Breaking News

కరెంట్ ఛార్జీల పాపం ముమ్మాటికీ చంద్రబాబుదే…

-విద్యుత్ ట్రూఅప్ ఛార్జీల భారానికి గత ప్రభుత్వం అవలంభించిన అస్తవ్యవస్థ విధానాలే కారణం
-కరెంటు చార్జీలపై బహిరంగ చర్చకు సిద్ధం
-గుడ్ మార్నింగ్ విజయవాడ సెంట్రల్ కార్యక్రమంలో ఎమ్మెల్యే మల్లాది విష్ణు 

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విద్యుత్ ట్రూఅప్ ఛార్జీల విధింపునకు గత ప్రభుత్వ హయాంలో చంద్రబాబు అవలంభించిన విధానాలే కారణమని నియోజకవర్గ శాసనసభ్యులు మల్లాది విష్ణు  అన్నారు. గుడ్ మార్నింగ్ విజయవాడ సెంట్రల్ కార్యక్రమంలో భాగంగా 60వ డివిజన్ వాంబేకాలనీలోని ఈ, ఎఫ్ బ్లాక్ లలో వైఎస్సార్ సీపీ డివిజన్ కో-ఆర్డినేటర్ బెవర నారాయణతో కలిసి ఆయన పర్యటించారు. ఇంటింటికి వెళ్లి ప్రజా సమస్యలపై ఆరా తీశారు. ఈ సందర్భంగా పలువురు పెన్షన్, బియ్యం కార్డుదారుల సమస్యలకు అధికారులతో మాట్లాడి అక్కడికక్కడే పరిష్కరించారు. ప్రజా సమస్యల పరిష్కారంలో అధికారుల మధ్య సమన్వయం ప్రధానమని తెలియజేశారు. స్థానిక పార్కులో రెండు షటిల్ కోర్టుల ఏర్పాటుతో పాటు మరుగుదొడ్లకు మరమ్మతులు చేయవలసిందిగా అధికారులను ఆదేశించారు.

అనంతరం శాసనసభ్యులు మీడియాతో మాట్లాడారు. పెన్షన్ల విషయంలో ప్రతిపక్షాలు చేస్తున్న విష ప్రచారాలను నమ్మవద్దని ఈ సందర్భంగా ప్రజలకు సూచించారు. గత తెలుగుదేశం ప్రభుత్వం నాలుగున్నరేళ్ల వరకు రూ. 1000 మాత్రమే పింఛన్ అందించిందని.. కానీ జగనన్న ప్రభుత్తం తొలి నుంచి రూ. 2,250 అందజేయడం జరిగిందన్నారు. చంద్రబాబు ప్రభుత్వంలో 35 లక్షల మంది ఉన్న పెన్షన్ దారుల సంఖ్యను.. మానవీయ కోణంలో ఆలోచించి 61,46,908 కి పెంచడం జరిగిందన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం చేసిన తప్పిదాల కారణంగా అద్దెకు ఉంటున్న ప్రజలపై రెండు మూడు కరెంట్ బిల్లులు చూపుతున్నాయన్నారు. గత ప్రభుత్వ తప్పిదాలను సరిచేస్తూ.. ఈ ప్రభుత్వం ముందుకు వెళుతోందని తెలియజేశారు. త్వరలోనే వాటన్నింటినీ డీలింక్ చేయవలసిందిగా అధికారులను ఆదేశించినట్లు పేర్కొన్నారు. మరోవైపు నగర సుందరీకరణలో భాగంగా వాంబే కాలనీలో రూ. 10 కోట్ల వ్యయంతో సెంట్రల్ పార్కును ఏర్పాటు చేయబోతున్నట్లు ప్రకటించారు. గడిచిన రెండేళ్లలో నగరంలో రూ. 600 కోట్ల అభివృద్ధి పనులు జరుగుతున్నట్లు తెలియజేశారు. సెంట్రల్ నియోజకవర్గంలో 30 వేల ఇళ్లు మంజూరు కాగా.. తొలిదశలో 15వేల ఇళ్లనిర్మాణాలు చేపట్టామన్నారు. ఇందులో 3వ ఆప్షన్ గా ప్రజలు ఎంచుకున్నట్లు ప్రభుత్వం చేపడుతున్న 4వేల ఇళ్ల నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయన్నారు. ఆ పనులను ఇటీవల సంబంధిత శాఖామాత్యులు కూడా పర్యవేక్షించారన్నారు. సొంతిల్లు లేని నిరుపేదలు ఎవరైనా ఇంటి కోసం దరఖాస్తు చేసుకుంటే.. 90 రోజుల్లోగా మంజూరు అవుతుందన్నారు. సింగ్ నగర్ కు నూతన బస్టాండ్ మంజూరైందని.. త్వరలోనే భూమిపూజ చేయనున్నట్లు వెల్లడించారు. దీని ద్వారా రాబోయే రోజుల్లో ఆయా లేఅవుట్లకు ప్రయాణం సులభతరంగా కానుందని వెల్లడించారు. వాంబే కాలనీలో ఇళ్ల రిజిస్ట్రేషన్ల సమస్య శాశ్వత పరిష్కారానికి.. త్వరలోనే స్థానిక కమ్యూనిటీ హాల్లో రిజిస్ట్రేషన్ మేళా నిర్వహించి మూడు రోజుల పాటు ప్రజల నుంచి అర్జీలు స్వీకరిస్తామని మల్లాది విష్ణు తెలియజేశారు. కార్యక్రమంలో జోనల్ కమిషనర్ రాజు, ఎమ్మార్వో దుర్గాప్రసాద్, ఈఈ శ్రీనివాస్, వైఎస్సార్ సీపీ నాయకులు బత్తుల దుర్గాప్రసాద్, గోపి, సుభానీ, మూర్తి, నాని, కిరణ్, వీఎంసీ అధికారులు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

యల్.బి.ఆర్.సి.ఈ లో ఐదవ రోజు అంతర్-రాష్ట్ర యువజన మార్పిడి కార్యక్రమం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : కేంద్ర యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించుచున్న, మై …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *