-గత ఏప్రిల్ లో జాతీయ లోక్ అదాలత్ లో కేసుల పరిష్కారంలో రాష్ట్రంలో కృష్ణాజిల్లా మొదటి స్థానం.
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
ఈనెల 11వ తేదీ శనివారం జిల్లాలో కోర్టులు గల 13 ప్రదేశాల్లో జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు జిల్లా జడ్డి ఏ.నరశింహమూర్తి వెల్లడించారు. సోమవారం జిల్లా కోర్టు ఆవరణలో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో జిల్లా జడ్డి మాట్లాడుతూ సుప్రీంకోర్టు, హైకోర్టు ఆదేశాల మేరకు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ఈ నెల 11వ తేదీన జాతీయ లోక్ అదాలత్ నిర్వహణకు బీమాసంస్థలు, బ్యాంకులు, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు, సంబంధిత సంస్థల అధికారులతో 196 సమావేశాలు నిర్వహించామని, 105 ప్రీ లోక్ అదాలత్ నిర్వహించి 83 కేసులు పరిష్కరించామని జిల్లా జడ్జి తెలిపారు. మొత్తం 17,444 కేసులలో 8 వేల కేసులు పరిష్కారం కాగలవని ఆశిస్తున్నట్లు తెలిపారు. లోక్ అదాలత్ లో కేసులు పరిష్కరించుకొని కక్షిదారులు తమ విలువైన సమయాన్ని, డబ్బును ఆదా చేసుకోవచ్చని, రాజీమార్గమే రాజమార్గమని, ఇదే అంతిమ తీర్పని, అప్పీలకు అవకాశం లేదని అన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కక్షిదారులకు సూచించారు. గత ఏప్రిల్ మాసంలో నిర్వహించిన మొదటి జాతీయ లోక్ అదాలత్ లో జిల్లాలో 14,102 కేసులకు గాను ఇంతకు ముందు పనిచేసిన జిల్లా జడ్జి లక్ష్మణరావుగారి కృషి వల్ల 6004 కేసులు పరిష్కరించుకోగలిగామని తద్వారా రాష్ట్రంలోనే కృష్ణాజిల్లా మొదటి స్థానంలో నిలిచిందని అన్నారు. 9వ అదనపు జిల్లా జడ్జి కె.సీతారామకృష్ణారావు, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి పి.రాజారాం పాత్రికేయుల సమావేశంలో పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News