Breaking News

మార్చి 31 నాటికి జగనన్న ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేస్తాం…

-ఇళ్ల నిర్మాణానికి నీరు అత్యవసరం. దానికోసం నీటి కుంటలు నిర్మించండి.
-పట్టణ గృహా లబ్దిదారులంతా గ్రూపులు కావాలి.
-గృహనిర్మాణ శాఖా మంత్రి శ్రీ రంగనాథరాజు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ నగరానికి నున్నలో కడుతున్న జగనన్న ఇళ్ల నిర్మాణాలు అన్నీ వచ్చే మార్చి 31 నాటికి పూర్తి చేస్తామని రాష్ట్ర గృహనిర్మాణ శాఖా మంత్రి చెరుకువాడ శ్రీ రంగనాథరాజు చెప్పారు. –
మంగళవారం ఆయన నున్నలో కడుతున్న లేఅవుట్లను, గృహానిర్మాణాల ప్రగతిని పరిశీలించారు. ఆయనతో పాటు అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ రెడ్డి, విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, విజయవాడ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ శైలజారెడ్డి పాల్గొన్నారు. నున్న లేఅవుట్లో 5 బ్లాలు ఉన్నాయి. 4,149 ప్లాట్లకు హద్దులు పాతారు. అందులో 4,058 గృహాలు మంజూరు అయ్యాయి. 3,116 గృహాలు ప్రభుత్వమే నిర్మించి ఇవ్వాలని ఆప్షన్-3 కింద లబ్దిదారులు కోరారు. అందులో దాదాపు 150 గృహాల బేస్మెంట్ లెవెల్ పూర్తయ్యింది. అందులో విద్యుత్ లైన్ల నిర్మాణం కూడా పూర్తి చేశారు. అలాగే 40 బోర్లు వేసి ట్యాంకులను ఏర్పాటు చేశారు. తొలుత గృహనిర్మాణ శాఖా మంత్రి రంగనాథరాజు లబ్దిదారుల గృహలను పరిశీలించారు. గృహనిర్మాణం చేస్తున్న ప్రాంతంలో వాటరింగ్ (నీటిని చల్లుతూ) చేస్తున్న లబ్దిదారురాలు జి.విజయతో మాట్లాడారు. నీటి సౌకర్యం కల్పించారని కాకపోతే ప్రభుత్వం ఏర్పాటు చేసిన ట్యాంకు తమ ఇంటి వద్దకు రావడం లేదని, ఇబ్బందులు పడుతున్నామని ఆమె మంత్రి దృష్టికి తెచ్చారు. దీనిపై మంత్రి మాట్లాడుతూ ట్యాంకుల్లో నీరు నింపవద్దని కాని అదే స్థలంలో పాతికవేల లీటర్ల కుంటలు త్రవ్వించమని ఆయన ఆదేశించారు. నీటిని రాత్రి పంపింగ్ చేసి పెడితే ఉదయం పైపుల ద్వారా లబ్దిదారుల ఇళ్ల వరకు నీటిని తొట్టిలో నింపుకోవడం లేదా నేరుగా స్ప్లే చేసుకుంటారని మంత్రి చెప్పారు. నీరు లేకపోతే అసలు గృహనిర్మాణమే సాధ్యం కాదని ఆయన చెప్పారు. అందువల్ల నీటికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాల్సిందేనని ఆయన అధికారులను ఆదేశించారు. గృహాలకు వాడుతున్న ఇనుప ఊచలను మంత్రి పరిశీలించారు. ఆ కడ్డీలు 12 ఎంఎం సామర్థ్యం కలిగివుండటం గమనించి దీనితో ఇంటి నిర్మాణం ఖర్చు పెరుగుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. అందువల్ల 6 ఎంఎం వాడితే సరిపోతుందని ఆయన చెప్పారు. అలాగే పైకప్పు నిర్మాణానికి 12 ఎంఎం ఇనుప ఊచలు వాడమని ఆయన అధికారులను ఆదేశించారు. బాత్ రూమ్ నిర్మాణం 6X5 అడుగుల విస్తీర్ణంలో చేపట్టమని ఆయన అధికారులను ఆదేశించారు. ఏ ఇళ్ల కాలనీ అయినా అభివృద్ధి చెందాలంటే నీరు, విద్యుత్, అంతర్గత రోడ్లు, అప్రోచ్ రోడ్లు ఎంతో ముఖ్యమన్నారు. అందుకే రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి కాలనీలలో త్రాగునీరు, రోడ్లు, విద్యుత్ అవసరాలను కల్పిస్తున్నారన్నారు.
విజయవాడ ఎమ్మెల్యే మల్లాది విష్ణు మాట్లాడుతూ ప్రభుత్వం ఇస్తున్న 1,80,000 రూపాయల ఆర్థిక సహాయంతో ఇళ్లు నిర్మించుకోవచ్చన్నారు. బేస్మెంట్ లెవెల్ పూర్తి చేస్తే 60 వేల రూపాయలు, రూఫ్ లెవెల్ పూర్తి చేస్తే మరో 60 వేలు, స్లాబ్ పూర్తి చేస్తే మరో 60 వేల రూపాయలు ఇళ్ల నిర్మాణం చేస్తున్న కాంట్రాక్టర్ కు నేరుగా ప్రభుత్వం ఇస్తుందన్నారు. మంత్రి రంగనాథరాజు ఈ సందర్భంగా జోక్యం చేసుకుంటూ లబ్దిదారులు ఒక్కొక్కరుగా కట్టుకోవడం కంటే గ్రూపుల వారీగా గృహ నిర్మాణాలు చేపట్టాలని ఆదేశించారు. ఇబ్రహీంపట్నంను సందర్శించిన గృహనిర్మాణ శాఖా మంత్రి:ఇబ్రహీంపట్నంలో 33 ఎకరాల విస్తీర్ణంలో మంజూరు చేసిన 1602 ప్లాట్లను కూడా పరిశీలించారు. ఇబ్రహీంపట్నంలో సుమారు 823 గృహాలు నిర్మాణం ప్రారంభ మైనది. అందులో పునాదులు త్రవ్వుతున్నది. 131 కాగా, బిలో బేస్మెంట్ లెవెల్ లో 650 గృహాలు, బేస్మెంట్ లెవెల్ పూర్తి చేసుకున్నవి 35 గృహాలు, రూఫ్ లెవెల్ పూర్తి చేసుకొన్నవి 5, స్లాబ్ వేసినవి 2 గృహాలు ఉన్నాయి. ఇందులో సుమారు 150 మంది ఆప్షన్-2 ను కోరుకున్నారు. అలాగే 147 మంది ఆప్షన్-1 ని కోరుకున్నారు. ఈ గృహనిర్మాణాల కోసం 3 బోర్లు త్రవ్వి 20 సింటెక్స్ ట్యాంకులను ఏర్పాటు చేశారు. విద్యుత్ లైన్లను, కనెక్షన్లు కూడా ఏర్పాటు చేశారు. ఇందులో 83 మంది గ్రూపు సభ్యులకు 41.50 లక్షల రూపాయలు రుణం అందింది. ఇసుక కూడా దగ్గరగా ఉండటంతో లబ్దిదారులు గృహాలు నిర్మించేందుకు ఉత్సాహం చూపుతున్నారు. ఇబ్రహీంపట్నంలో మంత్రి వెంట మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో జేసి హౌసింగ్ నూపుర్ శ్రీనివాస్ అజయ్ కుమార్ ,హౌ సింగ్ సిఐ శ్రీరాములు, హౌసింగ్ పీడి రామచంద్రన్, ఇఇ శ్రీదేవి, విజయవాడ రూరల్ తహసీల్దార్ శ్రీనివాస్ నాయక్ మరియు ఇబ్రహీంపట్నం తహసీల్దారు సూర్యారావు, మండల పరిషత్ అభివృద్ధి అధికారులు పాల్గొన్నారు.

Check Also

మాకు న్యాయం చేయండి…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఉద్యోగుల గృహ నిర్మాణ సంఘం పేరుతో ఏపీ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ మ్యూచువల్లీ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *