
-ఆంధ్రప్రదేశ్ విట్ యూనివర్శిటీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ ఎస్.వి.కోటారెడ్డి
-80 మంది ఉత్తమ ఉపాధ్యాయులకు సర్వేపల్లి రాధాకృష్ణ బెస్ట్ టీచర్ పేరుతో పురస్కారాలు అందజేత
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
భారతీయ పరిశోధనా రంగానికి గురువులే మార్గదర్శకులని ఆంధ్రప్రదేశ్ విట్ యూనివర్శిటీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ ఎస్.వి.కోటారెడ్డి అన్నారు. ప్రపంచాన్ని నడిపిస్తున్న శాస్త్ర సాంకేతిక రంగాలలో వస్తున్న మార్పులపై విద్యార్థులను సిద్ధం చేస్తున్న గురువుల పాత్ర సమాజంలోని ప్రతి ఒక్కరూ గుర్తించి గర్వించాల్సిన సమయం అని ఆయన పేర్కొన్నారు. ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని సొసైటీ ఫర్ లెర్నింగ్ టెక్నాలజీస్ (సొలిట్) ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం మహాత్మాగాంధీ రోడ్డులోని ఓ హోటల్‌లో 80 మంది ఉత్తమ ఉపాధ్యాయులకు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ బెస్ట్ టీచర్ పేరుతో పురస్కారాలు, ప్రశంసా పత్రాలు, జ్ఞాపికలు అందజేసి ఘనంగా సత్కరించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన డాక్టర్ ఎస్.వి.కోటారెడ్డి మాట్లాడుతూ.. భారతీయ మేథోసంపత్తి హక్కుల అంశంలో దేశం గతేడాదితో పోల్చుకుంటే ఇటీవల కాలంలో గణనీయమైన పురోగతి సాధించిందని పేర్కొన్నారు. పరిశోధనల ద్వారానే దేశం పురోగతి చెందుతున్నారు. విద్యార్థుల్లో మేథోసంపత్తిని పెంపొందించేందుకు ఉపాధ్యాయలు కీలక పాత్ర పోషించాలని పేర్కొన్నారు. గౌరవ అతిథిగా హాజరైన ఆచార్య నాగార్జున యూనివర్శిటీ అసొసియేట్ ప్రొఫెసర్ ఆడిపూడి అమృతవల్లి మాట్లాడుతూ.. సమాజం మార్పు కావాలంటే అది కేవలం ఉపాధ్యాయుల చేతుల్లోనే ఉందన్నారు. వారిని నిరంతరం గౌరవించుకున్నప్పుడే గౌరవమైన సమాజం వస్తుందన్నారు. సొసైటీ ఫర్ లెర్నింగ్ టెక్నాలజీ అధ్యక్షులు తులిశెట్టి క్రాంతికుమార్ మాట్లాడుతూ.. గత ఏడాది కాలంలో ప్రపంచంలో ఎన్నో నూతన ఆవిష్కరణలు జరిగాయని వీటిలో ఎక్కువ శాతం భారతీయుల మేథావుల ద్వారా పరిచయం కాబడ్డాయని పేర్కొన్నారు. ఉత్తమ ఉపధ్యాయులకు సత్కారం కార్యక్రమానికి సంబంధించి 380 దరఖాస్తులు రాగా అందులో 80 మందిని ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపిక చేసి పురస్కారాలు అందజేశామన్నారు. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణను తలచుకుంటూ ఇటువంటి కార్యక్రమం చేపట్టడం ఆనందంగా ఉందన్నారు. కార్యక్రమంలో కేఎల్ యూనివర్శిటీ ఆర్.ఎన్.డి. డాక్టర్ బి.జయకుమార్ సింగ్, కేఎల్ యూనిర్శిటీ ఇండస్ట్రీ కనెక్ట్ ప్రొఫెసర్ ప్రభాకర్ ఎస్.వి. విన్నకోట, ఉపాధ్యాయులు, పలువురు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News