ఎంఎస్ఎంఈ ల పై ప్రత్యేక దృష్టి… ఇంధన సామర్థ్యంతో పెద్ద ఎత్తున ఇంధన పొదుపు…

-ఆర్థికాభివృధి, పర్యావరణ పరిరక్షణ మధ్య సమతుల్యం సాధించటమే ప్రభుత్వ లక్ష్యం
-ఎంఎస్ఎంఈ సెక్టార్లో పెద్ద ఎత్తున ఇంధన సామర్ధ్య కార్యక్రమాలు .. ఆర్థిక సహకారం కోరుతూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాధ్ దాస్ కేంద్ర విద్యుత్ శాఖ కు లేఖ
-ఎనర్జీ ఎఫిసిఎన్సీ ద్వారా ఎం ఎస్ ఎం ఈ లలో తక్కువ ఇంధన వినియోగం , తక్కువ వ్యయం తో అధిక ఉత్పాదకత, కాలుష్య నియంత్రణ
-చిన్న, మధ్యతరహా పరిశ్రమల్లో నూతన ఇంధన సామర్ధ్య సాంకేతికతను ప్రవేశపెట్టేందుకు దోహదం.
-రాష్ట్రం లో అన్ని రంగాలకు 24 x 7 నాణ్యమైన విద్యుత్ సరఫరాయే సిఎం లక్ష్యం .. శ్రీకాంత్ నాగులాపల్లి , ఇంధన శాఖ కార్యదర్శి
-ఎనర్జీ ఎఫిసిఎన్సీతో విద్యుత్ రంగం బలోపేతం.. ఇంధన భద్రత, చౌక విద్యుత్తునకు దోహదం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలో చిన్న , మధ్యతరహా (ఎంఎస్ఎంఈ ) పరిశ్రమల రంగాన్నిబలోపేతం చేయటంలో ఇంధన సామర్థ్యం (ఎనర్జీ ఎఫిసిఎన్సీ )కీలక పాత్ర పోషించనుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఎంపిక చేసిన ఎంఎస్ఎంఈ క్లస్టర్లలో పెద్ద ఎత్తున తొలి సారిగా ఇంధన సామర్ధ్య సాంకేతికతను ప్రవేశపెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. ఇందుకు అవసరమైన ఆర్ధిక సహకారం అందించాల్సిందిగా కేంద్ర విద్యుత్ శాఖను కోరింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాధ్ దాస్ కేంద్ర విద్యుత్ శాఖ కు ఒక లేఖ రాసేరు.
ఆర్థిక వృద్ధి సాధించే క్రమంలో పర్యావరణం పై తక్కువ ప్రభావం ఉండాలనే జాతీయ ఐఎన్డీసి లక్ష్యాలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం పారిశ్రామిక రంగంలో పెద్ద ఎత్తున ఎనర్జీ ఎఫిసిఎన్సీని ప్రోత్సహిస్తున్నారని ఆ లేఖ లో ఆయన పేర్కొన్నారు. ఎనర్జీ ఎఫిసిఎన్సీ సాంకేతికత వినియోగించటం వల్ల పరిశ్రమల్లో ఇంధన వనరులను సమర్థవంతంగా వినియోగించుకోగలుగుతామని , పెద్ద ఎత్తున ఇంధనాన్ని పొదుపు చేయగలుతామని, కాలుష్యాన్ని నియంత్రిస్తూనే అధిక ఉత్పాదకతను సాదించగలుగుతామని పేర్కొన్నారు.
ఆర్థికాభివృద్ధి , పర్యావరణ పరిరక్షణ మధ్య సమతూకం సాధించాలని రాష్ట్ర ప్రభుత్వం కోరుకుంటున్నట్లు ఆయన పేర్కొన్నారు . ఇందుకోసం విద్యుత్ వినియోగం ఎక్కువగా ఉండే పారిశ్రామిక రంగంలో ఇంధన సాంకేతికతను పెద్ద ఎత్తున ప్రోత్సహించాలని తద్వారా పర్యావరణ లక్ష్యాలను కూడా సాదించవచ్చని తెలిపారు.
దీనిలో భాగంగా బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిసిఎన్సీ సహకారంతో రాష్ట్రంలోని కొన్ని భారీ పరిశ్రమలలో పాట్ (పెర్ఫర్మ్ , అచీవ్ అండ్ ట్రేడ్ ) ను విజయవంతంగా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తోంది. దీని ద్వారా ఇప్పటి వరకు 3430 మిలియన్ యూనిట్ల కు సమానమైన 0. 295 ఎం టీ ఓ ఈ(మిలియన్ టన్ ఆఫ్ ఆయిల్ ఈక్వివలెంట్ ) ఆదా చేయటం జరిగింది. దీని ద్వారా సుమారు రూ 2350 కోట్లు ఆదా చేయటం జరిగింది. అనంతరం ప్రభుత్వం తాజాగా ఎంఎస్ఎంఈ రంగం పై ప్రత్యేక దృష్టి పెట్టింది.ఎంఎస్ఎంఈలలో ఇంధన సాంకేతికతను ప్రవేశపెట్టడం ద్వారా ఇంధనాన్ని మరింత సమర్ధవంతంగా వినియోగించటం , ఉత్పాదక వ్యయం, నిర్వహణ పరమైన ఖర్చులు తగ్గటం,పరిశ్రమ సామర్థ్యం , ఉత్పాదకత మెరుగవటం జరుగుతుంది. అలాగే పరిశ్రమల నుంచి వెలువడే కాలుష్యాన్ని పెద్ద ఎత్తున నివారించటం తద్వారా పర్యావరణాన్ని మెరుగుపరచటానికి దోహదపడుతుంది.
ఈ లక్ష్యంలో భాగంగా రాష్ట్ర ఇంధన పరిరక్షణ మిషన్ కృష్ణ , ఉభయ గోదావరి జిల్లాల్లోని 3 ఎం ఎస్ ఎం ఈ యూనిట్లలో ( మత్స్య , ఫౌండరి ,రిఫాక్టరీ లో) ఒక అధ్యయనాన్ని నిర్వహించింది. ఎం ఎస్ ఎం ఈ సెక్టారులో ఇంధనాన్ని పొదుపు చేసేందుకు, నూతన సాంకేతికత మెరుగుదలకు పెద్ద ఎత్తున అవకాశం ఉన్నట్లు కూడా ఏపీఎస్ఈసిఎం చేసిన ఈ అధ్యయనం లో వెల్లడైంది. ఈ దృష్ట్యా తొలి దశ కింద రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మత్స్య , రిఫాక్టరీ , ఫౌండరి క్లస్టర్లలో ఇంధన సామర్ధ్య కార్యక్రమాలు పెద్ద ఎత్తున ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించినది. దీనికి అవసరమైన ఆర్థిక సహకారాన్ని బీఈఈ ద్వారా అందించాల్సిందిగా కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోరారు.
ఆంధ్ర ప్రదేశ్ లో ఏడాదికి సరాసరి 67,500 మిలియన్ యూనిట్లు విద్యుత్ డిమాండు ఉండగా, ఎనర్జీ ఎఫిసిఎన్సీ , ఇంధన పరిరక్షణ చర్యలు ద్వారా సుమారు 20 నుంచి 25 శాతం వరకు విద్యుత్ ను పొదుపు చేసే అవకాశం ఉందని ఇంధన శాఖ కార్యదర్శి శ్రీకాంత్ నాగులాపల్లి తెలిపారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో అమలు చేసిన ఎల్ఈడీ వీధి లైట్లు , వ్యవసాయ పరిశ్రమల రంగాల్లో అమలు చేసిన ఇంధన సామర్ధ్య కార్యక్రమాలు, తదితర వాటి వల్ల ప్రాథమిక అంచనా ప్రకారం 2932 మిలియన్ యూనిట్లు ఆదా చేయటం జరిగింది. దీని విలువ రూ 2014 కోట్ల వరకు ఉంటుంది.మరిన్ని ఇంధన సామర్ధ్య చర్యలు చేపట్టడం వల్ల మరో 14,000 మిలియన్ యూనిట్లను ఆదా చేసేందుకు అవకాశం ఉంది. రాష్ట్రం మొత్తం విద్యుత్ డిమాండ్ లో 35 శాతం (20,000 మిల్లియన్ యూనిట్లు) పారిశ్రామిక రంగంలోనే వినియోగం అవుతుంది. ఈ దృష్ట్యా పారిశ్రామిక రంగంలో సమర్ధ ఇంధన వినియోగం పై ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన ఆవశ్యకత ఉందని ఆయన తెలిపారు.
అంతే గాక రాష్ట్రంలో విద్యుత్ రంగాన్ని సుస్థిరం చేసి ఇంధన భద్రతను సాదించేందుకు ఎనర్జీ ఎఫిసిఎన్సీ విశేషంగా దోహదపడుతుంది . అలాగే చౌక విద్యుత్ సాధనకు తద్వారా పారిశ్రామిక ఆర్థికాభివృధి సాదించేందుకు ఎనర్జీ ఎఫిసిఎన్సీ చౌకైన తక్షణ పరిష్కారంగా భావిస్తున్నారు.
రాష్ట్రంలోని అన్ని రంగాలకు భవిష్యత్లోనూ 24 x 7 నిరంతర, నమ్మకమైన, నాణ్యమైన విద్యుత్ సరఫరా కొనసాగాలన్నదే ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి లక్ష్యమని ఇంధన శాఖ కార్యదర్శి తెలిపారు. అంతేగాక పర్యావరణ పరిరక్షణ , ఆరోగ్యకరమైన వాతావరణాన్ని సృష్టించటంలో భాగంగా పునరుత్పాదక ఇంధన వనరుల వినియోగం, ఎనర్జీ ఎఫిసిఎన్సీ , జల వనరుల సమర్ధ వినియోగం వంటి వాటి పై ప్రత్యేక దృష్టి పెట్టాలని ముఖ్యమంత్రి ఆదేశించినట్లు ఆయన తెలిపారు.
చౌక విద్యుత్ , ఇతర ఉత్తమ విధానాల ద్వారా 2342 కోట్లు ఆదా చేసిన ఏకైక రాష్ట్రం దేశంలో ఆంద్ర్హ ప్రదేశ్ మాత్రమేనని తెలిపారు. జాతీయ స్థాయిలో ఎంఎస్ఎంఈ రంగానికి రోడ్ మ్యాప్ తయారు చేయటం లో భాగంగా మన రాష్ట్రంలోని ఉభయ గోదావరి జిలాల్లో ఉన్న రిఫ్రాక్టరీ ఎంఎస్ఎంఈ యూనిట్లను బీఈఈ అధ్యయనం చేస్తోంది. గ్రామీణ తాగునీటి సరఫరా ప్రాజెక్టులలో ఇంధన సామర్ధ్య చర్యలు అమలు చేయటం ద్వారా 24 నుంచి 28 శాతం వరకు విద్యుత్ ఆదా అవుతున్నదని అయన తెలిపారు.

 

Check Also

చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ కి కోటి విరాళం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ (CMRF) కోసం శశి విద్యా సంస్థల చైర్మన్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *