విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
పర్యావరణ హితం కోరుతూ ప్రతిఒక్కరూ మట్టి వినాయక ప్రతిమలను పూజించాలని సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు మల్లాది విష్ణు సూచించారు. సత్యనారాయణపురంలోని శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి దేవస్థానంలో ఆలయ ఛైర్మన్ కొల్లూరు రామకృష్ణ ఆధ్వర్యంలో వినాయక మట్టి ప్రతిమలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ శర్వాణీ మూర్తితో కలిసి గౌరవ శాసనసభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మట్టి వినాయక ప్రతిమల వల్ల కలిగే ప్రయోజనాలను ప్రజలకు వివరించారు. అనంతరం ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడారు. ప్రతి ఒక్కరూ పండుగ జరుపుకోవాలనే సదుద్దేశంతో రెండు రోజుల పాటు మట్టి వినాయక ప్రతిమలను, వ్రతకల్ప పుస్తకాలను దేవస్థాన కమిటీ సభ్యులు పంపిణీ చేయడం అభినందనీయమన్నారు. మరోవైపు వినాయక ఉత్సవాలపై కొందరు బీజేపీ, జనసేన నాయకులు చేస్తున్న దుష్ప్రచారాలను ఆయన ఖండించారు. కరోనా థర్డ్ వేవ్ పొంచి ఉన్న నేపథ్యంలో ఢిల్లీ, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర సహా పలు రాష్ట్ర ప్రభుత్వాలు ఉత్సవాలపై ఆంక్షలు విధించడం జరిగిందన్నారు. బహిరంగంగా పండుగ జరపుకోవడాన్ని బ్యాన్ చేశాయని వెల్లడించారు. కానీ దేశంలో ఒక్క మన రాష్ట్రంలోనే ఆంక్షలు విధించినట్లు బీజేపీ, పవన్ కళ్యాణ్ పనిగట్టుకుని దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఎవరెన్ని విష ప్రచారాలు చేసినా.. రాష్ట్ర ప్రభుత్వానికి ప్రజారోగ్యమే ముఖ్యమని స్పష్టం చేశారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ నాయకులు ఆత్మకూరు సురేష్, శిష్ట్లా రామలింగమూర్తి, ఆలయ కమిటీ సభ్యులు కె.కొండ, బి.రాధిక, వెంకటేశ్వరమ్మ, వైఎస్సార్ సీపీ శ్రేణులు పాల్గొన్నారు.
