Breaking News

స్కిల్‌ డెవలప్‌మెంట్‌ అండ్‌ ట్రైనింగ్‌ పై సమీక్ష…

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కాలేజీలు, పాలిటెక్నిక్‌లు, ఐటీఐలపై రాష్ట్ర ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి క్యాంప్‌ కార్యాలయంలో  సోమవారం సమీక్షించారు. ఈ సమీక్షా సమావేశంలో సీఎం వైయస్‌ జగన్‌ మాట్లాడుతూ ప్రతి పార్లమెంటు నియోజకవర్గంలో నైపుణ్యాభివృద్ధికోసం ఒక కాలేజీని పెట్టబోతున్నామన్నారు. విశాఖపట్నంలో హై ఎండ్‌ స్కిల్‌యూనివర్శిటీని, తిరుపతిలో స్కిల్‌యూనివర్శిటీని పెట్టబోతున్నామన్నారు. నైపుణ్యాభివృద్ధి కాలేజీల్లో పాఠ్యాంశాల రూపకల్పన, పాఠ్యప్రణాళిక అనేది హై ఎండ్‌ స్కిల్స్‌ యూనివర్శిటీ, స్కిల్‌యూనివర్శిటీలు రూపొందిస్తాయమన్నారు.  కోడింగ్, లాంగ్వేజెస్, రోబోటిక్స్, ఐఓటీ లాంటి అంశాల్లో పరిజ్ఞానాన్ని పెంచేలా నైపుణ్యాభివృద్ధి కాలేజీల్లో బోధన, శిక్షణ ఉంటుందన్నారు.గ్రామాల్లో ఇంటర్నెట్‌సదుపాయం కల్పించడంద్వారా వర్క్‌ఫ్రం హోం కాన్సెప్ట్‌ను బలోపేతం చేస్తున్నామన్నారు. పార్లమెంటు నియోజకవర్గాల్లో ఏర్పాటు చేస్తున్న స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కాలేజీలకు, వర్క్‌ఫ్రం హోంకు మధ్య సినర్జీ ఏర్పడుతుందన్నారు. దీనివల్ల మెరుగైన ఉపాధి అవకాశాలు, మంచి జీతాలు లభిస్తాయన్నారు.

విశాఖపట్నంలో హై ఎండ్‌స్కిల్స్‌ యూనివర్శిటీ పనులను వెంటనే మొదలుపెట్టండని అధికారులకు సీఎం ఆదేశించారు. నైపుణ్యాలను మెరుగుపరిచేందుకు ఉద్దేశించిన కోర్సుల రూపకల్పన విప్లవాత్మకంగా ఉండాలన్నారు. తరగతి గదుల నిర్మాణం వినూత్నంగా ఉండాలన్నారు. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కాలే జీలతో పాటు కొత్తగా నిర్మించనున్న మెడికల్‌కాలేజీల తరగతిగదుల నిర్మాణంలో వినూత్న పద్ధతులు పాటించాలన్నారు. ఐటీఐలను ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా తీర్చిదిద్దాలన్నారు. పాఠ్యాంశాలను అప్‌గ్రేడ్‌ చేయాలన్నారు. ప్రతి ఐటీ ఐలోనూ నేషనల్‌ అకాడమీ ఆఫ్‌ కనస్ట్రక్షన్‌ లాంటి సంస్థలను భాగస్వాములుగా చేసే ఆలోచన చేయాలన్నారు. దీనివల్ల నైపుణ్యాలు మెరుగుపడతాయన్నారు. టెన్త్‌లోపు డ్రాప్‌ అవుట్‌ అయిన యువకులకు నైపుణ్యాలను పెంపొందించడం, అభివృద్ధి చేయడంపై దృష్టిపెట్టాలన్నారు. కొత్తగా వచ్చే పరిశ్రమలకు మన వద్ద స్కిల్‌ డెవలప్‌మెంట్‌ ట్రైనింగ్‌ పొందిన వారి డేటాను పంపించాలన్నారు. 75శాతం ఉద్యోగాలు స్థానికులకు వచ్చేలా చర్యలు తీసుకోవాలి అధికారులకు సీఎం ఆదేశించారు. డ్రింకింగ్‌వాటర్‌ ప్లాంట్లు, మోటార్లు, సోలార్‌ యూనిట్లు.. ఇలా రోజువారీగా మనం చూస్తున్న చాలా వరకు అంశాల్లో నిర్వహణ, మరమ్మతుల్లో వారికి నైపుణ్యాలను మెరుగు పరచాల్సిన అవసరం ఉందన్నారు. పారిశుద్ధ్యంకోసం వినియోగిస్తున్న పరికరాలను నిర్వహణ, మరమ్మతుల్లో నైపుణ్యాలను మెరుగుపరచాల్సి ఉందన్నారు. నైపుణ్యంలేని మానవవనరుల కారణంగా కొన్నిచోట్ల మురుగు నీటిని శుద్ధిచేసే ప్లాంట్లు సరిగ్గా నడవడంలేదన్నారు. నిర్వహణ కూడా సరిగా ఉండడం లేదన్నారు. ఇలా నిత్యజీవితంతో సంబంధం ఉన్న అంశాల్లో నైపుణ్యం ఉన్న మానవనరులను అభివృద్ధి చేయాల్సి ఉందని అధికారులకు సీఎం నిర్దేశించారు. ఇంగ్లిషు భాషలో కూడా పరిజ్ఞానాన్ని పెంచేలా చర్యలు తీసుకోవాలన్నారు. కొత్తగా నిర్మిస్తున్న మెడికల్‌ కాలేజీలు, ఆస్పత్రులను నిర్వహణకోసం నైపుణ్యం ఉన్న మానవవనరులను అందించేలా ప్రణాళిక సిద్ధంచేసుకోవాలన్నారు.

నియోజకవర్గానికి ఒక ఐటీఐ… 
నియోజకవర్గానికి ఒక ఐటీఐ ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. దీంతో నియోజకవర్గ స్థాయిలో తప్పనిసరిగా నైపుణ్యాలను అభివృద్ధిచేయడానికి ఒక పారిశ్రామిక శిక్షణా సంస్ధ ఏర్పాటవుతుందన్నారు. ప్రైవేటు ఐటీఐల్లో కనీస సదుపాయాలపైనకూడా దృష్టిపెట్టాలన్నారు. ప్రభుత్వ, ప్రైవేటు ఐటీఐల ప్రమాణాలపై సర్టిఫికెషన్‌ చేయించాలన్నారు.
ప్రతికాలేజీ, ఐటీఐ కూడా నిర్దేశిత ప్రమాణాలను సాధించే దిశగా అడుగు ముందుకేయాలన్నారు. ప్రభుత్వ ఐటీఐల్లో అవసరమైన టీచింగ్‌ స్టాఫ్‌ను పెట్టాలి : సీఎం ఆదేశించారు.  ప్రభుత్వ ఇంజినీరింగ్‌కళాశాలలు, పాలిటెక్నిక్‌ కాలేజీల్లో టీచింగ్‌ సిబ్బందిపై పరిశీలన చేయాలన్నారు.

ప్రతినెలా మూడురోజులపాటు పరిశ్రమల ప్రతినిధులతో సమావేశమయ్యేలా వారికి కేటాయించాలని ఇది వరకే ఆదేశాలు జారీచేశామని, ఐటీఐలు, నైపుణ్యాభివృద్ధి కాలేజీల్లో అవసరాలకు అనుగుణంగా శిక్షణ, శిక్షణ పొందిన వారికి అప్రంటిషిప్‌ వచ్చేలా కలెక్టర్లు తగిన చర్యలు తీసుకోవాలన్నారు. నిపుణుల చేత బోధన ఇప్పించేటప్పుడు దాన్ని డిజిటల్‌ పద్ధతిలో పొందుపర్చాలన్నారు. మరింత మందికి శిక్షణ ఇచ్చేందుకు ఆ వీడియోలను వినియోగించుకోవచ్చని అధికారులకు సీఎం ఆదేశించారు.

ఈ సమీక్షా సమావేశానికి ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ, స్కిల్‌ డెవలప్‌మెంట్‌ అండ్‌ ట్రైనింగ్‌ మరియు పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతం రెడ్డి, ఐటీ, ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్స్‌ ముఖ్య కార్యదర్శి జి జయలక్ష్మి, రవాణాశాఖ ముఖ్యకార్యదర్శి ఎం టీ కృష్ణబాబు, ఆర్ధికశాఖ కార్యదర్శి ఎన్‌ గుల్జార్, టెక్నికల్‌ ఎడ్యుకేషన్‌ కమిషనర్‌ పోలా భాస్కర్, ఎంప్లాయిమెంట్‌ అండ్‌ ట్రైనింగ్‌ డైరెక్టర్‌ లావణ్య, స్కిల్‌ డెవలప్‌మెంట్‌ అండ్‌ ట్రైనింగ్‌ ప్రభుత్వ సలహాదారు చల్లా మధుసూధన్‌రెడ్డి, ఏపీ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ ఛైర్మన్‌ కె అజయ్‌ రెడ్డి, ఏపీ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ ఎండీ ఎన్‌ బంగార్రాజు ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.

Check Also

ఎన్పీసిఐ అప్ లోడ్ శుక్రవారానికి పూర్తి చేయాలి…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరంలో హౌస్ హోల్డ్ జియో ట్యాగ్ గురువారానికి, ఎన్పీసిఐ అప్ లోడ్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *