Breaking News

సభ్య సమాజం సిగ్గుతో తలదించుకోవాల్సిన ఘటన ఇది… : పవన్ కళ్యాణ్

-ఇలాంటి సంఘటనలు పునరావృతం కావడం సమాజానికి చేటు
-ఈ దారుణం కలచివేసింది
-పోలీసులు సకాలంలో స్పందించి ఉండాల్సింది
-పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరూ స్పందించాలి
-మంత్రివర్గంలోని పెద్దలు బిడ్డ తలిదండ్రులకు భరోసా కల్పించాలి
-దోషికి సరైన శిక్ష పడే వరకు జనసేన అండగా ఉంటుంది
-సైదాబాద్ లో హత్యాచారానికి గురైన చిన్నారి కుటుంబ సభ్యుల్ని పరామర్శించిన జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ 

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
హత్యాచారానికి గురైన చిన్నారి కుటుంబానికి న్యాయం జరిగే వరకు, దోషికి సరైన శిక్ష పడే వరకు జనసేన పార్టీ అండగా ఉంటుందని పార్టీ అధ్యక్షులు  పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. చిన్నారికి జరిగిన దారుణం తనను ఎంతగానో కలచివేసిందని తెలిపారు. అంతా సిగ్గుతో తలదించుకోవాల్సిన ఘటన ఇది అన్నారు. హైదరాబాద్ లోని సైదాబాద్ సింగరేణి కాలనీలో హత్యాచారానికి గురైన ఆరేళ్ల చిన్నారి కుటుంబాన్ని బుధవారం సాయంత్రం పరామర్శించారు. ఆ బిడ్డ తల్లిదండ్రులను ఓదార్చి వారికి ధైర్యం చెప్పారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ “చిన్నారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నాను. సభ్య సమాజం మాట్లాడుకోలేని ఘోరమైన సంఘటన ఇది. ఆడుకోవడానికి ఇంటి నుంచి బయటకు వెళ్లిన బిడ్డ కనబడకుండా పోతే ఆ తల్లిదండ్రులకు ఏమయ్యిందో అర్థం కాని పరిస్థితి. వినాయక చవితి కావడంతో విగ్రహాల వెంట వెళ్లిందేమోనన్న అనుమానంతో సరూర్ నగర్ ట్యాంక్ బండ్ నుంచి అన్ని ప్రాంతాల్లో వెతికారు. ఒక ఇంటి మీద అనుమానం ఉంది చూడమంటే పోలీసులు సకాలంలో చర్యలు తీసుకోలేకపోయారు. పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరు చనిపోయిన బిడ్డకు న్యాయం జరగాలని కోరుకోవాలి. ప్రభుత్వాన్ని నడిపిస్తున్న పెద్దలకు నా విన్నపం.. మంత్రి వర్గంలోని పెద్దలను పంపి బిడ్డను కోల్పోయిన తల్లిదండ్రులకు భరోసా కల్పించండి. ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు బాధితులకు ఓదార్పు అవసరం. ఆ కుటుంబానికి ఏ విధంగా న్యాయం చేయగలమో ఆలోచించి చేయాలని కోరుకుంటున్నాను.
మీడియా బాధ్యతగా వ్యవహరించాలి….
ఇలాంటి సంఘటనలు పదే పదే పునరావృతం కావడం సమాజానికి అంత మంచిది కాదు. మీడియా కొన్ని సంఘటనలపై ఎక్కువగా ప్రచారం చేసి ఇలాంటి వాటిపై స్పందించకపోవడం సరికాదు. ఇలాంటి వ్యవహారాల్లో కూడా బాధ్యతగా ఉండాలి. ఏదో ఒక సంఘటనను పట్టుకుని హైలెట్ చేసి వదిలేయకుండా అన్యాయం జరిగినప్పుడు దాన్ని ఎక్కువ మందికి తెలియచేయాల్సిన అవసరం ఉంది. సోషల్ మీడియా ద్వారా ఈ ఘటన బయటకు వచ్చింది. జనసేన వీర మహిళా విభాగం నేతలు, విద్యార్ధి విభాగం నాయకులు సంపత్ నాయక్ లు విషయాన్ని నా దృష్టికి తీసుకువచ్చారు. ఇప్పటి వరకు నిందితుడు దొరకలేదని, తమకు న్యాయం జరగలేదని చిన్నారి తల్లిదండ్రులు బాధపడుతున్నారు. ఈ సందర్భంగా పోలీసు అధికారులకు నా తరఫున ఓ విన్నపం. బిడ్డ చనిపోయిన బాధలో ఉద్వేగాలు ఎక్కువగా ఉంటాయి. పెద్ద మనసుతో అర్ధం చేసుకోవాలి” అన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

యల్.బి.ఆర్.సి.ఈ లో ఐదవ రోజు అంతర్-రాష్ట్ర యువజన మార్పిడి కార్యక్రమం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : కేంద్ర యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించుచున్న, మై …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *