Breaking News

డిఎంజి కార్యాలయంలో మైనింగ్ లీజుదారులు, గనులశాఖ అధికారుల 2 రోజుల వర్క్‌షాప్‌…


-వర్క్‌షాప్‌ను ప్రారంభించిన డైరెక్టర్‌ ఆఫ్ మైన్స్ అండ్ జియాలజీ (డిఎంజి) విజి వెంకటరెడ్డి
-గనులశాఖలో ప్రభుత్వం తీసుకున్న నిబంధనలను లీజుదారులకు వివరించిన అధికారులు…
-రాష్ట్ర వ్యాప్తంగా వర్క్‌షాప్‌నకు హాజరైన పలువురు లీజుదారులు…
-వర్క్ షాప్‌లో పాల్గొన్న గనులశాఖ అసిస్టెంట్ డైరెక్టర్లు, డిప్యూటీ డైరెక్టర్లు…

ఇబ్రహీంపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర ప్రభుత్వం గనులశాఖలో మరింత పారదర్శకతను తీసుకువచ్చేందుకు పలు సంస్కరణలకు శ్రీకారం చుట్టిందని డైరెక్టర్‌ ఆఫ్‌ మైన్స్‌ అండ్ జియాలజీ (డిఎంజి)  విజి వెంకటరెడ్డి తెలిపారు. కృష్ణాజిల్లా ఇబ్రహీంపట్నంలోని డిఎంజి కార్యాలయంలో గనుల శాఖలో ప్రభుత్వం అమలు చేస్తున్న నిబంధనలపై అవగాహన కల్పించేందుకు గనుల లీజుదారులతో ఏర్పాటు చేసిన రెండు రోజుల వర్క్‌షాప్‌ కు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్బంగా  విజి వెంకటరెడ్డి మాట్లాడుతూ గనుల శాఖలో అనేక నిబంధనలను సక్రమంగా అమలు చేయలేకపోవడం, వాటిలోని లొసుగులను ఉపయోగించుకుని కొందరు అక్రమ మైనింగ్‌కు పాల్పడుతూ ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయానికి గండి కొట్టే చర్యలకు పాల్పడుతున్నారని అన్నారు. ఈ అక్రమాలకు చెక్ పెడుతూ మైనింగ్ రంగాన్ని ప్రోత్సహించేందుకు, లీజుదారుల సమస్యలను గుర్తించేందుకు మైనింగ్ పాలసీపై సీఎం వైయస్ జగన్మోహన్‌రెడ్డి, రాష్ట్ర భూగర్భగనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆదేశాల మేరకు సమగ్ర అధ్యయనం చేసినట్లు తెలిపారు.

ఎపిలో 24శాతం మైనర్ మినరల్స్ నిల్వలు…
ప్రస్తుతం అమలులో ఉన్న పలు నిబంధనలను మరింత పటిష్టం చేయడంతో పాటు లీజుదారులకు ప్రోత్సాహకరంగా ఉండేలా మైనింగ్ పాలసీలో ప్రభుత్వ అనుమతితో సంస్కరణలను తీసుకువచ్చామని డిఎంజి విజి వెంకటరెడ్డి వెల్లడించారు. జాతీయస్థాయిలో మైనర్ మినరల్స్‌ లో ఆంధ్రప్రదేశ్ 24శాతం పొటెన్షియాలిటీని కలిగిఉందని, అపారమైన ఖనిజ వనరులను సక్రమంగా సద్వినియోగం చేసుకోవడం ద్వారా అటు ప్రభుత్వానికి ఆదాయం, ఇటు మైనింగ్ ఆధారిత పరిశ్రమలకు చేయూతను అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం పలు నిబంధనల్లో మార్పులు చేసిందని తెలిపారు. దీనిలో భాగంగా ఆక్షన్ నిర్వహించడం వల్ల లీజుదారులకు ఎదురయ్యే ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని ప్రత్యామ్నాయంగా గనుల లీజుల మంజూరీలో ప్రీమియం లేవిని పెంచడం జరిగిందని అన్నారు. ఈ పెంపుదల సందర్భంగా ఇతర రాష్ట్రాల్లో అమలులో ఉన్న విధానాలను గనులశాఖ అధికారులు శాస్త్రీయంగా పరిశీలించారని, తరువాతే ఈ నిర్ణయం జరిగిందని అన్నారు. గ్రానైట్ మైనింగ్‌లో క్యూబిక్‌ బేసెస్‌కు బదులుగా టన్నేజీ విధానంను తీసుకువచ్చామని అన్నారు. రాజస్థాన్‌లో ఈ విధానం సత్ఫలితాలను ఇస్తోందని తమ అధ్యయనంలో వెల్లడైన తరువాతే దానిని ప్రభుత్వానికి సిఫారస్‌ చేశామని, ఈ విధానాన్ని పలువురు లీజుదారులు కూడా స్వాగతించారని అన్నారు.

దరఖాస్తు చేసుకున్న నెలరోజుల్లో మైనింగ్ అనుమతులు…
అలాగే గతంలో మైనింగ్ లీజుల కోసం లీజుదారులు అటు రెవెన్యూ, ఇటు మైనింగ్ కార్యాలయాల చుట్టూ నెలల తరబడి తిరగాల్సిన పరిస్థితి ఉండేదని, దానిని సమూలంగా మారుస్తూ ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌లో భాగంగా దరఖాస్తు చేసుకున్న నెల రోజుల్లోనే లీజులు మంజూరు చేసేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. దీనివల్ల కొత్తగా మైనింగ్ రంగంలోకి వచ్చే వారికి మరింత ప్రోత్సాహాన్ని అందించినట్లు అవుతోందని అన్నారు. గనులశాఖలో పరిమితమైన మానవ వనరుల నేపథ్యంలో మైనర్ మినరల్స్‌ కు అనుమతి ఇచ్చే క్రమంలో సీనరేజీ ఫీజుల కలెక్షన్స్ ను థర్డ్ పార్టీ ద్వారా చేస్తున్నామని అన్నారు. ఇందుకు గానూ రెండుమూడు జిల్లాలను కలిపి ఆ జిల్లాల్లో గత కొన్ని సంవత్సరాలుగా మైనింగ్ వల్ల వస్తున్న ఆదాయం ఎంత, ప్రతి ఏటా ఏ మేరకు ఆదాయం పెరుగుతోంది, కొత్త మైనింగ్ లీజులు ఏ మేరకు ఇస్తున్నారు తదితర వివరాలను అధ్యయనం చేసి వచ్చిన దానిపై 25 శాతం పెంచి మైనింగ్ ఆదాయం పెంచేలా వేలం నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నామని అన్నారు.

అపోహలను తొలగించేందుకే వర్క్‌షాప్…
రాష్ట్రప్రభుత్వం మైనింగ్ రంగాన్ని పోత్సహించడంతో పాటు అవసరమైన చేయూతను అందించేందుకు సిద్దంగా ఉందని డిఎంజి విజి వెంకటరెడ్డి తెలిపారు. దీనిలో భాగంగానే ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపై లీజుదారుల్లో ఉన్న అపోహలను తొలగించేందుకు ఈ రెండు రోజుల వర్క్‌షాప్‌ను నిర్వహిస్తున్నామని తెలిపారు. లీజుదారుల అభిప్రాయాలను కూడా పరిగణలోకి తీసుకుంటామని, పారదర్శకత, జవాబుదారీతనంను పెంచేందుకే ఈ నిర్ణయాలు తీసుకున్నట్లు వెల్లడించారు. లీజుదారులు ఇప్పటి వరకు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడంతో పాటు, ఈ కొత్త నిర్ణయాల వల్ల ఎదురయ్యే పరిణామాలపై కూడా ఈ వర్క్ షాప్‌లో చర్చించి, ప్రభుత్వం దృష్టికి తీసుకువస్తామని హామీ ఇచ్చారు. చట్టబద్దంగా మైనింగ్‌ చేసే లీజుదారులకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. అలాగే గతంలో మైనింగ్ లీజులు తీసుకుని, ఏళ్ళ తరబడి సదరు లీజుల్లో ఎటువంటి మైనింగ్ కార్యకలాపాలకు పాల్పడకుండా ఉన్న వారిపై కూడా చర్యలు తీసుకుంటున్నామని స్పష్టం చేశారు. మొత్తం లీజుల్లో దాదాపు యాబైశాతం వరకు ఈ తరహా లీజుదారులు ఉంటున్నారని, వారి విషయంలో కఠిన నిర్ణయాలు తప్పవని పేర్కొన్నారు. కార్యక్రమంలో పలు జిల్లాల నుంచి మైనింగ్ లీజుదారులు హాజరయ్యారు. గనులశాఖకు చెందిన సహాయ సంచాలకులు, ఉప సంచాలకులు ఈ వర్క్‌షాప్‌లో ప్రభుత్వ నిబంధనలపై లీజుదారుల్లో ఉన్న సందేహాలకు సమాధానాలు ఇచ్చారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్లేస్ మీరు చెప్పినా… నన్ను చెప్పమన్నా.. …కూటమి అభివృద్ధిపై చర్చకు రెడీ

-వైసీపీకి మంత్రి సవిత సవాల్ -మీటరు రోడ్డు కూడా వేయలేని అసమర్థులు -వైసీపీ నేతలపై మంత్రి సవిత విసుర్లు -ఉన్న …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *