ప్రముఖ ఆదాయ వనరుగా పర్యాటక రంగం అభివృద్ది…

-రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక,యువజన శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రముఖ ఆదాయ వనరుగా రాష్ట్ర పర్యాటక రంగాన్ని అభివృద్ది పర్చేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక,యువజన శాఖ మంత్రి ముత్తం శెట్జి శ్రీనివాసరావు తెలిపారు. పర్యాటక ప్రాంతాలలో మౌలిక వసతులు, రవాణా, బోటింగ్ సౌకర్యాల మెరుగుతోపాటు పర్యాటక హోటళ్ల నిర్వహణను మెరుగుపర్చి ఆన్లైన్, సోషల్ మీడియా వేదికగా వాటికి మంచి ప్రాచుర్యాన్ని కల్పించేందుకు ప్రణాళికా బద్దంగా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి తెలిపారు. బుధవారం అమరావతి సచివాలయం ఐదో బ్లాక్ లో 13 జిల్లాలకు చెందిన పర్యాటక, క్రీడా శాఖలు, పర్యాటక సంస్థ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించిన అనంతరం పబ్లిసిటీ సెల్ లో పాత్రికేయులతో మంత్రి మాట్లాడారు.
ప్రపంచంలో థాయిల్యాండ్, మలేషియా, స్విట్జర్లాడ్ వంటి 40 శాతం దేశాలు కేవలం పర్యాటక రంగం ద్వారా వచ్చే ఆదాయం ద్వారానే అభివృద్ది పథంలో పయనిస్తున్నాయని, అదే తరహాలో రాష్ట్రంలోని పర్యాటక రంగాన్ని కూడా అభివృద్ది పర్చేందుకు వ్యూహాత్మక చర్యలు తీసుకుంటున్నామన్నారు. కోవిడ్ కు ముందు సాలీనా రూ.120 కోట్ల మేర ఆదాయం పర్యాటక శాఖ ద్వారా వచ్చేదని, ప్రస్తుతం కోవిడ్ పరిస్థితుల్లో అది రూ.60 కోట్లకు పడిపోయిందన్నారు. కోవిడ్ ఆసుపత్రులు, కోవిడ్ సెంటర్లలో భోజన సదుపాయం కల్పించే బాధ్యతను పర్యాటక సంస్థ చేపట్టడం వల్ల అంతమాత్రం ఆదాయానన్నా సమకూర్చుకోవడం జరిగిందన్నారు. ఇటు వంటి గడ్డు పరిస్థితుల నుండి పర్యాటక శాఖను కాపాడి, స్థిరమైన ఆదాయాన్ని సమకూర్చుకొనేలా పర్యాటక రంగాన్ని అభివృద్ది పరుస్తున్నామన్నారు.
రాష్ట్రంలోని ప్రముఖ పర్యాటక కేంద్రాలు, పర్యాటక హోటళ్ల వివరాలు ప్రపంచ వ్యాప్తంగా ప్రతి ఒక్క పర్యాటకునికి తెలిసే విధంగా ఆన్లైన్, సోషల్ మీడియా వేదికగా వాటికి మంచి ప్రాచుర్యాన్ని కల్పించేందుకు ఒక ప్రత్యేక యాప్ ను రూపొందించి దసరా పండుగలోపు రాష్ట్ర ముఖ్యమంత్రి చేతుల మీదుగా ఆ యాప్ ను ప్రారంభిస్తామని మంత్రి తెలిపారు. పర్యాటక ప్రాంతాల ప్రాచుర్యం అందరికీ తెలిసే విధంగా ప్రతి జిల్లాలోనూ ప్రతి మాసం ఒక ఈవెంట్ను నిర్వహిస్తామన్నారు. రాష్ట్రంలోని ఉత్తరాంధ్ర, గోదావరి జిల్లాలు, కోస్తా మరియు రాయలసీమ పర్యాటక సర్క్యూట్లకు ఒక్కొక్క మేనేజరు చొప్పున మొత్తం నలుగురు మేనేజర్లను నియమించి ప్రత్యేక వోల్వో బస్సుల ద్వారా రెండు లేక మూడు రోజులపాటు పర్యాటక ప్యాకేజిలను నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఆయా సర్క్యూట్లలో గల పర్యాటక ప్రాంతాలకు చుట్టుప్రక్కల నున్న రాష్ట్రాల నుండి కూడా ప్రత్యేక బస్సులను నడిపేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. పర్యాటక ప్రాంతాల్లో ప్రభుత్వ, ప్రైవేటు బోట్ల నిర్వహణ సజావుగా సాగేందుకు రాష్ట్ర వ్యాప్తంగా తొమ్మిది కమాండ్ కంట్రోల్ సెంటర్లను ఏర్పాటు చేయడం జరిగిందని, వాటి మార్గదర్శకాలకు అనుగుణంగా ప్రస్తుతం ఉన్న 24 ప్రభుత్వ, 164 ప్రైవేటు బోట్లు అన్నింటినీ ఆపరేషన్లోకి తెచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. విశాఖపట్నం, విజయవాడ, నాగార్జునసాగర్, సూర్యలంక తదితర ప్రాంతాల్లో సీ ప్లైన్ లను నడిపేందుకు సంబందిత సంస్థలతో చర్చిస్తున్నట్లు మంత్రి తెలిపారు. ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో రాష్ట్రంలోని విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి, బాపట్ల, సూర్యలంక తదితర 13 ప్రాంతాల్లో ఐదు నక్షత్ర హోటళ్లను ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టామని, ఇందులో 50 శాతం హోటళ్లను ఈ ఆర్థిక సంవత్సరంలో ఏర్పాటు చేసే లక్ష్యంతో ఉన్నామన్నారు. అదే విధంగా రాష్ట్రంలో ఉన్న 37 పర్యాటక హోటళ్ల నిర్వహణను మెరుగుపర్చి గూగుల్ సెర్చి టాప్ టెన్ బెస్టు హోటళ్లలో అవి కనిపించే విధంగా తీర్చిదిద్దుతామన్నారు.
కేంద్ర ప్రభుత్వ సహకారంతో “ ప్రసాదం” పథకం అమల్లో బాగంగా టెంపుల్ టూరిజం అభివృద్దికి చర్యలు చేపట్టామని, రూ.50 కోట్లతో శ్రీశైల దేవాలయం అభివృద్ది పనులు ఇప్పటికే చేపట్టామని, మరో రూ.50 కోట్లతో సింహాచల దేవస్థానం అభివృద్ది పనులకు త్వరలో శంకుస్థాపన చేయనున్నట్లు మంత్రి తెలిపారు.
త్వరలో నూతన క్రీడా పాలసీ….
రాష్ట్రంలో క్రీడలను పెద్ద ఎత్తున ప్రోత్సహించేందుకు నూతన క్రీడా పాలసీని త్వరలో ప్రభుత్వం అమల్లోకి తీసుకురానున్నట్లు మంత్రి ముత్తం శెట్జి శ్రీనివాసరావు తెలిపారు. ముసాయిదా క్రీడా పాలసీ సిద్దమైందని, ముఖ్యమంత్రి ఆమోదంతో త్వరలో అది చట్టరూపం దాల్చనుందన్నారు. గ్రామీణా ప్రాంతాల్లో ఎంతో మంది ప్రతిభగల క్రీడాకారులు మట్టిలో మాణిక్యాలుగా దాగిఉన్నారని, వారందరినీ ప్రోత్సహించడంతో పాటు పెద్ద ఎత్తున మౌలిక వసతుల కల్పనకు ఈ పాలసీ ఎంతగానో దోహదపడుతుందన్నారు. సి.ఎస్.ఆర్. క్రింద క్రీడా ప్రాంగణాల అభివృద్ది, క్రీడాకారుల దత్తత కార్యక్రమాన్ని కూడా ఈ పాలసీలో ప్రతిపాదించడం జరిగిందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా మూడు ప్రాంతాల్లో మూడు అంతర్జాతీయ స్థాయి స్టేడియంలను అభివృద్ది పర్చేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో 13 జిల్లాల్లో 15 క్రీడా ప్రాంగణాలను అభివృద్ది పరుస్తున్నట్లు మంత్రి తెలిపారు. ఖేల్ ఇండియా పథకంలో భాగంగా నాగార్జున యూనివర్సిటీ గ్రౌండును అభివృద్ది పర్చామని, విశాఖ జిల్లా కొమ్మాదిలో కూడా క్రీడా ప్రాంగణాన్ని అభివృద్ది పర్చనున్నట్లు ఆయన తెలిపారు. క్రీడా కారులను ప్రోత్సహించేందుకు వైఎస్ఆర్ క్రీడా పురస్కారాలను అందజేయడం జరుగుచున్నదని, గత రెండున్నర్ర ఏళ్లలో సుమారు రూ.6 కోట్ల మేర నిధులను వెచ్చించడం జరిగిందన్నారు. బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పి.వి.సిందుకు విశాఖ నడిబొడ్డున రెండు ఎకరాల భూమిని ఇవ్వడం జరిగిందని, త్వరలో బ్యాడ్మింటన్ అకాడమీని ఆమె ప్రారంభించనున్నట్లు తెలిపారు. అదే విధంగా ఒలింపిక్స్ లో పురస్కారాన్ని సాదించిన హాకీ క్రీడాకారిణి రజనీకి సుమారు రూ.85 లక్షల నగదును ప్రభుత్వం అందజేసిందని, ఆమె తమ్మునికి జాబ్ ను కూడా ఇవ్వడం జరిగిందని ఆయన తెలిపారు.
ఏ.పి.టి.డి.సి. చైర్మన్ వరప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ పరిశుభ్రతకు, భద్రతకు, ఆనందానికి, ఆహ్లదానికి కేంద్రాలుగా పర్యాటక హాటళ్లను తీర్చిదిద్దుతామని, అవకాశం ఉన్నచోట్ల ఫ్లోటింగ్ రెస్టారెంట్లను, రోప్ వేలను ఏర్పాటు చేస్తామని, ట్రైక్కింగ్ సౌకర్యాన్ని కల్పిస్తామని, ఉభయ గోదారి జిల్లాల్లో దీవులను ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో అభివృద్ది పరుస్తామని, ప్రస్తుతం ఉన్న పర్యాటక ప్రాంతాలకు అదనంగా మరి కొన్ని కొత్త ప్రాంతాలను గుర్తిస్తామని అన్నారు.
రాష్ట్ర క్రీడా ప్రాధికారిక సంస్థ చైర్మన్ బైరెడ్డి సిద్దార్థరెడ్డి మాట్లాడుతూ అందరి సహకారంతో నూతన క్రీడా పాలసీని త్వరలో అమల్లోకి తెస్తామని, క్రీడాకారులను ప్రోత్సహిస్తూ క్రీడా ప్రాంగణాలను, మౌలిక వసతునలు పెద్ద ఎత్తున కల్పిస్తామని అన్నారు. సి.ఎస్.ఆర్. క్రింద క్రీడల అభివృద్దికి కృషిచేస్తామని, ఒడిస్సా, తమిళనాడు రాష్ట్రాల తరహాలో ఆంద్రప్రదేశ్ లో కూడా ఒక ప్రత్యేక క్రీడను ప్రోత్సహించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు.
రాష్ట్ర పర్యాటక, సాంస్కృతి, యువజన శాఖ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ డా.రజత్ భార్గవ్ , ఆంధ్రప్రదేశ్ పర్యాటక సంస్థ సి.ఇ.ఓ. ఎస్.సత్యనారాయణ తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
(ప్రచార విభాగం సమాచార, పౌర సంబంధాల శాఖ అమరావతి సచివాలయం వారిచే జారీ చేయడమైనది)
అదనపు సమాచారం: పర్యాటక శాఖ మంత్రి ముత్తంసెట్టి శ్రీనివాసరావు పాత్రికేయులతో మాట్లాడుతూ పర్యాటక శాఖలో 8 మంది ఉద్యోగులు కోవిడ్ తో చనిపోయారని, ఒక్కొక్క కుటుంబానికి రూ. 2 లక్షల సాయం అందించడంతో పాటు అర్హతనుబట్టి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వడం జరుగుతున్నదని తెలిపారు. ఒకే చోట 5 ఏళ్లు సర్వీసు దాటిన వారిని మరోచోటికి బదిలీ చేయడం జరుగుతుందని, ఖాళీలను భర్తీ చేస్తామని తెలిపారు జిల్లా కలెక్టర్లు పర్యాటక శాఖ అధికారులను ఇతర పనులకు ఎక్కువుగా ఉపయోగించు కోవడం వల్ల శాఖ పనులు కుంటు పడుతున్నాయని, ఈ సమస్యను కలెక్టర్ల దృష్టికి తీసుకు వెళ్లాలని పర్యాటక శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ను ఆయన కోరారు.

Check Also

చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ కి కోటి విరాళం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ (CMRF) కోసం శశి విద్యా సంస్థల చైర్మన్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *