Breaking News

వైసీపీ నేతల రౌడియిజం పరాకాష్టకు చేరింది…


-అమరావతి దళిత జేఏసీ నేత పులి చిన్నాపై వైసీపీ దాడి దుర్మార్గం
-వైసీపీ అరాచకాలు ఇన్నాళ్లు భరించాం.. ఇక నుంచి సహించం
-చట్ట వ్యతిరేకంగా పనిచేసిన పోలీసుల్ని చట్టపరంగా శిక్షించే వరకు వదలిపెట్టం
-టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు
-టైమ్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న దళిత జేఏసీ నేతకు బాబు పరామర్శ

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలో వైసీపీ అరాచాకాలు పరాకాష్టకు చేరాయని, ఇన్నాళ్లు మౌనంగా భరించామని ఇక నుంచి సహించబోమని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్ష్యులు నారా చంద్రబాబు నాయుడు అన్నారు. వైసీపీ ఎంపీ నందింగం సురేష్ అనుచరుల దాడిలో గాయపడి అశోక్ నగర్ లోని టైమ్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న అమరావతి దళిత జేఏసీ నాయకుడు పులి చిన్నాను సోమవారం చంద్రబాబు పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. “ప్రభుత్వ వైఫల్యాలపై వీరోచితంగా పోరాడుతున్న అమరావతి దళిత జేఏసీ నేత పులి చిన్నాపై కక్ష్య కట్టి వైసీపీ కార్యకర్తలు అతి దారుణంగా దాడి చేశారు. రాష్ట్రంలో వైసీపీ రౌడీయిజం పరాకాష్టకు చేరింది. చిన్నాపై దాడి చేయటమే కాక తిరిగి అతనిపై అక్రమంగా ఎదురు కేసులు పెట్టారు. పులి చిన్నాపై దాడి చేసిన వారిపై బెయిలబుల్ సెక్షన్లు పెట్టి, చిన్నాపై నాన్ బెయిలబబుల్ సెక్షన్ల కింద కేసులు పెట్టడం దుర్మార్గం. ఈ దాడులన్నింటికీ ముఖ్యమంత్రి జగన్ బాధ్యత వహించాలి. రాష్ట్రంలో నేరాలు ఘోరాలే నిత్యకృత్యంగా వైసీపీ పాలన సాగుతోంది. ప్రజలు తిరుగుబాటు చేస్తే వైసీపీ నాయకులు పారిపోక తప్పదు. పోలీసులు నిష్పక్షపాతంగా వ్యవహరించాలి. అధికార పార్టీ నాయకులు తప్పు చేసినా, ప్రతిపక్ష పార్టీలు తప్పు చేసినా అందర్నీ సమానంగా దండించాలి. అంతే తప్ప అధికారపార్టీకి కొమ్ము కాస్తు టీడీపీ నాయకులు, కార్యకర్తలపై అక్రమ కేసులు, తప్పుడు కేసులు బనాయిస్తే ఊరుకునే ప్రసక్తే లేదు. పోలీసులు చట్టం ప్రకారం పనిచేయకుండా చట్ట వ్యతిరేకంగా పనిచేస్తే.. చట్టం పరంగా శిక్షించే వరకు వదలి పెట్టం. వైసీపీ నాయకులు కూడా ఒక విషయం గుర్తు పెట్టుకోవాలి. టీడీపీ అధికారంలోకి వస్తే మీరేమీ ఆకాశంలో ఉండరు.. రాష్ట్రంలోనే ఉంటారు, తప్పు చేసిన ఎవ్వర్నీ వదలం. మీ బెదిరింపులకు భయపడం ప్రజల కోసం ప్రాణాలు పణంగా పెట్టి సేవ చేస్తాం. 22 సంవత్సరాలు టీడీపీ అధికారంలో ఉంది.. మేం కూడా ఇలానే వ్యవహరిస్తే ఇప్పుడు వైసీపీకి ఒక్క కార్యకర్త కూడా ఉండేవారు కాదు. టీడీపీ నాయకులపై దాడులు చేస్తే భయపడతారని అనుకుంటున్నారేమో.. మీ తాటాకు చప్పుళ్లకు భయపడేవారెవరు టీడీపీలో లేరు. మాజీ ముఖ్యమంత్రిగా, ప్రధాన ప్రతిపక్షనేతగా ఉన్న మా ఇంటిపైకి వైసీపీ ఎమ్మెల్యే రౌడీలను తీసుకుని వచ్చారు. ఇక్కడకి ఎందుకు వచ్చారని ప్రశ్నించిన టీడీపీ నాయకులు, కార్యకర్తలపై దాడి చేయటమే కాక అక్రమ కేసులు పెట్టారు. దాడి ఘటనపై ఫిర్యాదు చేసేందుక వెళ్లిన టీడీపీ నాయకులపైనా అక్రమ కేసులు పెట్టారు. పోలీసులున్నది ప్రజల మానప్రాణాలు, ఆస్తులు పరిరక్షణకే తప్ప ఏకపక్షంగా వ్యవహరించడానికి కాదు. ఇంత అరాచక పాలన ఎప్పుడూ చూడలేదు. నా జీవితంలో చట్టాలను ఎప్పుడు ఉల్లంఘించలేదు. నీతి, నిజాయతీలతో రాజకీయాలు చేసి ప్రజలకు సేవ చేశా. తిరుపతిలో బాంబులు పెట్టినా భయపడలేదు. వైసీపీ ప్రభుత్వం ఇన్నాళ్లు మా నాయకుల్ని, కార్యకర్తల్ని శారీరకంగా, మానసికంగా ఇబ్బందులు పెట్టినా మౌనంగా భరించాం. ఇక నుంచి సహించేది లేదు” అని చంద్రబాబు నాయుడు హెచ్చరించారు.
టైమ్ హాస్పిటల్ సీఎండీ డాక్టర్ పువ్వాడ రామకృష్ణతో మాట్లాడిన మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు దళిత జేఏసీ నేతకు మెరుగైన చికిత్స అందించాలని కోరారు. పులి చిన్నా ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని, అనుభవజ్ఞులైన వైద్య నిపుణుల చేత నాణ్యమైన చికిత్సలను అందిస్తున్నామని డాక్టర్ పువ్వాడ రామకృష్ణ చంద్రబాబుకు వివరించారు.

Check Also

4.06 లక్షల బాదితులకు వరద నష్టపరిహారంగా రూ.601 కోట్లు చెల్లింపు

-రాష్ట్ర రెవెన్యూ, రిజిస్ట్రేషన్ మరియు స్టాంప్స్ శాఖామాత్యులు అనగాని సత్యప్రసాద్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో ఈ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *