Breaking News

నైపుణ్య భారత్‌ మిషన్‌ లక్ష్యసాధనలో భారతీయ రైల్వే ముందడుగు…

-రైల్‌ కౌశల్‌ వికాస్‌ యోజన (ఆర్‌కెవివై) ప్రారంభించిన అశ్వినీ వైష్ణవ్‌
-దేశంలోని 75 రైల్వే శిక్షణా సంస్థల ద్వారా పారిశ్రామిక సంబంధిత ప్రవేశ స్థాయి నైపుణ్యత శిక్షణను రైల్వే అందిస్తుంది
-దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని మూడు ప్రాంతాలలో సుమారు 2,500 మందికి శిక్షణ ఇచ్చేందుకై ప్రణాళికలు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
పారిశ్రామిక సంబంధిత ప్రవేశ స్థాయి నైపుణ్యత శిక్షణను అందించడానికి చేపడుతున్న రైల్‌ కౌశల్‌ వికాస్‌ యోజన కార్యక్రమాన్ని రైల్వే, కమ్యునికేషన్స్‌, ఎలక్ట్రానిక్స్‌ మరియు సమాచార సాంకేతిక శాఖ మంత్రి  అశ్వినీ వైష్ణవ్‌ నేడు అనగా 17 సెప్టెంబర్‌ 2021 తేదీన రైల్‌ భవన్‌లో వర్చువల్‌ సమావేశం ద్వారా ప్రారంభించారు. ప్రధాన మంత్రి కౌశల్‌ వికాస్‌ యోజన (పీఎమ్‌కెవివై)లో భగంగా ఈ కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమం క్రింద భారతీయ రైల్వేలోని 75 శిక్షణ సంస్థల ద్వారా యువతకు శిక్షణ అందించబడుతుంది. ఈ కార్యక్రమంలో రైల్వే బోర్డు చైర్మన్‌ మరియు సీఈఓ సునీత్‌ శర్మ మరియు రైల్వేకు చెందిన పలు ఇతర సీనియర్‌ అధికారులు కూడా పాల్గొన్నారు. జోనల్‌ రైల్వేల జనరల్‌ మేనేజర్లు వర్చువల్‌గా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
రైల్‌ కౌశల్‌ వికాస్‌ యోజనలో భాగంగా, దక్షిణ మధ్య రైల్వేలోని మూడు ప్రధాన ప్రాంతాలైన సికింద్రాబాద్‌/హైదరాబాద్‌ ప్రాంతంలోని లాలాగూడ క్యారేజ్‌ వర్క్‌షాప్‌, విజయవాడ సమీపంలోని రాయనపాడు వ్యాగన్‌ వర్క్‌షాప్‌ మరియు తిరుపతిలోని క్యారేజ్‌ రిపేర్‌ షాప్‌ వద్ద ప్రాథమిక స్థాయిలోశిక్షణ కార్యక్రమం ప్రారంభిస్తుంది. ఫిట్టర్‌, మెకానిస్ట్‌, ఎలక్ట్రీషియన్‌ మరియు వెల్డింగ్‌ వంటి ప్రధాన నాలుగు విభాగాలలో పారిశ్రామిక శిక్షణ అందజేస్తారు. గుర్తించిన 4 విభాగాలకు అదనంగా దక్షిణ మధ్య రైల్వే మరిన్ని విభాగాలలో అభ్యర్థులకు శిక్షణ ఇచ్చి వారిలో నైపుణ్యత పెంపొందించి వారికి వివిధ పరిశ్రమలలో ఉపాధి అవకాశాలను పొందేందుకు తోడ్పడుతుంది.
ఈ శిక్షణలో థియరీ మరియు ప్రాక్టికల్స్‌ ఉంటాయి. 30% థియరీ మరియు 70% ప్రాక్టికల్స్‌ ఉంటాయి. ఇది శిక్షణ పొందే అభ్యర్థుల నైపుణ్యతకు తోడ్పడుతుంది. అభ్యర్థులకు దాదాపు 2 వారాలలో100 గంటల శిక్షణ ఉంటుంది. అభ్యర్థుల నైపుణ్యత పెంచడంతోపాటు పరిశ్రమల అవసరాలకు తగ్గట్టుగా వారిని తీర్చిదిద్దడం లక్ష్యంగా ఈ శిక్షణ కొనసాగుతుంది.
పూర్తిగా ఉచిత ప్రాతిపదికన వికాస్‌ యోజన కార్యక్రమం ద్వారా శిక్షణ కోసం ఆసక్తిగల అభ్యర్థులను ఆహ్వానిస్తూ దక్షిణ మధ్య రైల్వే ఇప్పటికే ప్రకటన జారీ చేసింది. అభ్యర్థులు 10వ తరగతి ఉత్తీర్ణులయి ఉండి 18`35 సంవత్సరాల మధ్య వయసు కలిగుండాలి. మొదటి బ్యాచ్‌ అభ్యర్థుల శిక్షణ 20 సెప్టెంబర్‌ 2021 తేదీ నుండి ప్రారంభమవుతుంది. మొదటి దశలో రెండు బ్యాచులలో లాలాగూడ క్యారేజ్‌ వర్క్‌షాప్‌ మరియు తిరుపతి క్యారేజ్‌ రిపేర్‌ షాపులలో చెరో100 మందికి, రాయనపాడు వ్యాగన్‌ వర్క్‌షాపులో 80 మందికి మొత్తం 280 మంది అభ్యర్థులకు మూడు ప్రాంతాల్లో శిక్షణ అందజేస్తారు.
రైల్వే ద్వారా చేపట్టిన ఈ వినూత్న కార్యక్రమంపై దక్షిణ మధ్య రైల్వే జనరల్‌ మేనేజర్‌ శ్రీ గజానన్‌ మాల్య ఆనందం వ్యక్తం చేశారు. ఈ శిక్షణ ద్వారా యువతలో నైపుణ్యాభివృద్ధి పెరుగుతుందని మరియు వివిధ పరిశ్రమలలో వారికి ఉపాధి మెరుగవుతుందని అన్నారు. అర్హులయిన అభ్యర్థులు శిక్షణ కోసం నమోదు చేసుకోవాలని మరియు ఆయా విభాగాలలో నైపుణ్యం అభివృద్ధికి ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఆయన యువతకు పిలుపునిచ్చారు.

Check Also

మాకు న్యాయం చేయండి…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఉద్యోగుల గృహ నిర్మాణ సంఘం పేరుతో ఏపీ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ మ్యూచువల్లీ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *