ఎన్నికల్లో ఓడించారనే రాష్ట్ర ప్రజలపై చంద్రబాబు కక్షగట్టారు… : ఎమ్మెల్యే మల్లాది విష్ణు 

-ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతీసేందుకు కుట్రలు పన్నుతున్నారు
-రాష్ట్రంలో తెలుగుదేశం వెంటిలేటర్ పై ఉంది
-పార్టీని కాపాడుకునేందుకు చంద్రబాబు డ్రామాలు
-బెజవాడపై విద్వేష పూరితంగా విషం చిమ్ముతున్న ప్రతిపక్షనేత
-గుడ్ మార్నింగ్ విజయవాడ సెంట్రల్ కార్యక్రమంలో ఎమ్మెల్యే మల్లాది విష్ణు 

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బ్రాండ్ ఇమేజ్ ను దెబ్బతీసే విధంగా చంద్రబాబు, ఆయన అనుచరగణం వ్యవహరిస్తున్నారని ఎమ్మెల్యే మ‌ల్లాది విష్ణు అన్నారు. గుడ్ మార్నింగ్ విజయవాడ సెంట్రల్ కార్యక్రమంలో భాగంగా వాంబే కాలనీలోని సి బ్లాక్ లో డివిజన్ కోఆర్డినేటర్ బెవర నారాయణతో కలిసి ఆయన పర్యటించారు. స్థానిక సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ప్రజలకు భరోసాని కల్పిస్తూ.. ఏడో రోజు పర్యటన సాగింది. డివిజన్ లో డ్రైనేజీ, మంచినీటి సమస్యలను త్వరితగతిన పూర్తి చేయవలసిందిగా అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు. మరీముఖ్యంగా పారిశుద్ధ్యంపై శానిటరీ ఇన్స్ పెక్టర్ నిరంతర పర్యవేక్షణ ఉండాలని.. క్రమం తప్పకుండా వివరాలు రిజిస్టర్ లో నమోదు చేయాలన్నారు. మరోవైపు బ్లేడ్ బ్యాచ్ అల్లర్లతో భయాందోళన చెందుతున్న ప్రజలు సమస్యను ఎమ్మెల్యే  దృష్టికి తీసుకొని వచ్చారు. ప్రాంతంలో నిఘాను పెంచి బ్లేడ్ బ్యాచ్ గ్యాంగ్ పై కఠిన చర్యలు తీసుకోవలసిందిగా పోలీస్ సిబ్బందిని ఆదేశించారు. విద్యార్థులు, ఉద్యోగస్తులు, కూలీల సౌకర్యార్థం సీ బ్లాక్ నుంచి ఉదయం బస్సు సర్వీసులను నడుపవలసిందిగా ఆర్టీసీ అధికారులతో శాసనసభ్యులు ఫోన్ లో మాట్లాడటం జరిగింది. అదేవిధంగా ఈ నెల 27, 28, 29 తేదీలలో స్థానిక కమ్యూనిటీ హాల్లో నిర్వహించనున్న ‘రిజిస్ట్రేషన్ మేళా’ పై స్థానికులకు విస్తృతంగా అవగాహన కల్పించవలసిందిగా అధికారులకు శాసనసభ్యులు సూచించారు.

అనంతరం శాసనసభ్యులు మీడియాతో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బ్రాండ్ ఇమేజ్ ను దెబ్బతీసే విధంగా బోండా ఉమా మాట్లాడటం బాధాకరమన్నారు. మాదవ ద్రవ్యాలకు, విజయవాడ నగరానికి ఎటువంటి సంబంధం లేదని సాక్షాత్తూ పోలీస్ ఉన్నతాధికారులు వెల్లడించినా.. పదేపదే నగర ప్రతిష్టను దెబ్బతీసే విధంగా దుష్ప్రచారం చేయడం సరికాదన్నారు. ఆంధ్రప్రదేశ్ పోలీసులకు దేశంలోనే ఒక మంచి గుర్తింపు ఉందని.. మీ నీచ రాజకీయ ప్రయోజనాల కోసం వారిపై బురద చల్లడం మంచిది కాదన్నారు. హత్యలు, అత్యాచారాలు, మహిళలపై వేధింపులు, దోపిడీలు, ఎస్టీ, ఎస్సీలపై నేరాలు, మాదక ద్రవ్యాలకు రాష్ట్రాన్ని కేరాఫ్ అడ్రస్ గా మార్చిన ఘనత గత చంద్రబాబు ప్రభుత్వానిదని గుర్తుచేశారు. గడిచిన ఐదేళ్ల పాలనలో రాష్ట్రంలో బీహార్ కి మంచి క్రైం రేటును పెంచేశారన్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి పాలనలో రాష్ట్రంలో నేరాల రేటు గణనీయంగా తగ్గిందన్నారు. సాక్షాత్తూ కేంద్ర హోం శాఖకు చెందిన ‘జాతీయ క్రైమ్‌ రికార్డ్స్‌ బ్యూరో (ఎన్‌సీఆర్‌బీ) ఇటీవల విడుదల చేసిన వార్షిక నివేదిక–2020నే ఇందుకు నిదర్శనమన్నారు. మరోసారి చంద్రబాబు సహా తెలుగుదేశం నాయకులు విజయవాడ నగర ప్రతిష్టను దిగజార్చే విధంగా వ్యాఖ్యలు చేస్తే నగర ప్రజలు చూస్తూ ఊరుకోబోరని హెచ్చరించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో నగరంలో అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నాయన్నారు. గత చంద్రబాబు పాలనలో నగరంలో అభివృద్ధి శిలాఫలకాలకే పరిమితమైందన్నారు. మరీ ముఖ్యంగా వాంబే కాలనీ పూర్తి నిర్లక్ష్యానికి గురైందని మండిపడ్డారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఆశించిన దానికన్నా మిన్నగా నగరంలో ప్రగతి పరుగులు పెడుతోందన్నారు. వైఎస్సార్ సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత డివిజన్ ను అన్ని విధాలా అభివృద్ధి పరుస్తున్నామన్నారు. నగర సుందరీకరణలో భాగంగా వాంబే కాలనీలో రూ. 10 కోట్ల వ్యయంతో సెంట్రల్ పార్కును ఏర్పాటు చేయబోతున్నట్లు ప్రకటించారు. దాబాకొట్ల సెంటర్ నుంచి వాంబే కాలనీ ‘సి’ బ్లాక్ వరకు రూ. 3 కోట్ల వ్యయంతో డస్ట్ ప్రూఫ్ రోడ్డు నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేయడం జరిగిందన్నారు. అదే విధంగా సి బ్లాక్ నుండి గుణదల రోడ్డు వరకు రైల్వే ట్రాక్ వెంబడి 80 అడుగుల బీటీ రోడ్డు నిర్మించబోతున్నట్లు వెల్లడించారు. సంక్షేమంలోనూ జగన్మోహన్ రెడ్డి  ప్రభుత్వానికి దేశంలో ఏ ప్రభుత్వం సాటి రాలేదన్నారు. వాలంటీర్ల వ్యవస్థ ద్వారా సంక్షేమ పథకాలు సకాలంలో గడపగడపకూ అందిస్తున్నామన్నారు. గత తెలుగుదేశం ప్రభుత్వం పేదల నుంచి డబ్బులు వసూలు చేసి ఇళ్లు నిర్మించకుండా మోసగించిందన్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఒక్క రూపాయి తీసుకోకుండా.. పేదలకు అన్ని మౌలిక సదుపాయాలతో పక్కా ఇళ్లను నిర్మించి ఇస్తోందన్నారు. రెండేళ్లుగా సంక్షేమ, అభివృద్ధి పథకాలతో సుపరిపాలన అందిస్తున్న సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ని పరిషత్ ఎన్నికల్లో ప్రజలు మనస్ఫూర్తిగా మరోసారి ఆశీర్వదించారన్నారు. దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి  ఆశీస్సులతో దేశంలో మండల, జిల్లా పరిషత్‌ ఎన్నికల చరిత్రలో వైఎస్సార్‌ సీపీ నూతన అధ్యాయాన్ని లిఖించిందని మల్లాది విష్ణు అన్నారు. ఎవరెన్ని కుట్రలు చేసినా, నిశ్శబ్దంగా బ్యాలెట్‌ ద్వారా ప్రజలు చంద్రబాబుకి బుద్ధి చెప్పారన్నారు. మరోవైపు స్వయంగా రంగంలోకి దిగుతానంటూ పవన్ కళ్యాణ్ ప్రభుత్వాన్ని బెదరించే ధోరణిలో మాట్లాడటం సరికాదన్నారు. సార్వత్రిక ఎన్నికల్లో ఆయన రంగంలోకి దిగిన రెండు స్థానాలలో ఫలితాలు ఏవిధంగా వచ్చాయో ప్రజలందరికి తెలుసన్నారు. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ప్రస్తుతం వెంటిలేటర్ పై నడుస్తోందని మల్లాది విష్ణు గారు అన్నారు. పార్టీని కాపాడుకునేందుకు చంద్రబాబు చివరకు సభ్యసమాజం తలదించుకునేలా వ్యాఖ్యలు చేస్తున్నారన్నారు. ఇప్పటికైనా బిసి ఎమ్మెల్యే జోగి రమేష్ పై దాడికి పశ్చాత్తాపంగా యావత్ బీసీ సోదరులకు చంద్రబాబు బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేకుంటే బడుగు బలహీన ప్రజలందరూ ఏకమై తిరగబడతారని హెచ్చరించారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ నాయకులు బత్తుల దుర్గారావు, రాజా, నాని, గోపి, సుభానీ, ఇస్మాయిల్, కిరణ్, దుర్గాప్రసాద్, కుమారి, బాబు, వీఎంసీ అధికారులు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.

Check Also

చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ కి కోటి విరాళం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ (CMRF) కోసం శశి విద్యా సంస్థల చైర్మన్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *