొలగించేందుకు దాదాపు 10 లక్షల రూపాయలు ఖర్చు అవుతుందని ఇంజనీర్లు మంత్రికి వివరించారు. గుండు పాలెం, చిన్నాపురం, చిన్న యాదర పెద్ద యాదర గ్రామాల్లో ఉన్న డ్రైన్ లలో ఈ సంవత్సరం రెండుసార్లు పూడికలు, గుర్రపుడెక్కలు తొలగించేందుకు ప్రభుత్వం 42 లక్షల రూపాయలను మంజూరు చేసిందని, ప్రస్తుతం 9 లక్షల రూపాయల వ్యయంతో చిన్నాపురం గుండేరు డ్రైన్ లో పూడికలు, గుర్రపు డెక్కలు తొలగింపు కార్యక్రమం చేపట్టామణి డ్రైనేజీ ఇంజనీర్ మంత్రికి వివరించారు.

తదనంతరం మంత్రివర్యులు గుండేరు డ్రైన్ పై ఉన్న కొత్త వంతెన కింద ఉన్న క్రాస్ బండలు తొలగింపుకు తక్షణమే అంచనాలతో ప్రతిపాదనలు సిద్ధం చేసుకుని తన వద్దకు రావాలని ఇంజనీర్లకు సూచించారు.

ఈ పర్యటనలో మంత్రి వెంట మచిలీపట్నం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కుంచె నాని, జలవనరుల శాఖ కేసి డివిజన్ ఈఈ రవికిరణ్, డి ఈ అపర్ణ, డ్రైనేజీ డిఈ జె.బి. నాయక్, ఏఈలు నజ్మారాణి, హరీష్ మాజీ ఎంపీపీ కాగిత వెంకటేశ్వరరావు, చిన్నాపురం సర్పంచ్ కాగిత గోపాలరావు, కోన నీటి సంఘం అధ్యక్షులు కేశన రమేష్ బాబు, చిన్నాపురం ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం అధ్యక్షులు పినిశెట్టి నిరంజన్ రావు పలువురు గ్రామ రైతులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

36 ఏళ్ల స్టీల్ ప్లాంట్ చరిత్రలో ఇలాంటి ఘటన జరగలేదు

-బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం -మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల చొప్పున పరిహారం -కుటుంబంలో ఒకరికి ప్లాంట్ లో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *